
రుద్రాపూర్ (ఉత్తరాఖండ్): జాతీయ క్రీడలు మంగళవారం అధికారికంగా ప్రారంభంకానున్నా... కొన్ని క్రీడాంశాల్లో ఇప్పటికే పోటీలు మొదలయ్యాయి. బీచ్ హ్యాండ్‌బాల్‌లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లకు ఓటమి ఎదురైంది.
పురుషుల విభాగం పూల్ ‘ఎ’లో ఆతిథ్య ఉత్తరాఖండ్ జట్టు 36–18 గోల్స్ తేడాతో తెలంగాణ జట్టును ఓడించగా... పూల్ ‘బి’లో ఉత్తరప్రదేశ్ జట్టు 41–37 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది.
మహారాష్ట్ర జట్టుకు స్వర్ణం
మూడు అంశాల సమాహారమైన ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్) ఈవెంట్‌లో మణిపూర్, మహారాష్ట్ర క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో పార్థ్ సచిన్, డాలీ దేవిదాస్ పాటిల్, కౌశిక్ వినయ్ మలాండర్కర్, మాన్సిలతో కూడిన మహారాష్ట్ర బృందం పసిడి పతకం సొంతం చేసుకుంది.
ఈ ఈవెంట్‌లో భాగంగా నలుగురు వేర్వేరుగా ముందుగా 300 మీటర్ల స్విమ్మింగ్ చేయాలి. ఆ తర్వాత 6.8 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి. చివరగా 2 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి. ఈ మూడు ఈవెంట్లను కలిపి తక్కువ సమయంలో పూర్తి చేసిన మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. మహారాష్ట్ర బృందం 2గం:12ని:06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.
సరుంగమ్ మెతీకి పసిడి పతకం
ఇక మధ్యప్రదేశ్ జట్టుకు రజతం, తమిళనాడు జట్టుకు కాంస్యం లభించాయి. పురుషుల ట్రయాథ్లాన్ వ్యక్తిగత ఈవెంట్‌లో మణిపూర్‌కు చెందిన సరుంగమ్ మెతీ స్వర్ణం... తెలీబా సోరమ్ రజతం... మహారాష్ట్ర ప్లేయర్ పార్థ్ కాంస్యం గెలిచారు. మహిళల ట్రయాథ్లాన్ వ్యక్తిగత ఈవెంట్‌లో డాలీ పాటిల్ (మహారాష్ట్ర) స్వర్ణం, మాన్సి (మహారాష్ట్ర) రజతం, ఆద్యా సింగ్ (మధ్యప్రదేశ్) కాంస్యం సాధించారు.
ఫిబ్రవరి 14 వరకు...
38వ జాతీయ క్రీడలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం అధికారికంగా మొదలవుతాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలనున ఉత్తరాఖండ్‌లోని ఏడు నగరాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 32 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.
మరిన్ని క్రీడా వార్తలు
సెమీస్‌లో బెంగాల్ టైగర్స్
రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 2–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బెంగాల్ టైగర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా బెంగాల్ జట్టు టాప్–4లోనే ఉండనుంది.
విండీస్ విజయం
ముల్తాన్: బౌలర్ల హవా నడిచిన రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. 1990 తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో వెస్టిండీస్ గెలుపొందడం విశేషం. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది.
ఇక 254 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్‌నైట్ స్కోరు 76/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ జట్టు 44 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. విండీస్ స్పిన్నర్లు జోమెల్ వారికన్ (5/27), గుడకేశ్ మోతీ (2/35), కెవిన్ సింక్లెయిర్ (3/61) పాకిస్తాన్ జట్టును తిప్పేశారు.
విండీస్ స్పిన్నర్లను ఎదుర్కోలేక మూడో రోజు ఆటలో పాక్ జట్టు 20 ఓవర్లు ఆడి మరో 57 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. విండీస్ ఎడంచేతి వాటం స్పిన్నర్ వారికన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 163 ఆలౌట్ (41.1 ఓవర్లలో);
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 154 ఆలౌట్ (47 ఓవర్లలో)
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 244 ఆలౌట్ (66.1 ఓవర్లలో)
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 133 ఆలౌట్ (44 ఓవర్లలో)
(బాబర్ ఆజమ్ 31, రిజ్వాన్ 25, వారికన్ 5/27, సింక్లెయిర్ 3/61, గుడకేశ్ మోతీ 2/35).
Comments
Please login to add a commentAdd a comment