పారిస్: దిగ్గజాలు లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) లేకుండానే ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక పురస్కారంగా భావించే ‘బాలన్ డోర్’ 2024 అవార్డీల నామినీల జాబితా తయారైంది. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్లేయర్లకు ప్రతి ఏటా అందించే ఈ అవార్డును ఇప్పటి వరకు 37 ఏళ్ల మెస్సీ 8 సార్లు అందుకోగా... రొనాల్డో ఐదుసార్లు దక్కించుకున్నాడు.
ఈ ఏడాది అక్టోబర్ 28న ‘బాలన్ డోర్’ అవార్డులను ప్రదానం చేయనుండగా... దీని కోసం కుదించిన 30 మంది ప్లేయర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో మెస్సీ, రొనాల్డోకు చోటు దక్కలేదు. ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబాపె, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్, స్పెయిన్ యువ స్ట్రయికర్ లామినె తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
మెస్సీ, రొనాల్డో రేసులో లేకపోవడం 2003 తర్వాత ఇదే తొలిసారి. 2006లో మొదటిసారి ‘బాలన్ డోర్’ పురస్కారానికి నామినేట్ అయిన మెస్సీ... 2009లో తొలి అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు 2004లో మొదటిసారి నామినేట్ అయిన రొనాల్డో... ఐదుసార్లు అవార్డు అందుకున్నాడు.
కాగా యూరోపియన్ లీగ్‌ల్లో ప్రదర్శన ఆధారంగానే ఈ పురస్కారాన్ని అందించడం ఆనవాయితీ. ప్రస్తుతం మెస్సీ అమెరికా లీగ్‌లలో... రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్–నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే వీరిద్దరిని బాలన్ డోర్ అవార్డుకు నామినేట్ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment