లేదంటే రాబోయే రోజుల్లో చెస్ ప్లేయర్లు కనిపించరు
అమ్మగా మారాక ఆట మారింది
భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మనోగతం
న్యూఢిల్లీ: మహిళల చెస్‌కు మన దేశంలో మరింత ప్రోత్సాహం అందించాలని, లేదంటే రాబోయే రోజుల్లో మంచి ప్లేయర్లు రావడం తగ్గిపోతుందని భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి, వరల్డ్ ర్యాపిడ్ మాజీ చాంపియన్ కోనేరు హంపి అభిప్రాయ పడింది. ఇందులో భాగంగా ఎక్కువ సంఖ్యలో టోర్నీలు నిర్వహించాలని ఆమె సూచించింది.
ఇటీవలి కాలంలో గుకేశ్, ప్రజ్ఞానంద తదితరుల ఆటతో పురుషుల విభాగంలో చెస్‌కు ప్రాచుర్యం బాగా పెరిగింది. అయితే మహిళల విభాగంలో మాత్రం పరిస్థితి అలా లేదు. ఇప్పటికి 37 ఏళ్ల హంపి, 33 ఏళ్ల ద్రోణవల్లి హారికలే ప్రపంచ వేదికపై మన చెస్‌ను నడిపిస్తున్నారు. ‘మహిళా చెస్ ప్లేయర్ల శాతం చాలా తక్కువగా ఉంది. మనం మరిన్ని మహిళా టోర్నీలు నిర్వహించాలని నా అభిప్రాయం.
ప్రతిభావంతులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెస్ భవిష్యత్తు కోసం ఇది ఎంతో ముఖ్యం. లేదంటే ఇద్దరు, ముగ్గురికి మించి టాప్ ప్లేయర్లు ఉండరు. రాబోయే తరంపై దృష్టి పెట్టకపోతే చెస్ ఆటగాళ్లు వెలుగులోకి రావడం కష్టంగా మారి అంతరం చాలా పెరిగిపోతుంది. వచ్చే 10–15 ఏళ్లలో కూడా మీకు మంచి ఆటగాళ్లు కనిపించరు’ అని హంపి ఆందోళన వ్యక్తం చేసింది.
చైనాను చూసి నేర్చుకోవాలి
భవిష్యత్ ఆటగాళ్లను ఎలా తయారు చేసుకోవాలనే విషయంలో చైనాను చూసి భారత్ ఎంతో నేర్చుకోవాలని హంపి వ్యాఖ్యానించింది. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత చైనా చెస్‌లో పవర్‌హౌస్‌గా ఎదిగిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ‘ఈ విషయంలోనే భారత్, చైనాకు మధ్య చాలా తేడా ఉంది. చైనాలో ఒకరి తర్వాత మరొకరు కొత్త ప్లేయర్ వెంటవెంటనే వచ్చేస్తుంటారు.
ఒక అగ్రశ్రేణి ప్లేయర్ కెరీర్ ముగుస్తున్న దశలో కొత్త తరం ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. మన దేశంలో మహిళల చెస్‌పై ఫెడరేషన్ మరింత దృష్టి పెట్టాలి’ అని హంపి పేర్కొంది. కోవిడ్ సమయంలో ఇతర క్రీడా పోటీలన్నీ దాదాపుగా రద్దు కాగా... ఆన్‌లైన్ టోర్నీల కారణంగా చెస్ మాత్రమే బాగా ప్రజాదరణ పొందిందని హంపి చెప్పింది. ‘కోవిడ్ సమయాన్ని సానుకూలంగా వాడుకున్న క్రీడ చెస్ మాత్రమే.
ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ టోర్నీలు జరిగాయి. ఇతర పనులేవీ లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఆ సమయంలో మన దేశంలో చెస్ దూసుకుపోయింది కెప్టెన్. ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి లాంటివారు కూడా కోవిడ్ సమయంలో పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడారు. తర్వాతి రోజుల్లో ఇదే జోరును కొనసాగించి వారి రేటింగ్‌ను మెరుగుపర్చుకున్నారు’ అని హంపి విశ్లేíÙంచింది.
సరైన ప్రాక్టీస్ లేకనే...
తన కూతురి వయసు పెరుగుతుండటంతో చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని హంపి వెల్లడించింది. ‘పాపకు ఇప్పుడు ఏడేళ్లు. ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడైతే ఇంట్లో అమ్మ దగ్గర వదిలి టోర్నీలకు వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడు అలా సాధ్యం కావడం లేదు. స్కూల్ హోమ్‌వర్క్, ఆటలు... ఎక్కడైనా నేను తనతో ఉండాలని ఆమె కోరుకుంటోంది. దాంతో ప్రాక్టీస్‌కు సమయం లభించక టోర్నీలకు దూరమవుతున్నా.
అయితే అమ్మగా మారిన తర్వాత నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు చిన్నపాటి అంతరాయం వచ్చినా నా ఏకాగ్రత చెదిరిపోయేది. ఇప్పుడు అలా కాదు. గతంలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతోనే ఆడేదాన్ని. ఇప్పుడు స్థితప్రజ్ఞత వచ్చింది’ అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వివరించింది.
ప్రస్తుతం బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఒలింపియాడ్‌కు దూరంగా ఉన్న హంపి త్వరలో జరిగే గ్లోబల్ చెస్ లీగ్‌లో ముంబా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగనుంది. ఆ తర్వాత కజకిస్తాన్‌లో జరిగే మహిళల గ్రాండ్‌ప్రి, టాటా స్టీల్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment