సాక్షి, క్రీడావిభాగం : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం...మరో 25 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉంది. కానీ కొడుకు భవిష్యత్తు కోసం దానిని వదిలేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. దానికి ఎంత ధైర్యం కావాలి? తన అబ్బాయి ఆటపై ఎంత నమ్మకం ఉండాలి. విశాఖపట్నానికి చెందిన ముత్యాల రెడ్డి కి ఆ నమ్మకం ఉంది. అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.
మున్ముందు ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయని తెలిసినా అన్నింటినీ తట్టుకునేందుకు రెడీ అన్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన కొడుకు టెస్టు క్రికెటర్‌గా మారి ఎందరో కలలు గనే మెల్‌బోర్న్ మైదానంలో సెంచరీ సాధించిన క్షణం ఆయన ఆనందం కన్నీళ్లుగా మారి కనిపించింది! తన కష్టం ఫలించిన రోజు ఆ పుత్రోత్సాహం గురించి చెప్పేందుకు ఎన్ని విశేషణాలు కూడా సరిపోవేమో.
ఆరేళ్ల వయసులో మొదలైన నితీశ్ రెడ్డి క్రికెట్ ఆట 12 ఏళ్లు వచ్చే సరికి పూర్తి స్థాయి క్రికెటర్‌గా మారాలనే కల వైపు అడుగులు వేసింది. ఏసీఏకు చెందిన కడప అకాడమీలో అండర్–14 విభాగంలో శిక్షణకు ఎంపికైన తర్వాత గమ్యంపై మరింత స్పష్టత వచ్చేసింది. ఇదే సమయంలో ముత్యాల రెడ్డి అనూహ్యం నిర్ణయం తీసుకున్నాడు.
ఉద్యోగరీత్యా రాజస్తాన్‌కు బదిలీ కాగా...అలా వెళితే తన కొడుకును తీర్చిదిద్దడం కష్టమవుతుందని ఆయన భావించాడు. అందుకే హిందుస్తాన్ జింక్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయంలో కొడుకు కోసం కేటాయించేశాడు. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్‌మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 1237 పరుగులు చేయడటంతో అతని సత్తా అందరికీ తెలిసింది.
176.71 సగటుతో 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో చేసిన ఆ పరుగులు బీసీసీఐ ఉత్తమ ఆటగాడి అవార్డును అందించాయి. నాగాలాండ్‌తో జరిగిన పోరులో 366 బంతుల్లో 60 ఫోర్లు, 7 సిక్స్‌లతో చేసిన 441 పరుగులు నితీశ్ ధాటిని చూపించాయి. అలా మొదలైన ప్రస్థానం అండర్–19 జట్టుతో పాటు ఆ తర్వాత ఆంధ్ర సీనియర్ టీమ్‌లో కూడా అవకాశం కల్పించాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ దూకుడును అభిమానులంతా చూశారు.
గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర తరఫున 25 వికెట్లు తీయడంతో అతని బౌలింగ్ పదును కూడా సెలక్టర్లకు అర్థమైంది. అందుకే జాతీయ జట్టులో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నితీశ్ తాజా ప్రదర్శన టెస్టు జట్టులో అతని స్థానాన్ని సుస్థిరం చేయడం ఖాయం. ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్‌లలో కూడా ఈ అబ్బాయి అద్భుతాలు చేయడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment