100 Days For ICC ODI World Cup 2023: Check Match Schedules, Venue Details And All You Need To Know - Sakshi
Sakshi News home page

100 Days For ODI WC 2023: కౌంట్‌డౌన్‌ మొదలు...

Published Wed, Jun 28 2023 2:52 AM | Last Updated on Wed, Jun 28 2023 8:45 AM

ODI World Cup in 100 days - Sakshi

ఈ శీతాకాలం మునుపటిలా చల్లగా ఉండదు. వన్డే ప్రపంచకప్‌తో హీటెక్కనుంది. ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్‌ మజాను పంచనుంది. భారీ స్కోర్లతో, వీర విహారాలతో సాగిపోనుంది. బంతి, బ్యాట్‌ పైచేయి తేల్చుకునేందుకు సమాయాత్తమైంది. బోరుకొట్టే మ్యాచ్‌లు కాకుండా... హోరెత్తించే షోలతో ఈ మెగా ఈవెంట్‌ మురిపించేందుకు సిద్ధమైంది. సెంచరీలు కొట్టే బ్యాటర్లు, హ్యాట్రిక్స్‌ వికెట్లు తీసే బౌలర్లు... ప్రపంచకప్‌ కలను సాకారం  చేసుకునేందుకు తాజా దిగ్గజాలు  సై అంటే సై అంటున్నారు.  

ముంబై: వన్డే ప్రపంచకప్‌ అంకానికి అధికారిక షెడ్యూల్‌ విడుదలైంది. 12 ఏళ్ల తర్వాత భారత్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తోంది. ఈసారి మాత్రం ఒంటరిగా నిర్వహించనుండటం ఈ కప్‌కున్న మరో ప్రత్యేకత. అందుకేనేమో అన్ని అనుకూల, ప్రతికూల అంశాలను పరిశీలించి.... అంతా కసరత్తు చేశాకే ఆలస్యంగా కేవలం వంద రోజుల ముందే షెడ్యూల్‌ విడుదల చేశారు.

గతంలో ఓ ఏడాది ముందే ఐసీసీ ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసేది. వాన ముప్పున్న వేదికల్లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లను కేటాయించలేదు. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం ముంబైలో విడుదల చేసింది. అక్టోబర్‌ 5న తెరలేచే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి నవంబర్‌ 19న జరిగే టైటిల్‌ పోరుతో తెరపడనుంది.  

గత ఫార్మాటే 
ఈ మెగా ఈవెంట్‌ కూడా గత ప్రపంచకప్‌ (2019) ఫార్మాట్‌లాగే రౌండ్‌ రాబిన్, నాకౌట్‌ పద్ధతిలో జరుగుతుంది. అంటే పది జట్లు ప్రతీ ప్రత్యరి్థతోనూ లీగ్‌ దశలో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్టు సెమీఫైనల్స్‌కు (నాకౌట్‌) అర్హత సాధిస్తాయి.

తొలి సెమీఫైనల్‌కు నవంబర్‌ 15న ముంబై... రెండో సెమీఫైనల్‌కు నవంబర్‌ 16న కోల్‌కతా వేదిక కానున్నాయి. భారత్‌ గనుక సెమీఫైనల్‌ చేరితే ముంబైలో ఆ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ సెమీఫైనల్లో భారత్‌కు పాకిస్తాన్‌ ఎదురైతే ఈ సెమీఫైనల్‌ కోల్‌కతాలో జరుగుతుంది. నాకౌట్‌ మ్యాచ్‌లకే (సెమీఫైనల్స్, ఫైనల్‌) రిజర్వ్‌ డేలున్నాయి. 

ఆరు ‘డే’ మ్యాచ్‌లు... మిగతావి డే–నైట్‌... 
ఈ టోర్నీలో మొత్తం జరిగే మ్యాచ్‌లు 48. లీగ్‌ దశలో 45 పోటీలు జరుగుతాయి. ఇందులో కేవలం ఆరు లీగ్‌లే డే మ్యాచ్‌లుగా ఉదయం గం. 10:30 గంటలకు మొదలవుతాయి. మిగతావన్నీ డే–నైట్‌ మ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. వీటితో పాటు నాకౌట్‌ మ్యాచ్‌లు కూడా డేనైట్‌ వన్డేలే! డే–నైట్‌ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. 

దాయాదులు దంచుకునేది... 
మాంచి క్రికెట్‌ కిక్‌ ఇచ్చే... అందరూ లుక్కేసే మ్యాచ్‌ భారత్, పాకిస్తాన్‌ పోరు! చిరకాల ప్రత్యర్థుల మధ్య అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో లీగ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఇదే కాదు... ఫైనల్‌ (నవంబర్‌ 19) సహా 2019 టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య టోర్నీ ఆరంభ పోరు (అక్టోబర్‌ 5న), ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (నవంబర్‌ 4) తలపడే మేటి మ్యాచ్‌లను లక్ష పైచిలుకు ప్రేక్షకులు చూసే నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఏర్పాటు చేశారు. గత మూడు ప్రపంచకప్‌లలో (2011లో భారత్‌; 2015లో ఆస్ట్రేలియా; 2019లో ఇంగ్లండ్‌) ఆతిథ్య జట్టు విజేతగా నిలువడం విశేషం.  

నాలుగోసారి పూర్తిగా ఇండియాలోనే.... 
భారత్‌ ఆతిథ్యమివ్వబోయే నాలుగో వన్డే ప్రపంచకప్‌ ఇది. ఈసారి పూర్తిగా భారత్‌లోనే జరుగనుండటం ఈ వరల్డ్‌కప్‌ ప్రత్యేకత! తొలిసారిగా 1987లో పాక్‌తో కలిసి, రెండోసారి 1996లో పాక్, లంకలతో ఉమ్మడిగా, మూడోసారి 2011లో లంక, బంగ్లాదేశ్‌లతో సంయుక్తంగా భారత్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది.

ఇప్పటి వరకు 12 సార్లు వన్డే ప్రపంచకప్‌ జరగ్గా... రెండోసారి మాత్రమే ఆతిథ్య జట్టు టోర్నీ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగడంలేదు. 1996లో భారత్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగ్గా... 2023లోనూ ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్‌ జరగనుండటం విశేషం.  

హైదరాబాద్‌లో భారత్‌ మ్యాచ్‌ లేదు 
భారత్‌లోని 10 వేదికల్లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇందులో హైదరాబాద్‌కూ ఆతిథ్య భాగ్యం దక్కింది. కానీ భారత్‌ ఆడే మ్యాచ్‌కు నోచుకోలేకపోయింది. పాకిస్తాన్‌ ఆడే రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్‌ ఒక మ్యాచ్‌ ఉప్పల్‌ మైదానంలో జరుగుతాయి. ఈ రెండింటికి ప్రత్యర్థులు ఖరారు కాలేదు. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా రెండు జట్లు ఖరారవుతాయి.

ముంబై, పుణే, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, ధర్మశాల, లక్నో, కోల్‌కతా, బెంగళూరు ఈ 9 వేదికల్లో ఐదేసి చొప్పున మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఈ మెగా టోరీ్నకి సన్నాహాల్లో భాగంగా భారత జట్టు రెండు వామప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. సెపె్టంబర్‌ 30న గువాహటిలో ఇంగ్లండ్‌ జట్టుతో... అక్టోబర్‌ 3న త్రివేండ్రంలో క్వాలిఫయర్‌–1 జట్టుతో టీమిండియా తలపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement