గాయం నుంచి కోలుకున్న సీనియర్ పేసర్
రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి
కోల్‌కతా: టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ... శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీ మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అయ్యాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి మధ్యప్రదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో షమీ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ సంఘం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి అదరగొట్టిన షమీ... ఆ తర్వాత గాయం కారణంగా మైదానానికి దూరమయ్యాడు. కాలి మడమకు శస్త్రచికిత్స చేయించుకున్న షమీ... ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఆ్రస్టేలియా పర్యటన వరకు అతడు కోలుకుంటాడనుకుంటే అది సాధ్యపడలేదు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రీహాబిలిటేషన్‌లో ఉన్న షమీ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు.
‘భారత క్రికెట్ జట్టుతో పాటు, బెంగాల్ రంజీ టీమ్‌కు శుభవార్త. స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ జట్టు తరఫున ఆడతాడు’అని బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి నరేశ్ ఓజా తెలిపాడు. షమీ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అతడిని ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ కోసం ఎంపిక చేయలేదు.
జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణను ఆ్రస్టేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసిన బోర్డు... ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ప్రకటించింది. జట్టును ప్రకటించిన సమయంలో రోహిత్ మాట్లాడుతూ... పూర్తి ఫిట్‌నెస్ సాధించని షమీతో ప్రయోగాలు చేయబోమని ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment