ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో సత్తా చాటి, రిటైరైనా తగ్గేదేలే అని యువ క్రికెటర్లకు సందేశం పంపిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్లు, సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్‌లు ఆ రెండు సిరీస్‌ల్లో తమతమ అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. రోడ్ సేఫ్టీ సిరీస్, లెజెండ్స్ లీగ్‌లు ఒకే సమయంలో షెడ్యూలైనప్పటికీ పఠాన్ సోదరులు రెండిటిలోనూ పాల్గొని తమ జట్లను గెలిపించారు. 13 ఫ్లయిట్‌లు, 17 మ్యాచ్‌లు, 2 ఫైనళ్లు అంటూ ఇర్ఫాన్ పఠాన్.. తన సోదరుడు యూసఫ్‌ను ట్యాగ్ చేస్తూ ఫేస్‌బుక్ వేదికగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో బిల్వారా కింగ్స్ జట్టు తరఫున ఆడారు. ఈ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ జట్టు ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను మట్టికరిపించి వరుసగా రెండో సీజన్‌లోనూ ఛాంపియన్‌గా నిలువగా.. లెజెండ్స్ లీగ్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమిపాలైంది.
ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 341 పరుగులు చేసి, బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు 30+ స్కోర్లు ఉన్నాయి. ఇక తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ విషయానికొస్తే.. ఇర్ఫాన్ ఈ రెండు టోర్నీల్లో కలిపి 12 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు 30+ స్కోర్లు ఉన్నాయి. అలాగే ఇర్ఫాన్ బౌలింగ్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ 27 సిక్సర్లు, 22 ఫోర్లు బాదగా.. ఇర్ఫాన్ పఠాన్ 11 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు.
ఇదిలా ఉంటే, పఠాన్ సోదరులు గతంతో అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనే చేసినప్పటికీ వివిధ కారణాల చేత సరైన అవకాశాలు రాక వారి కెరీర్‌లు అర్థంతరంగా ముగిశాయి. ఇర్ఫాన్ 27 ఏళ్ల వయసులో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. దాదాపు పదేళ్ల పాటు జట్టులో చోటు కోసం నిరీక్షించి చివరకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున హ్యాట్రిక్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన ఇర్ఫాన్ పఠాన్.. 2007 వరల్డ్ కప్ ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అలాగే తానాడిన చివరి వన్డేలో ఐదు వికెట్లు తీశాడు. యూసఫ్ పఠాన్ విషయానికొస్తే ఇతనిది దాదాపు తమ్ముడి పరిస్థితే. కీలక మ్యాచ్‌ల్లో భారీ సిక్సర్లు బాది ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించిన యూసఫ్‌కు కూడా సరైన అవకాశాలు రాక కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment