![No Place For: Shami On Why He Doesnt Represent UP In Domestic Cricket - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/25/shami.jpg.webp?itok=H-QMqqqx)
మహ్మద్ షమీ (PC: BCCI/X)
Mohammed Shami Comments: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అమ్రోహా జిల్లాలోని సహాస్‌పూరాలో జన్మించాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం యూపీకి ఎప్పుడూ ఆడలేదు షమీ. తన ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చిన బెంగాల్ జట్టుకే సేవలు అందించాడు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న షమీ.. ప్రస్తుతం భారత పేస్ త్రయంలో ముఖ్య సభ్యుడు. అంతేకాదు వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఈ రైటార్మ్ పేసర్ రికార్డులు సాధించాడు.
లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా అవార్డుతో ముగించి
భారత్ వేదికగా ప్రపంచకప్-2023 సందర్భంగా ఆరంభంలో ఆడలేకపోయినా.. తర్వాత వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఏకంగా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. టోర్నీ మొత్తంలో 24 వికెట్లు తీసి అవార్డు అందుకున్నాడు.
అంతాబాగానే ఉందని.. ఆఖర్లో
ఇన్ని ఘనతలు సాధిస్తున్న షమీ సొంత రాష్ట్రం తరఫున ఒక్కసారి కూడా ఆడలేకపోయాడు. ఇందుకు గల కారణాన్ని తాజాగా ప్యూమా షోలో వెల్లడించాడు షమీ. ‘‘రంజీ టీమ్ ట్రయల్స్ కోసం రెండుసార్లు వెళ్లాను. అంతబాగానే ఉందని చెప్పి ఆఖర్లో నాకు మొండిచేయి చూపేవారు.
మొదటి ఏడాదే చేదు అనుభవం ఎదురైనా.. నాలో ఆశావహ దృక్పథం కారణంగా మరోసారి ప్రయత్నించాం. కానీ మరుసటి ఏడాది కూడా అదే జరిగింది. ఆ సమయంలో నా సోదరుడు నాతోనే ఉన్నాడు. అపుడు చీఫ్‌గా ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి నా గురించి మాట్లాడాడు.
కుర్చీ కదపడం కాదు.. ఎత్తి కిందపడేస్తా.. కానీ
అందుకు బదులుగా అతడు ఇచ్చిన సమాధానం నా సోదరుడు జీవితంలో అంతకుముందెన్నడూ వినలేదు. అంత పరుషంగా మాట్లాడాడతను!! ‘‘నువ్వు నా కుర్చీని కదపగలిగితే.. మీ సోదరుడు సెలక్ట్ అయినట్లే.. అతడి కెరీర్ బాగుంటుంది. లేదంటే సారీ.. నేనేమీ చేయలేను!’’ అని నా సోదరుడితో అన్నాడు.
ఇందుకు బదులుగా.. ‘‘నేను కేవలం ఈ కుర్చీని కదపడం కాదు.. ఎత్తి కిందపడేయగల బలవంతుడిని. నా తమ్ముడికి టాలెంట్ ఉంటే సెలక్ట్ చేయండి. లేదంటే వదిలేయండి’’ అని గట్టిగానే సమాధానమిచ్చాడు.
అప్పుడు ఆ వ్యక్తి.. ‘‘ఇక్కడ బలవంతులకు.. బలంగా ఉండేవాళ్లకు చోటు లేదు’’అని ముఖం మీదే చెప్పాడు. దీంతో బయటకొచ్చిన నా సోదరుడు.. నా ఫామ్‌ను చించేసి ఇకపై నువ్వు యూపీకి ఆడే ప్రసక్తే లేదని చెప్పాడు’’ అంటూ గతం తాలుకు చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు 33 ఏళ్ల మహ్మద్ షమీ.
చదవండి: సచిన్, కోహ్లి కాదు! అత్యంత ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్?
Comments
Please login to add a commentAdd a comment