శ్రీలంక పర్యటన అనంతరం టీమిండియా సుదీర్ఘ విరామం లభించింది. దాదాపు నలభై రోజుల తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో వరుస సిరీస్‌లు ఆడనుంది. సెప్టెంబరు 19- అక్టోబరు 12 మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. అంతకంటే ముందు టీమిండియా క్రికెటర్లు దేశవాళీ టోర్నీలతో బిజీకానున్నట్లు సమాచారం.
కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దులిఫ్ ట్రోఫీ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఈ రెడ్‌బాల్ టోర్నమెంట్‌కు మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడం లేదని సమాచారం.
రోహిత్- కోహ్లి రీఎంట్రీ
కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ విజేతగా నిలవడంలో ఫాస్ట్ బౌలర్ బుమ్రాది కీలక పాత్ర. ఈ ఈవెంట్‌లో అతడు అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు బుమ్రా కూడా విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్- కోహ్లి రీఎంట్రీ ఇవ్వగా.. బుమ్రా మాత్రం సెలవులోనే ఉన్నాడు.
ఆసీస్‌తో సిరీస్ మరింత కీలకం
బంగ్లాదేశ్‌తో సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని భావించగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం విశ్రాంతి పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో టీమిండియాకు ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కీలకం కానుంది.
అందుకే విశ్రాంతి
అంతకంటే ముందే బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడాల్సి ఉన్నా.. ఆ జట్టుపై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది కాబట్టి.. బుమ్రా వంటి ప్రధాన బౌలర్ సేవలు అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అతడిపై పని భారం తగ్గించి.. గాయాల బారిన పడకుండా కాపాడుకునేందుకే మేనేజ్‌మెంట్.. బుమ్రాకు విశ్రాంతి పొడిగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే బుమ్రా సెలవులు పొడిగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బుమ్రా గనుక నిజంగానే బంగ్లాతో సిరీస్‌కు దూరమైతే హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నాడు. అలాకాకుండా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గనుక పునరాగమనం చేస్తే.. సిరాజ్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది.
ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం 0-2తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఇరవై ఏడేళ్ల తర్వాత మరోసారి లంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయింది.
చదవండి: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. 18 నెలల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ?
Comments
Please login to add a commentAdd a comment