గువహటి: ఆసియా కప్‌లో విజేత, ఆపై ఆ్రస్టేలియాలాంటి పటిష్టమైన జట్టుపై సిరీస్ విజయం... సరిగ్గా చెప్పాలంటే వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టుకు సరైన సన్నాహకం లభించింది. కొత్తగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లో పరీక్షించుకునేందుకు ఏమీ లేదు. వరల్డ్ కప్ జట్టులోని ఆటగాళ్లంతా సత్తా చాటి తమ స్థానాలను ఖాయం చేసుకోగా, చివరి నిమిషంలో జట్టుతో చేరిన అశి్వన్ కూడా ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో తన విలువేంటో చూపించాడు.
అయితే ప్రపంచకప్‌కు ముందు మరో అగ్రశ్రేణి జట్టుతో పోరు అంటే ఉదాసీనతకు తావు లేకుండా మరోసారి తమ అ్రస్తాలను చక్కదిద్దుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు తమ తొలి వామప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. తమ రెండో వామప్ మ్యాచ్‌లో చిన్న జట్టయిన నెదర్లాండ్స్ ప్రత్యర్థి కావడంతో ఈ తొలి పోరు టీమిండియాకు సరైన సాధన కానుంది. రాజ్‌కోట్ నుంచి నేరుగా గువహటి చేరిన భారత జట్టుకు శుక్రవారం ఆప్షనల్ ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే నలుగురు భారత ఆటగాళ్లు గిల్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, అశి్వన్ దీనికి హాజరయ్యారు.
అశ్విన్ తన ఆటకు మరింత పదును పెట్టుకుంటూ సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడు. వామప్ మ్యాచే అయినా ఇంగ్లండ్‌లాంటి భారీ హిట్టర్లు ఉన్న టీమ్‌పై అతను ఎలా ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం. తుది జట్టులో ఎనిమిదో స్థానం కోసం పిచ్ పరిస్థితులను బట్టి అశి్వన్, శార్దుల్ మధ్యే పోటీ ఉంది. ఈ నేపథ్యంలో శార్దుల్ కూడా తన బౌలింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది.
ఆసీస్‌తో చివరి మ్యాచే ఆడిన రోహిత్, కోహ్లి... ఆ మ్యాచ్‌కు దూరమైన గిల్, పాండ్యా మరింత ప్రాక్టీస్ కోసం కచి్చతంగా ఈ మ్యాచ్ బరిలోకి దిగవచ్చు. నిబంధనల ప్రకారం 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేయవచ్చు కాబట్టి అందరినీ పరీక్షించుకునేందుకు కూడా ఇది తగిన అవకాశం. మరోవైపు 38 గంటల పాటు ప్రయాణించిన తర్వాత గురువారం రాత్రి గువహటి చేరిన ఇంగ్లండ్ జట్టు సభ్యులు తీవ్ర అలసటతో ఉన్నారు. వారు కోలుకొని మ్యాచ్‌లో సత్తా చాటగలరా లేక ప్రధాన ఆటగాళ్లంతా మైదానంలోకి దిగకుండా తప్పుకుంటారా చూడాలి.
జేసన్ రాయ్‌లాంటి హిట్టర్ స్థానంలో చివరి నిమిషంలో చోటు దక్కించుకున్న హ్యారీ బ్రూక్‌కు వరల్డ్ కప్ పెద్ద పరీక్ష. వామప్‌లో అతను భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోగలడనేది ఆసక్తికరం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఒక్క సెంచరీ చేసిన మ్యాచ్ మినహా మిగతా అన్నింటిలో అతను విఫలమయ్యాడు. పదో నంబర్ వరకూ బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండటం ఆ జట్టు బలం. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2–1తో గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment