టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కాన్పూర్‌లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తొలుత తెలిపింది. అయితే, భోజన విరామ సమయం వరకూ వరణుడు కరుణించలేదు.
ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రీన్ పార్క్‌స్టేడియంలో ఆట ఆరంభమవుతుందని ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ.. అవుట్‌ఫీల్డ్ మొత్తం తడిగా ఉండటంతో శనివారం ఆటను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
తొమ్మిదేళ్లలో తొలిసారి
కాగా గత తొమ్మిదేళ్లలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్ మొత్తంలో ఒక రోజు ఆట ఇలా రద్దు కావడం ఇదే తొలిసారి. బెంగళూరులో 2015లో సౌతాఫ్రికాతో టెస్టులో సైతం ఇలాగే జరిగింది. నాడు మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇదిలా ఉంటే.. ఒకవేళ కాన్పూర్ టెస్టు కూడా ఫలితం తేలకుండా ముగిసిపోతే టీమిండియాకు కాస్త ఇబ్బందే.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రూపంలో కఠిన సవాలు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ప్రస్తుతం అగ్రస్థానంలోనే ఉంది. అయితే, బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే గనుక ఫైనల్ మార్గం మరింత సుగమమయ్యేది. ఎందుకంటే.. మిగిలిన ఎనిమిదింటిలో మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్ బెర్తు దాదాపుగా ఖరారవుతుంది. అయితే, ఆ ఎనిమిది టెస్టుల్లో టీమిండియాకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.
అంతా వరణుడి దయ!
సొంతగడ్డపై కివీస్‌తో మూడు టెస్టులు ఆడిన అనంతరం.. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. వీటిలో నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే.
ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ సేనకు ఇదేమీ అంత కష్టం కాకపోయినా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ డ్రా కాకుండా ఉంటే.. పని సులువవుతుంది. ఈ మ్యాచ్ సజావుగా సాగి.. టీమిండియా గెలిస్తే సరి. లేదంటే.. ఎంతో కొంత తలనొప్పి మాత్రం తప్పదు. అంతా వరణుడి దయ!
చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment