కోహ్లి నలువైపులా అద్భుత షాట్లతో చెలరేగిపోయాడు. ఎక్కడా తడబాటు లేకుండా, ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా పూర్తి స్పష్టతతో తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో ఎక్కడా అతను నియంత్రణ కోల్పోలేదు. ఈ ఏడాది అతని నుంచి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే!
అవును, ఇదంతా కోహ్లి మైదానం బయట ఆడిన తీరు! అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ కోల్పోయిన అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విరాట్ కొత్త విషయాలు బయటపెడుతూ స్వేచ్ఛగా మాట్లాడాడు. ‘పాయింట్ బ్లాంక్’ రేంజ్ సమాధానాలతో బీసీసీఐ పెద్దలకు సవాల్ విసిరాడు.
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం, నాయకత్వం కోల్పోవడంలో తన వైఫల్యం, కొత్త కెప్టెన్, కోచ్‌లతో తన సంబంధాలు, మైదానంలో వారికి తన సహకారం... ఇలా ప్రతీ అంశంలో కోహ్లి ఎక్కడా తప్పించుకునే ధోరణి చూపించకుండా సమాధానాలిచ్చాడు.
‘అదే కారణం కావచ్చు’
నా కెప్టెన్సీలో భారత జట్టు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నమెంట్ కూడా నెగ్గలేదనేది వాస్తవం. నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు. అది సరైందా కాదా అనే దానిపై చర్చ అనవసరం. ఆ నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను. దానికి సంబంధించి జరిగిన పరిణామాల గురించి నేను మాట్లాడుతున్నా. భారత కెప్టెన్సీ ఒక గౌరవం. ఇప్పటివరకు (వన్డేలకు సంబంధించి) పూర్తి నిజాయితీతో, అత్యుత్తమ సామర్థ్యంతో ఆ బాధ్యతను నిర్వర్తించా.
‘రోహిత్‌తో సమస్యే లేదు’
కెప్టెన్ అవక ముందు నుంచి కూడా జట్టు గెలుపు కోసం బాధ్యతగా పని చేశా. ఇకపై కూడా అది కొనసాగుతుంది. రోహిత్ శర్మ సమర్థుడైన నాయకుడు. మంచి వ్యూహచతురుడు. ఐపీఎల్‌తో పాటు భారత్‌కు సారథిగా వ్యవహరించిన కొన్ని మ్యాచ్‌లలో కూడా అది చూశాం. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా. భారత జట్టును దెబ్బతీసే ఎలాంటి పనులూ చేయను. నాకు, రోహిత్ శర్మకు మధ్య ఎప్పుడూ, ఎలాంటి విభేదాలు లేవు. గత రెండేళ్లుగా ఇదే వివరణ ఇచ్చీ ఇచ్చీ నేను అలసిపోయా. దక్షిణాఫ్రికాతో టెస్టులకు రోహిత్ దూరం కావడం నిరాశ కలిగించేదే. ఇంగ్లండ్‌లో ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకున్న రోహిత్ సఫారీలోనూ మంచి ఆరంభాలు ఇచ్చి ఉండేవాడు.
‘నా ఏకాగ్రత చెదరదు’
భారత జట్టుకు ఆడేందుకు నాకు ప్రత్యేకంగా ప్రేరణ అవసరం లేదు. మైదానం బయట వచ్చే ఇలాంటి వార్తలు నన్ను దెబ్బ తీయలేవు. ఇలాంటి కీలక పర్యటన కోసం అన్ని రకాలుగా సిద్ధమయ్యా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత జట్టును గెలిపించాలని కోరుకుంటున్నా. అనుభవం, ఆత్మవిశ్వాసంతో నిండిన మా టెస్టు జట్టు బలంగా ఉంది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్ గెలవాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో మేం సాధించిన విజయాలు అందుకు కావాల్సిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. జడేజా లేకపోవడం లోటే కానీ ఆ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు మా జట్టులో ఉన్నారు (జట్టు నేడు దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది).
‘నన్ను తప్పుకోవద్దని కోరలేదు’
టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది నా సొంత నిర్ణయం. ఇదే విషయాన్ని నేనే ముందుగా బీసీసీఐకి తెలియజేశాను. దానికి నేను చెప్పిన కారణాలతో వారు సంతృప్తి చెందారు. పైగా భవిష్యత్తు కోసం సరైన దిశలో చేసిన మంచి ఆలోచన అంటూ ప్రశంసించారు కూడా. టి20 కెప్టెన్‌గా రాజీనామా చేయవద్దని, కొనసాగాలని నన్ను ఎవరూ కోరలేదు (కెప్టెన్‌గా కొనసాగమని తాను కోరితే కోహ్లి నిరాకరించాడంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ). అదే సమయంలో నేను వన్డే, టెస్టు కొనసాగుతానని కూడా అన్నాను. మరో అంశంలో కూడా నా ఆలోచనల గురించి స్పష్టతనిచ్చాను. బోర్డు ఆఫీస్ బేరర్లు, సెలక్టర్లలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే నన్ను తప్పించవచ్చని కూడా చెప్పాను.
‘నాతో ఎవరూ మాట్లాడలేదు’
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం జట్టు ఎంపిక చేసేందుకు డిసెంబర్ 8న సమావేశం జరిగింది. అంతకుముందు ఎప్పుడూ నా వన్డే కెప్టెన్సీ గురించి అసలు చర్చ జరగనే లేదు. సరిగ్గా చెప్పాలంటే నేను టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోజు నుంచి అప్పటి వరకు బీసీసీఐ నుంచి నాతో ఎవరూ మాట్లాడనే లేదు. ఈ సమావేశానికి సరిగ్గా గంటన్నర ముందు మాత్రమే సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ నాకు ఫోన్ చేశారు. టెస్టు టీమ్ గురించి చర్చ జరిగిన తర్వాత ఫోన్ కాల్ ముగించే సమయంలో... ఐదురుగు సెలక్టర్లు కూడా నన్ను వన్డే కెప్టెన్‌గా కొనసాగించరాదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘సరే, మంచిది’ అని నేను సమాధానమిచ్చా. ఇదీ అక్కడ జరిగిన అసలు విషయం.
‘వన్డే సిరీస్‌కు సిద్ధం’
నేను దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటానంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం. అలా రాసిన వారికి ఎలాంటి విశ్వసనీయత లేదు. నేను ఎల్లప్పుడూ జట్టుకు అందుబాటులో ఉన్నాను. నాకు విశ్రాంతి ఇవ్వాలంటూ బోర్డును అసలు కోరనే లేదు. సఫారీలతో వన్డే సిరీస్ ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నా.
నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి
Published Thu, Dec 16 2021 5:29 AM | Last Updated on Thu, Dec 16 2021 2:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment