లండన్ :వరుసగా నాలుగో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు తొలి రౌండ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. సోమవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ జొకోవిచ్ 2 గంటల 27 నిమిషాల్లో 6–3, 3–6, 6–3, 6–4తో 81వ ర్యాంకర్ సూన్‌వూ క్వాన్ (దక్షిణ కొరియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
మొత్తం 15 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. ఇప్పటికి ఆరుసార్లు వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్‌కిది ఈ టోర్నీ చరిత్రలో 80వ విజయం కావడం విశేషం. తద్వారా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కనీసం 80 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు.
ఏడో సీడ్ హుర్కాజ్ అవుట్
మరోవైపు ఏడో సీడ్, గత ఏడాది సెమీఫైనలిస్ట్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 3 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫోకినా (స్పెయిన్) 7–6 (7/4), 6–4, 5–7, 2–6, 7–6 (10/8)తో హుర్కాజ్‌పై సంచలన విజయం సాధించి తొలిసారి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 7–6 (7/1), 7–6 (11/9), 6–2తో వినోలాస్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 6–0, 7–6 (7/3), 6–3తో అందుజార్ (స్పెయిన్)పై గెలిచారు.
రాడుకానూ ముందంజ
మహిళల సింగిల్స్‌లో బ్రిటన్ ఆశాకిరణం, పదో సీడ్ ఎమ్మా రాడుకానూ, మూడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), రెండో సీడ్ కొంటావీట్ (ఎస్తోనియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో రాడు కానూ 6–4, 6–4తో అలీసన్ వాన్ ఉత్కావంక్ (బెల్జియం)పై, జబర్ 6–1, 6–3తో మిర్జామ్ జోర్క్‌లుండ్ (స్వీడన్)పై, కొంటావీట్ 7–5, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment