ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన క్రీడాకారులను ఉత్సాహపరుద్దాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న మన క్రీడాకారులను మరింత ఉత్సాహపరుద్దామని, వారిని ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత అథ్లెట్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఛీర్ ఫర్ భారత్ అని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం ఒలింపిక్స్ క్రీడల ద్వారా మన ఆటగాళ్లకు వచ్చిందన్నారు. వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావించారు.
కొన్ని రోజుల క్రితం గణితశాస్త్రంలో ఒలింపిక్స్ జరిగాయని, నలుగురు భారతీయు విద్యార్థులు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారని ప్రశంసించారు. అస్సాంలోని అహోమ్ రాజుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడాల జాబితాలో స్థానం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది మనకు గర్వకారణమని అన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాల విష వలయంలో చిక్కుకుంటుండడం బాధాకరమని అన్నారు. అలాంటి వారిని బయటకు తీసుకురావడానికి ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి సంబంధించి ‘1933’ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.
ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలి
‘‘త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. మువ్వన్నెల జెండాతో సెల్ఫీ దిగి హర్‌గర్‌తిరంగా.కామ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఖాదీ, చేనేత వ్రస్తాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడినవారు ఇప్పుడు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తున్నారు. హరియాణాలోని రోహతక్‌లో 250 మంది మహిళలు బ్లాక్ పెయింటింగ్, డయింగ్ శిక్షణతో జీవితాలను తీర్చిదిద్దుకున్నారు’’ అని మోదీ ప్రశంసించారు.
నల్లమల చెంచులు టైగర్ ట్రాకర్స్
ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారిని టైగర్ ట్రాకర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యపోతాం. టైగర్ ట్రాకర్స్‌గా వారు అడవిలో వన్యప్రాణుల సంచారంపై ప్రతి చిన్న సమాచారం సేకరిస్తారు. అటవీ ప్రాంతంలో అక్రమ కార్యక్రమాలపైనా నిఘా పెడతారు.
టైగర్ ఫ్రెండ్స్‌గా వ్యవహరించే వీరు మానవులు, పులుల మధ్య ఎలాంటి వైరం లేకుండా చూస్తారు. చెంచుల కృషితో పులుల సంఖ్య పెరుగుతోంది’’ అని ‘మన్‌కీ బాత్’లో కొనియాడారు. దేశవ్యాప్తంగా పులుల జనాభా గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. ఇది మనకు చాలా గర్వకారణమని చెప్పారు.
అభివృద్ధి, వారసత్వాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా అవతరింపజేయడమే ఏకైక లక్ష్యంగా వికసిత్ భారత్ అజెండా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అయితే వికసిత్ భారత్ అజెండాలో ప్రాచీన, వారసత్వ కట్టడాలు, సంస్కృతులను కాపాడుకుంటూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ముఖ్యమంత్రి పరిషత్’ భేటీలో 13 మంది సీఎంలు, 15 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మాట్లాడారు.
సమాజంలోని భిన్న వర్గాల్లో చిట్టచివరి వ్యక్తికి సైతం కేంద్ర పథకాలు, సుపరిపాలన గురించి తెలిసేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మోదీ సూచించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరలు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఎలా సమర్థంగా అమలు చేయాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ‘‘సంక్షేమ పథకాలు లబ్దిదారులందరికీ అందేలా చూడటం మీ తక్షణ కర్తవ్యం. బీజేపీపాలిత రాష్ట్రాలు సుపరిపాలనకు సిసలైన చిరునామాగా మారాలి’’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment