Asia Cup, 2023 India vs Bangladesh, Super Fours: ఆసియా కప్-2023 సూపర్-4లో అద్బుత ప్రదర్శనలతో అదరగొట్టింది టీమిండియా. తద్వారా.. ఈ సారి వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక లీగ్ దశలో తదుపరి బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాతో నామమాత్రపు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఇలా అయితే బాగుంటుంది
కీలక ఆటగాళ్లపై పనిభారాన్ని తగ్గించడం సహా వన్డే ప్రపంచకప్-2023కి ముందు ఇతర ప్లేయర్ల సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ మేరకు యోచన చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్లేషకుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు రోజులు తగినంత విశ్రాంతి లేకుండా
కొలంబోలో జరుగుతున్న సూపర్-4 దశలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కారణంగా రిజర్వ్ డే కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మొదలైన మ్యాచ్.. సోమవారం ముగిసింది. ఇందులో గెలుపొందిన రోహిత్ సేన.. మళ్లీ 15 గంటల్లోపే శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
ఇక్కడా విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతా బాగానే ఉంది కానీ.. వరుసగా మూడు రోజుల పాటు(ఆది, సోమ, మంగళ) తగినంత విశ్రాంతి లేకుండా ఆడటం క్రికెటర్లపై ఒత్తిడి పెంచడం సహజం. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మకు కెప్టెన్‌గా అదనపు భారం.
నా వయసు 35
ఇక లంకతో మ్యాచ్‌కు ముందు కోహ్లి మాట్లాడుతూ.. తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఇలా వెనువెంటనే వన్డే ఆడటం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. తనకు నవంబరు నెలలో 35 ఏళ్లు అంటూ వయసును గుర్తు చేసుకుంటూ.. శరీరానికి కావాల్సినంత విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు.
టీ20లకు దూరంగానే
కాగా ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడటం లేదు. ఈ వెటరన్ స్టార్ల ప్రాధాన్యం దృష్ట్యా వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు మేనేజ్‌మెంట్ ఇలా విశ్రాంతినిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరి భారత జట్టు టైటిల్‌కు అడుగుదూరంలో ఉంది.
బుమ్రాను కాపాడుకోవాలి
ఇలాంటి సమయంలో నామమాత్రపు మ్యాచ్‌లో రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇస్తే ఫైనల్లో ఫ్రెష్‌గా రీఎంట్రీ ఇస్తారు. వీరిద్దరితో పాటు జస్‌ప్రీత్ బుమ్రా.. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘకాలం తర్వాత పునరాగమనం చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌కు సైతం బంగ్లాతో మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే బాగుంటుంది.
హార్దిక్ కెప్టెన్‌గా
కాగా ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే గైర్హాజరీ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపడతాడు. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం లాంఛనమే. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించే అవకాశం కూడా ఉంటుంది. బుమ్రా లేనట్లయితే మహ్మద్ షమీ మళ్లీ తుదిజట్టులోకి రావొచ్చు.
ఈ నేపథ్యంలో.. శుబ్‌మన్ గిల్‌కు జోడీగా.. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ప్రమోట్ అయితే, మూడో స్థానంలో సూర్య.. నాలుగో స్థానంలో అయ్యర్.. ఆ తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ టాప్-8లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.
చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Comments
Please login to add a commentAdd a comment