న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల వేటకు సిద్ధమైన భారత క్రీడాకారుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొండంత విశ్వాసం నింపారు. వెన్నంటి ఉండే ఉత్సాహమిచ్చారు. టోక్యోకు తుది కసరత్తుల్లో నిమగ్నమైన క్రీడాకారులతో మంగళవారం సాయంత్రం ప్రధాని ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ అయ్యారు. క్రీడాకారులంతా తమ ఆటపైనే దృష్టి పెడితే చాలని, అంచనాలను మోయాల్సిన పనిలేదని అన్నారు. ఏమాత్రం ఒత్తిడిలో కూరుకుపోవద్దని యావత్ దేశం వారి అత్యుత్తమ ప్రదర్శన కోసమే ఎదురు చూస్తోం దని అథ్లెట్లతో మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షూటర్లు సౌరభ్ చౌదరి, ఇలవెనిల్ వలరివన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లు శరత్ కమల్, మనిక బాత్రా, ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్ దీపిక కుమారి, బాక్సర్ ఆశిష్ కుమార్, స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తదితరులతో మోదీ ముచ్చటించారు. వారిలో స్ఫూర్తి నింపారు.
ప్రపంచ క్రీడా వేదికపై భారత్ సత్తా చాటాలని, విశ్వాసంతో ముందడుగు వేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏ సాయమందించడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ‘మీతో ఇలా భేటీ కావడం చాలా సంతోషంగా ఉంది. టోక్యో నుంచి తిరిగొచ్చాక తప్పకుండా ముఖాముఖిగా కలుసుకుందాం. ముఖ్యంగా నేను చెప్పేదొకటే... మీరెవరూ అంచనాలతో పోటీ పడకండి. ప్రత్యర్థులతోనే తలపడండి. అనవసర ఒత్తిడిని తలకెత్తుకోవద్దు. అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే చూపండి. ఎందుకంటే నాకు మీ గురించి తెలుసు, మీరు పడ్డ కష్టం విలువా తెలుసు. మీ అందరి ఉమ్మడి లక్ష్యం పతకమైతే... మీలో ఉన్న సుగుణం అంకితభావం. ఆటలకే అంకితమయ్యారు. ఈ ఆటల కోసమే ఎన్నో త్యాగాలు చేశారు. శ్రమ, సాధనతో ఈస్థాయికి చేరిన మీ వెంటే మేమంతా ఉంటాం. మీ కృషిని కొనియాడుతూనే ఉంటాం’ అని మోదీ అన్నారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ క్రీడల మంత్రి, ప్రస్తుత న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.
మోదీ నోట... సింధు ఐస్‌క్రీమ్ ముచ్చట
తెలుగుతేజం సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతోనూ మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘రియో’ విజయం కోసం సింధు ఫోన్‌ను కోచ్ గోపీచంద్ పక్కన పెట్టించారని, తనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్ కూడా తినకుండా ఆంక్షలు విధించినట్లు తెలుసుకున్న మోదీ ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావించారు. దీనిపై సింధు హుషారుగా సమాధానమిచ్చింది. ‘ప్లేయర్లకు పూర్తి ఫిట్‌నెస్ అవసరం. డైట్ నియంత్రణ తప్పనిసరి. ఇందుకు ఇష్టాయిష్టాలను పక్కన బెట్టాల్సి వస్తుంది’ అని తెలిపింది. ఇప్పుడు ‘టోక్యో’ కోసం కూడా అలాంటి డైట్‌నే ఫాలో అవుతున్నానని చెప్పింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆమె ప్రాక్టీస్‌పై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. తమ అమ్మాయిని వెన్నంటి ఉండి ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులను మోదీ అభినందించారు.
228 మందితో భారత బృందం...
టోక్యో ఒలింపిక్స్ కోసం 228 మందితో కూడిన భారత బృందం జపాన్‌కు పయనమవుతుంది. భారత్ తరఫున 18 క్రీడాంశాల్లో మొత్తం 119 క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. మిగతా వారంతా కోచింగ్, ఫిజియో సిబ్బంది. 17న తొలి విడతగా 90 మంది అక్కడికి బయలుదేరుతారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా వెల్లడించారు.
సానియా ఏం చెప్పిందంటే...
ప్రధాని మోదీతో హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మాట్లాడుతూ ఈ తరం ఆటగాళ్ల దృక్పథం గొప్పగా ఉందన్నారు. ‘ఎవరైనా ఉన్నతస్థానానికి చేరుకోవచ్చని యువ క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే వాళ్లు లక్ష్యం కోసం బాగా కష్టపడాలి. అంకితభావంతో ముందడుగు వేయాలి. అప్పుడే అదృష్టం కూడా కలిసొస్తుంది. అంతేకానీ కఠోర శ్రమ, అంకితభావం లేకపోతే అదృష్టరేఖ కూడా ఏమీ చేయలేదు’ అని సానియా చెప్పింది.
టోక్యో చేరిన భారత సెయిలింగ్ జట్టు
భారత సెయిలింగ్ జట్టు మంగళవారం టోక్యో చేరుకుంది. భారత్ నుంచి ఒలింపిక్స్ కోసం టోక్యోలో అడుగుపెట్టిన తొలి బృందం ఇదే. వరుణ్ ఠక్కర్, గణపతి చెంగప్ప, విష్ణు శరవణన్, నేత్ర కుమనన్... కోచ్‌లు, ఇతర సహాయ సిబ్బందితో కూడిన సెయిలింగ్ జట్టు యూరోప్‌లో శిక్షణ అనంతరం అక్కడి నుంచే నేరుగా జపాన్‌కు పయనమైంది.
Comments
Please login to add a commentAdd a comment