జొకోవిచ్‌ మనసు మార్చుకున్నాడు | Novak Djokovic Confirms He Will Participate At US Open | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ మనసు మార్చుకున్నాడు

Published Thu, Aug 13 2020 7:43 PM | Last Updated on Thu, Aug 13 2020 7:47 PM

Novak Djokovic Confirms He Will Participate At US Open - Sakshi

బెల్‌గ్రేడ్‌: ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం తాను యూఎస్‌ ఓపెన్‌ ఆడలేమోనని అనుమానం వ్యక్తం చేసిన జొకోవిచ్‌.. తాజాగా  ప్రతిష్టాత్మక గ్రాండ్‌ స్లామ్‌కు సిద్ధం అంటూ వెల్లడించాడు. కరోనా మహమ్మారితో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో పలువురు అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారులు అనవసరమైన రిస్క్‌ తీసుకోకూడదనే కొంతమంది అగ్రశ్రేణి క్రీడాకారులు యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నారు. వీరిలో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ కూడా ఉన్నాడు. జొకోవిచ్‌, నాదల్‌లు యూఎస్‌ ఓపెన్‌ ఆడకపోతే కళ తప్పుతుందనే భావించిన గ్రాండ్‌ స్లామ్‌ యాజమాన్యానికి జొకోవిచ్‌ ఆడతానంటూ ప్రకటించడం ఉపశమనం కల్గించే  అంశం.(డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ కూడా...)

‘నేను యూఎస్‌ ఓపెన్‌ ఆడటానికి చాలా సంతోషంగా ఉన్నా. వెస్ట్రన్‌, సౌత్రన్‌ ఓపెన్‌లతో పాటు యూఎస్‌ ఓపెన్‌లో కూడా పాల్గొనబోతున్నా. ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా అంశాలు పరిశీలించిన తర్వాత ఎంతో కష్టంగా తీసుకున్న నిర్ణయం​. యూఎస్‌ ఓపెన్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం​. ఈసారి ప్రోటోకాల్స్‌ భిన్నంగానే ఉండబోతున్నాయి. ఆటగాళ్ల రక్షణే లక్ష్యంగా కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటిస్తూ యూఎస్‌ ఓపెన్‌ ఆడతా. నాకు అన్ని చెకప్‌లు పూర్తయ్యాయి. నేను పూర్తిగా కోలుకున్నా. ఇక నా అత్యుత్తమ టెన్నిస్‌ ఆడటానికి సిద్ధంగా ఉ‍న్నా. కొత్త వాతావరణంలో ఆడటానికి నన్ను నేను పూర్తిగా మార్చుకుంటున్నా’ అని జొకోవిచ్‌ తెలిపాడు. జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌కు ఓకే చెప్పిన నేపథ్యంలో రఫెల్‌ నాదల్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి. ఈనెల 31 నుంచి యూఎస్‌ ఓపెన్‌ ఆరంభం కానుంది. బయో సెక్యూర్‌ పద్ధతిలో యూఎస్‌ ఓపెన్‌ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement