ODI World Cup campaign
-
ICC ODI World Cup 2023, India vs Netherlands: భారత్ 9/9
సంపూర్ణం... లీగ్ దశలో భారత్ జైత్రయాత్ర! నెదర్లాండ్స్ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్ ప్రాక్టీస్‌తో టీమిండియా ముగించింది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ఫిఫ్టీలతో.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్; కేఎల్ రాహుల్ సెంచరీలతో డచ్ బౌలర్లను నెట్ ప్రాక్టీస్‌లో ఆడుకున్నంత ఈజీగా ఆడేశారు. అనంతరం ఏకంగా 9 మంది భారత బౌలర్లు నెదర్లాండ్స్ బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. చివరకు భారీ విజయ సాధించిన రోహిత్ శర్మ బృందం అజేయంగా లీగ్ దశను పూర్తిచేసి బుధవారం న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ పోరుకు సై అంటోంది. బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో భారత్ వంద శాతం అంకితభావంతో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో లీగ్ దశను అజేయంగా దాటింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. క్రికెట్ కూనపై టాస్ గెలవగానే బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు శతకాన్ని... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీని సాధించారు. రోహిత్ శర్మ (54 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోహ్లి (56 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజ నిడమనూరు (39 బంతుల్లో 54; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరిపించాడు. బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా 2 వికెట్లు తీస్తే... కోహ్లి, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది. ఐదుగురూ చితగ్గొట్టారు... ఓపెనర్లు రోహిత్ బౌండరీలతో... శుబ్‌మన్ సిక్సర్లతో భారత్ 10 ఓవర్లలోనే 91/0 స్కోరు చేసింది. 30 బంతుల్లోనే గిల్ ఫిఫ్టీ పూర్తవగానే నిష్క్రమించాడు. 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి వచ్చాక కెపె్టన్ రోహిత్ 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికే అతనూ పెవిలియన్ చేరాడు. కోహ్లి, అయ్యర్ జోడీ కూడా పాతుకుపోవడంతో డచ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 53 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకోగా, భారత్ స్కోరు 29వ ఓవర్లో 200 దాటింది. అక్కడే కోహ్లి వికెట్ పడింది. ఇక్కడితో అర్ధశతకాల ఆట ముగియగా... శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాల బ్యాటింగ్‌ను చూపెట్టారు. 48 బంతుల్లో అయ్యర్, 40 బంతుల్లో రాహుల్ అర్ధశతకాలు సాధించారు. 42వ ఓవర్లో భారత్ 300 పరుగులు చేయగా... ఆ తర్వాత రాహుల్ ఆట పూర్తిగా మారింది. పరుగుల వేగం పుంజుకుంది. అయ్యర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఆఖరి 8.2 ఓవర్లలోనే భారత్ 110 పరుగులు చేసింది. 49వ ఓవర్లో అయ్యర్ మూడు సిక్స్‌లు, ఒక బౌండరీతో 25 పరుగులు పిండుకుంటే... ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదిన రాహుల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. దీంతో భారత్ స్కోరు 400 మార్క్ దాటింది. ఐదో బంతికి రాహుల్ అవుటయ్యాడు. రాహుల్, అయ్యర్ 208 పరుగులు జోడించి ప్రపంచకప్ చరిత్రలో నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు సృష్టించారు. కూన కుదేల్ లక్ష్యం కొండంత ఉన్నా దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా నెదర్లాండ్స్ బ్యాటర్లు తమ వంతుకు వచ్చిన ఆటే ఆడారు. మ్యాక్స్ ఒ డౌడ్ (30), అకెర్మన్ (35), సైబ్రాండ్ (80 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. విజయవాడలో జని్మంచి నెదర్లాండ్స్‌లో స్థిరపడ్డ తేజ నిడమనూరు మిడిలార్డర్లో కాసేపు భారీ సిక్సర్లతో మురిపించాడు. అయ్యర్, కీపర్ రాహుల్ మినహా 9 మంది భారత తరఫున బౌలింగ్‌కు దిగారు. ప్రధాన బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక చేయివేశారు. తేజ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తికాగానే ఆ మెరుపులకు రోహిత్ స్వయంగా బౌలింగ్ చేసి ముగింపు పలికాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వెస్లీ (బి) లీడే 61; గిల్ (సి) తేజ (బి) మీకెరన్ 51; కోహ్లి (బి) మెర్వ్ 51; అయ్యర్ (నాటౌట్) 128; రాహుల్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 102; సూర్యకుమార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–100, 2–129, 3–200, 4–408. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–52–0, వాన్ బిక్ 10–0–107–0, అకెర్మన్ 3–0–25–0, మీకెరన్ 10–0–90–1, వాన్‌డెర్ మెర్వ్ 10–0–53–1, బస్ డి లీడే 10–0–82–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; ఒ డౌడ్ (బి) జడేజా 30; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 35; సైబ్రాండ్ (బి) సిరాజ్ 45; ఎడ్వర్డ్స్ (సి) రాహుల్ (బి) కోహ్లి 17; లీడే (బి) బుమ్రా 12; తేజ (సి) షమీ (బి) రోహిత్ 54; వాన్ బిక్ (బి) కుల్దీప్ 16; మెర్వ్ (సి) షమీ (బి) జడేజా 16; ఆర్యన్ (బి) బుమ్రా 5; మీకెరన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 250. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–111, 5–144, 6–172, 7–208, 8–225 9–236, 10–250. బౌలింగ్: బుమ్రా 9–1–33–2, సిరాజ్ 6–1–29–2, షమీ 6–0–41–0, కుల్దీప్ 10–1–41–2, జడేజా 9–0–49–2, కోహ్లి 3–0–13–1, గిల్ 2–0–11–0, సూర్యకుమార్ 2–0–17–0, రోహిత్ 0.5–0–7–1. 9: ఒకే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. 2003 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా జట్టు 2003, 2007 ప్రపంచకప్‌లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. 7: వన్డేల్లో 400 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం భారత్‌కిది ఏడోసారి. దక్షిణాఫ్రికా జట్టు అత్యధికంగా 8 సార్లు ఈ మైలురాయిని దాటింది. 9: ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలిసారి భారత్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ వేయించింది. గతంలో ఇంగ్లండ్ (1987లో శ్రీలంకపై), న్యూజిలాండ్ (1992లో పాకిస్తాన్‌పై) జట్లు మాత్రమే తొమ్మిది మంది బౌలర్లకు అవకాశం ఇచి్చంది. 24: ఈ ఏడాది వన్డేల్లో భారత్ సాధించిన విజయాలు. 1998లోనూ భారత్ అత్యధికంగా 24 వన్డేల్లో గెలిచింది. 60: ఒకే ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ (60) నిలిచాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 58 సిక్స్‌లు కొట్టాడు. 215: ఈ ఏడాది భారత జట్టు 30 వన్డేలు ఆడి కొట్టిన సిక్స్‌లు. 2019లో వెస్టిండీస్ అత్యధికంగా 209 సిక్స్‌లు కొట్టింది. -
అన్ని అస్త్రాలతో సిద్ధం
గువహటి: ఆసియా కప్‌లో విజేత, ఆపై ఆ్రస్టేలియాలాంటి పటిష్టమైన జట్టుపై సిరీస్ విజయం... సరిగ్గా చెప్పాలంటే వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టుకు సరైన సన్నాహకం లభించింది. కొత్తగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లో పరీక్షించుకునేందుకు ఏమీ లేదు. వరల్డ్ కప్ జట్టులోని ఆటగాళ్లంతా సత్తా చాటి తమ స్థానాలను ఖాయం చేసుకోగా, చివరి నిమిషంలో జట్టుతో చేరిన అశి్వన్ కూడా ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో తన విలువేంటో చూపించాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు మరో అగ్రశ్రేణి జట్టుతో పోరు అంటే ఉదాసీనతకు తావు లేకుండా మరోసారి తమ అ్రస్తాలను చక్కదిద్దుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు తమ తొలి వామప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. తమ రెండో వామప్ మ్యాచ్‌లో చిన్న జట్టయిన నెదర్లాండ్స్ ప్రత్యర్థి కావడంతో ఈ తొలి పోరు టీమిండియాకు సరైన సాధన కానుంది. రాజ్‌కోట్ నుంచి నేరుగా గువహటి చేరిన భారత జట్టుకు శుక్రవారం ఆప్షనల్ ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే నలుగురు భారత ఆటగాళ్లు గిల్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, అశి్వన్ దీనికి హాజరయ్యారు. అశ్విన్ తన ఆటకు మరింత పదును పెట్టుకుంటూ సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడు. వామప్ మ్యాచే అయినా ఇంగ్లండ్‌లాంటి భారీ హిట్టర్లు ఉన్న టీమ్‌పై అతను ఎలా ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం. తుది జట్టులో ఎనిమిదో స్థానం కోసం పిచ్ పరిస్థితులను బట్టి అశి్వన్, శార్దుల్ మధ్యే పోటీ ఉంది. ఈ నేపథ్యంలో శార్దుల్ కూడా తన బౌలింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది. ఆసీస్‌తో చివరి మ్యాచే ఆడిన రోహిత్, కోహ్లి... ఆ మ్యాచ్‌కు దూరమైన గిల్, పాండ్యా మరింత ప్రాక్టీస్ కోసం కచి్చతంగా ఈ మ్యాచ్ బరిలోకి దిగవచ్చు. నిబంధనల ప్రకారం 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేయవచ్చు కాబట్టి అందరినీ పరీక్షించుకునేందుకు కూడా ఇది తగిన అవకాశం. మరోవైపు 38 గంటల పాటు ప్రయాణించిన తర్వాత గురువారం రాత్రి గువహటి చేరిన ఇంగ్లండ్ జట్టు సభ్యులు తీవ్ర అలసటతో ఉన్నారు. వారు కోలుకొని మ్యాచ్‌లో సత్తా చాటగలరా లేక ప్రధాన ఆటగాళ్లంతా మైదానంలోకి దిగకుండా తప్పుకుంటారా చూడాలి. జేసన్ రాయ్‌లాంటి హిట్టర్ స్థానంలో చివరి నిమిషంలో చోటు దక్కించుకున్న హ్యారీ బ్రూక్‌కు వరల్డ్ కప్ పెద్ద పరీక్ష. వామప్‌లో అతను భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోగలడనేది ఆసక్తికరం. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరపున ఒక్క సెంచరీ చేసిన మ్యాచ్ మినహా మిగతా అన్నింటిలో అతను విఫలమయ్యాడు. పదో నంబర్ వరకూ బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండటం ఆ జట్టు బలం. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2–1తో గెలుచుకుంది. -
ODI WC: కౌంట్‌డౌన్ మొదలు...
ఈ శీతాకాలం మునుపటిలా చల్లగా ఉండదు. వన్డే ప్రపంచకప్‌తో హీటెక్కనుంది. ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ మజాను పంచనుంది. భారీ స్కోర్లతో, వీర విహారాలతో సాగిపోనుంది. బంతి, బ్యాట్ పైచేయి తేల్చుకునేందుకు సమాయాత్తమైంది. బోరుకొట్టే మ్యాచ్‌లు కాకుండా... హోరెత్తించే షోలతో ఈ మెగా ఈవెంట్ మురిపించేందుకు సిద్ధమైంది. సెంచరీలు కొట్టే బ్యాటర్లు, హ్యాట్రిక్స్ వికెట్లు తీసే బౌలర్లు... ప్రపంచకప్ కలను సాకారం చేసుకునేందుకు తాజా దిగ్గజాలు సై అంటే సై అంటున్నారు. ముంబై: వన్డే ప్రపంచకప్ అంకానికి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. 12 ఏళ్ల తర్వాత భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తోంది. ఈసారి మాత్రం ఒంటరిగా నిర్వహించనుండటం ఈ కప్కున్న మరో ప్రత్యేకత. అందుకేనేమో అన్ని అనుకూల, ప్రతికూల అంశాలను పరిశీలించి.... అంతా కసరత్తు చేశాకే ఆలస్యంగా కేవలం వంద రోజుల ముందే షెడ్యూల్ విడుదల చేశారు. గతంలో ఓ ఏడాది ముందే ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఖరారు చేసేది. వాన ముప్పున్న వేదికల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లను కేటాయించలేదు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ముంబైలో విడుదల చేసింది. అక్టోబర్ 5న తెరలేచే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి నవంబర్ 19న జరిగే టైటిల్ పోరుతో తెరపడనుంది. గత ఫార్మాటే ఈ మెగా ఈవెంట్ కూడా గత ప్రపంచకప్ (2019) ఫార్మాట్‌లాగే రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. అంటే పది జట్లు ప్రతీ ప్రత్యరి్థతోనూ లీగ్ దశలో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్టు సెమీఫైనల్స్‌కు (నాకౌట్) అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్‌కు నవంబర్ 15న ముంబై... రెండో సెమీఫైనల్‌కు నవంబర్ 16న కోల్‌కతా వేదిక కానున్నాయి. భారత్ గనుక సెమీఫైనల్ చేరితే ముంబైలో ఆ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ సెమీఫైనల్లో భారత్‌కు పాకిస్తాన్ ఎదురైతే ఈ సెమీఫైనల్ కోల్‌కతాలో జరుగుతుంది. నాకౌట్ మ్యాచ్‌లకే (సెమీఫైనల్స్, ఫైనల్) రిజర్వ్ డేలున్నాయి. ఆరు ‘డే’ మ్యాచ్‌లు... మిగతావి డే–నైట్... ఈ టోర్నీలో మొత్తం జరిగే మ్యాచ్‌లు 48. లీగ్ దశలో 45 పోటీలు జరుగుతాయి. ఇందులో కేవలం ఆరు లీగ్‌లే డే మ్యాచ్‌లుగా ఉదయం గం. 10:30 గంటలకు మొదలవుతాయి. మిగతావన్నీ డే–నైట్ మ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. వీటితో పాటు నాకౌట్ మ్యాచ్‌లు కూడా డేనైట్ వన్డేలే! డే–నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. దాయాదులు దంచుకునేది... మాంచి క్రికెట్ కిక్ ఇచ్చే... అందరూ లుక్కేసే మ్యాచ్ భారత్, పాకిస్తాన్ పోరు! చిరకాల ప్రత్యర్థుల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఇదే కాదు... ఫైనల్ (నవంబర్ 19) సహా 2019 టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య టోర్నీ ఆరంభ పోరు (అక్టోబర్ 5న), ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (నవంబర్ 4) తలపడే మేటి మ్యాచ్‌లను లక్ష పైచిలుకు ప్రేక్షకులు చూసే నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఏర్పాటు చేశారు. గత మూడు ప్రపంచకప్‌లలో (2011లో భారత్; 2015లో ఆస్ట్రేలియా; 2019లో ఇంగ్లండ్) ఆతిథ్య జట్టు విజేతగా నిలువడం విశేషం. నాలుగోసారి పూర్తిగా ఇండియాలోనే.... భారత్ ఆతిథ్యమివ్వబోయే నాలుగో వన్డే ప్రపంచకప్ ఇది. ఈసారి పూర్తిగా భారత్‌లోనే జరుగనుండటం ఈ వరల్డ్‌కప్ ప్రత్యేకత! తొలిసారిగా 1987లో పాక్‌తో కలిసి, రెండోసారి 1996లో పాక్, లంకలతో ఉమ్మడిగా, మూడోసారి 2011లో లంక, బంగ్లాదేశ్‌లతో సంయుక్తంగా భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. ఇప్పటి వరకు 12 సార్లు వన్డే ప్రపంచకప్ జరగ్గా... రెండోసారి మాత్రమే ఆతిథ్య జట్టు టోర్నీ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగడంలేదు. 1996లో భారత్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగ్గా... 2023లోనూ ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరగనుండటం విశేషం. హైదరాబాద్‌లో భారత్ మ్యాచ్ లేదు భారత్‌లోని 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇందులో హైదరాబాద్‌కూ ఆతిథ్య భాగ్యం దక్కింది. కానీ భారత్ ఆడే మ్యాచ్‌కు నోచుకోలేకపోయింది. పాకిస్తాన్ ఆడే రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఉప్పల్ మైదానంలో జరుగుతాయి. ఈ రెండింటికి ప్రత్యర్థులు ఖరారు కాలేదు. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా రెండు జట్లు ఖరారవుతాయి. ముంబై, పుణే, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, ధర్మశాల, లక్నో, కోల్‌కతా, బెంగళూరు ఈ 9 వేదికల్లో ఐదేసి చొప్పున మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఈ మెగా టోరీ్నకి సన్నాహాల్లో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. సెపె్టంబర్ 30న గువాహటిలో ఇంగ్లండ్ జట్టుతో... అక్టోబర్ 3న త్రివేండ్రంలో క్వాలిఫయర్–1 జట్టుతో టీమిండియా తలపడుతుంది. -
ప్రపంచకప్‌కు విలియమ్సన్ దూరం! న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొకాలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2023లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో వెంటనే స్వదేశానికి వెళ్లిన కేన్‌మామ మోకాలికి మేజర్ సర్జరీ చేయించుకోన్నాడు. ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక వేళ ప్రపంచకప్ సమయానికి విలియమ్సన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే.. కివీస్ జట్టను టిమ్ సౌథీ లేదా టామ్ లాథమ్ నడిపించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. "కేన్ గాయం తీవ్రత గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తెలుస్తోంది. అతడు దాదాపుగా వరల్డ్‌కప్‌కు దూరమమ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ కేన్ అందుబాటులో లేకపోతే ఎవరని సారధిగా నియమించాలని అన్న ఆలోచనలో ఉన్నాం. సౌధీ ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ టామ్ లాథమ్‌కు వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఎక్కువగా ఉంది. టామ్ పాకిస్తాన్ పర్యటనలో కూడా జట్టును అద్బుతంగా నడిపించాడు. అయితే జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండడంతో వన్డే సిరీస్‌ను కోల్పోయాం. కానీ పరిమత ఓవర్ల కెప్టెన్‌గా లాథమ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే న్యూజిలాండ్ క్రికెట్ టామ్ వైపే మొగ్గు చూపవచ్చు అని విలేకురల సమావేశంలో గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
మనదే యువ ప్రపంచం
కరోనా కారణంగా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా... మెగా ఈవెంట్ ప్రారంభమయ్యాక జట్టులోని ఆరుగురు కరోనా బారిన పడటం... అదృష్టంకొద్దీ మ్యాచ్‌లో ఆడేందుకు 11 మంది అందుబాటులో ఉండటం... ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాటం... వెరసి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో యువ భారత్ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించి సగర్వంగా స్వదేశానికి పయనమైంది. టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్, రాజ్ బావా, విక్కీ ఒస్త్వాల్, రవి కుమార్... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు. న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన యువ భారత్ జట్టు అండర్–19 ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేసింది. ఏకంగా ఐదోసారి జగజ్జేతగా నిలిచి తమ పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 14 సార్లు అండర్–19 ప్రపంచకప్ జరగ్గా... యువ భారత్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, మూడుసార్లు రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆంటిగ్వాలో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ బౌలర్లు రాజ్ బావా (5/31), రవి కుమార్ (4/34) అదరగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ సింధు (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. రాజ్ బావా (54 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజ్ బావా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు అందుకున్నాడు. టోర్నీ మొత్తంలో 506 పరుగులు చేసి, 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవల్డ్ బ్రెవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. బీసీసీఐ అభినందన... అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజేతగా అవతరించిన యువ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రశంసల వర్షం కురిపించారు. రికార్డుస్థాయిలో ఐదోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 40 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నారు. ‘అన్ని విభాగాల్లో మన కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తమ శిబిరంలో కరోనా కలకలం రేపినా అందుబాటులో ఉన్న వారితో ముందుకు దూసుకెళ్లారు. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నిరంతరం కుర్రాళ్లలో ఉత్సాహం నింపారు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. సత్కారం... ఇంగ్లండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత యువ భారత జట్టు అంటిగ్వా నుంచి గయానాలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది. భారత హై కమిషనర్ కేజే శ్రీనివాస భారత జట్టును సన్మానించారు. ఆ తర్వాత టీమిండియా గయానా నుంచి ఆదివారం సాయంత్రం స్వదేశానికి పయనమైంది. అమ్‌స్టర్‌డామ్ మీదుగా బెంగళూరు చేరుకోనున్న భారత జట్టు సభ్యులు అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ సీనియర్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ చేరుకున్నాక బీసీసీఐ అధికారికంగా యువ జట్టును సత్కరించి రివార్డులు అందజేయనుంది. ప్రధాని శుభాకాంక్షలు ప్రపంచకప్ నెగ్గిన భారత అండర్–19 జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యువ జట్టు తమ ప్రదర్శనతో భారత భవిష్యత్ క్రికెట్ సురక్షితంగా ఉందని చాటి చెప్పిందని ఆయన అన్నారు. ‘యువ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నాను. అండర్–19 ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు. అత్యున్నతస్థాయి టోర్నీలో ఆద్యంతం వారు నిలకడగా రాణించి భారత క్రికెట్ భవితకు ఢోకా లేదని నిరూపించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. యువ జట్టు విజయం వెనుక బీసీసీఐ పాత్ర కూడా ఉంది. కొన్నేళ్లుగా అండర్–16, అండర్–19, అండర్–23 స్థాయిలో భారీ సంఖ్యలో మ్యాచ్‌లు, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కాస్త ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఈ నేపథ్యంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా భారత యువ జట్టు ఈసారి ప్రపంచకప్‌ను సాధించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. –వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ హెడ్ -
సముద్రంలో ప్రపంచ కప్!
వన్డే ప్రపంచ కప్ ప్రచారం కొత్త పోకడలు పోతోంది. ఇందులో భాగంగా దక్షిణ ఆస్ట్రేలియాలోని పోర్ట్ లింకన్‌లో ‘షార్క్ డైవ్’ పేరుతో వరల్డ్ కప్ ట్రోఫీని సముద్రం లోపల తెల్ల షార్క్‌లకు చేరువగా తీసుకెళ్లారు. ఇనుముతో దిగ్బంధం చేసిన రక్షణ కవచంతో సముద్రంలోకి పంపారు. ట్రోఫీని కూడా ఒక ప్రత్యేకమైన పెట్టెలో ఉంచారు. ఈ సాహసాన్ని చేసింది ఆస్ట్రేలియా మాజీ పేసర్ షాన్ టెయిట్ కావడం విశేషం. తన భార్య మాషూమ్ సింఘాతో కలిసి అతను దీనిని పూర్తి చేశాడు. 2007లో ప్రపంచకప్ నెగ్గిన ఆసీస్ జట్టులో టెయిట్ సభ్యుడు.