హ్యాట్రిక్‌ డకౌట్స్‌.. పాక్‌ ఓపెనర్‌ చెత్త రికార్డులు | PAK VS SA 3rd ODI: Pakistan Opener Abdullah Shafique Hat Trick Duck Outs | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ డకౌట్స్‌.. పాక్‌ ఓపెనర్‌ చెత్త రికార్డులు

Published Sun, Dec 22 2024 7:35 PM | Last Updated on Sun, Dec 22 2024 7:35 PM

PAK VS SA 3rd ODI: Pakistan Opener Abdullah Shafique Hat Trick Duck Outs

అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. షఫీక్‌ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడు సార్లు డకౌట్లు అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సింగిల్‌ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక డకౌట్లు అయిన ఓపెనర్ల జాబితాలో షఫీక్‌ క్రిస్‌ గేల్‌, ఉపుల్‌ తరంగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక డకౌట్లు అయిన చెత్త రికార్డు హెర్షల్‌ గిబ్స్‌ (2002, 8 సార్లు), తిలకరత్నే దిల్షన్‌ (2012, 8 సార్లు) పేరిట ఉంది.

హ్యాట్రిక్‌ డకౌట్స్‌
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అబుల్లా షఫీక్‌ గోల్డన్‌ డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్‌ తానెదుర్కొన్న తొలి బంతికే వికెట్‌ పారేసుకున్నాడు. వన్డేల్లో షఫీక్‌ ఇది వరుసగా మూడో డకౌట్‌. సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో కూడా షఫీక్‌ డకౌటయ్యాడు.

చరిత్రలో మొదటి ఓపెనర్‌గా చెత్త రికార్డు
తాజా డకౌట్‌తో షఫీక్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్‌ డకౌట్‌లను నమోదు చేసిన మొదటి ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్‌ గప్తిల్‌ కూడా ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్‌ డకౌట్‌లు నమోదు చేశాడు. 

అయితే శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్‌ ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌. టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా వన్డేల్లో హ్యాట్రిక్‌ డకౌట్లు నమోదు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్కై ఈ అపప్రదను మూటగట్టుకున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వర్షం కారణంగా టాస్‌ అలస్యమైంది. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచకుంది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే షఫీక్‌ ఔటయ్యాడు. 3.1 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 10/1గా ఉంది. ఈ దశలో వర్షం​ మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌కు అంతర్జాయం కలిగింది. వర్షం ముగిసిన మ్యాచ్‌ మళ్లీ ప్రారంభమైంది. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. 4 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 16/1గా ఉంది. సైమ్‌ అయూబ్‌ (6), బాబర్‌ ఆజమ్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. షఫీక్‌ వికెట్‌ రబాడకు దక్కింది.

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. 3 టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య డిసెంబర్‌ 26 నుంచి తొలి టెస్ట్‌ మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో టెస్ట్‌ జరుగుతుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement