
ధోని(ఫైల్ ఫోటో)
వన్డే ప్రపంచకప్-2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దాదాపు పుష్కరకాలం తర్వాత భారత్ గడ్డపై వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను జూన్ 27న ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఇది ఇలా ఉండగా.. సొంత గడ్డపై జరగనున్న ఈ ఐసీసీ టోర్నీలో విజయం సాధించి తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. భారత జట్టు 2013 నుంచి ఎటువంటి ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. ధోనీ నాయకత్వంలో చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను బీసీసీఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రపంచకప్‌కు స్వదేశంలో వన్డే సిరీస్‌లను బీసీసీఐ ప్లాన్ చేసింది. అదే విధంగా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ కూడా భారత జట్టు ఐసీసీ ట్రోఫీని అందేంచేందుకు శాయశక్తులా ప్రయత్నించనున్నాడు.
ధోనికి మరోసారి కీలక బాధ్యతలు..!
ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడైన టీమిండియా మాజీ సారధి ఎంస్ ధోనికి మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు మెంటార్‌గా ధోనిని నిమమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా గతంలో 2021 టీ20 ప్రపంచకప్‌లో కూడా ధోనీని భారత జట్టు మెంటార్‌గా బీసీసీఐ నియమించింది. కానీ ఆ టోర్నీలో భారత జట్టు తీవ్ర నిరాశపరిచింది. లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ధోని అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని బీసీసీఐ బావిస్తున్నట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్-2023 టైటిల్‌ను ధోని సారధ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: T20 Blast 2023: సామ్ కర్రాన్ ఊచకోత.. కేవలం 18 బంతుల్లోనే సరి కొత్త చరిత్ర!