
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్(Pakistan) ప్రయాణం గ్రూపు స్టేజిలోనే ముగిసింది. 29 ఏళ్ల తర్వాత తమ సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన పాక్ జట్టు.. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రిజ్వాన్ బృందం.. ఈ టోర్నీ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
హెడ్ కోచ్‌పై వేటు..
ఇందులో భాగంగా తమ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాలని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది ఆఖరిలో గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్న తర్వాత పాక్ జట్టు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్న అకిబ్ జావెద్‌ను పీసీబీ నియమించింది.
ఆ తర్వాత జాసన్ గిల్లెస్పీ తప్పుకోవడంతో టెస్టు జట్టుకు కూడా అకిబ్‌నే కోచ్‌గా కొనసాగించారు. అతడి నేృత్వంలోనే పాక్ జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే సారికి పాక్ జట్టు పూర్తిగా తేలిపోయింది.
"ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాక్ జట్టుకు వేర్వేరు ప్రధాన కోచ్‌లు(వైట్‌బాల్, రెడ్ బాల్ క్రికెట్) ఉంటారా అనే దానిపై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఈ మెగా టోర్నీలో పాక్ పేలవమైన ప్రదర్శన కనబరచడంతో ప్రస్తుత కోచింగ్ స్టాప్ మొత్తాన్ని మార్చడం ఖాయమని" ఓ పీసీబీ సీనియర్ అధికారి పీటీఐతో పేర్కొన్నారు. అయితే పీసీబీ విదేశీ కోచ్‌ల కోసం కాకుండా, తమ దేశ మాజీ ఆటగాళ్లను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఇక పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27 రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
చదవండి: దేశవాళీలో ఆడితే మంచిదే కానీ...