RCB Vs PBKs: పంజాబ్‌కు ‘ప్రీత్‌’పాత్ర విజయం | Punjab Kings beat Royal Challengers Bangalore by 34 runs | Sakshi
Sakshi News home page

RCB Vs PBKs: పంజాబ్‌కు ‘ప్రీత్‌’పాత్ర విజయం

Published Sat, May 1 2021 4:15 AM | Last Updated on Sat, May 1 2021 8:56 AM

Punjab Kings beat Royal Challengers Bangalore by 34 runs - Sakshi

హర్‌ప్రీత్‌ బౌలింగ్‌లో కోహ్లి క్లీన్‌ బౌల్డ్‌

పేలవ ప్రదర్శనతో పదే పదే ఓటమిని ఆహ్వానిస్తున్న పంజాబ్‌ కింగ్స్‌కు ఊరట లభించింది. ఫామ్‌లో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆ జట్టు సగం మ్యాచ్‌లు ముగిసేసరికి మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగలిగింది. అందరి అంచనాలకు భిన్నంగా యువ ఆటగాడు హర్‌ప్రీత్‌ బ్రార్‌ మ్యాచ్‌ ఫలితాన్ని శాసించడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌లో కొన్ని మెరుపు షాట్లతో జట్టుకు కీలక పరుగులు అందించిన అతను... లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో ఆర్‌సీబీ ముగ్గురు టాప్‌ బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేసి సత్తా చాటాడు. సీజన్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే పంజాబ్‌కు ప్రీతిపాత్రమైన విజయాన్ని అందించాడు.   

అహ్మదాబాద్‌: బ్యాటింగ్‌ వైఫల్యంతో గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ వెంటనే కోలుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 34 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. కోహ్లి సేనకు ఇది రెండో ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (57 బంతుల్లో 91 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... క్రిస్‌ గేల్‌ (24 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హర్షల్‌ పటేల్‌ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్‌ పటిదార్‌ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. 19 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసిన పంజాబ్‌ కింగ్స్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

రాహుల్‌, గేల్‌

గేల్‌ దూకుడు...
గాయం కారణంగా మయాంక్‌ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... అతని స్థానంలో ఓపెనర్‌గా దిగిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (7) ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో బరిలోకి దిగిన గేల్‌ ఎట్టకేలకు తన మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. గత మ్యాచ్‌లో డకౌట్‌ అయిన అతను ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా జేమీసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ అతని బ్యాటింగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో అతను ఏకంగా 5 ఫోర్లు బాదడం విశేషం.

తొలి నాలుగు బంతుల్లో గేల్‌ 4, 4, 4, 4 కొట్టగా ఐదో బంతికి పరుగు రాలేదు. ఆపై చివరి బంతిని కూడా గేల్‌ బౌండరీ దాటించాడు. చహల్‌ వేసిన తర్వాతి ఓవర్లో కూడా గేల్‌ మరో రెండు సిక్సర్లు కొట్టి జోరు ప్రదర్శించాడు. అయితే గేల్‌ను స్యామ్స్‌ అవుట్‌ చేయడంతో ఒక్కసారిగా పంజాబ్‌ పరిస్థితి మారిపోయింది. మరో 18 పరుగుల వ్యవధిలో ఆ జట్టు పూరన్‌ (0), హుడా (5), షారుఖ్‌ (0) వికెట్లు కోల్పోయింది. పూరన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో నాలుగోసారి డకౌట్‌ కావడం విశేషం.  

ఆదుకున్న రాహుల్‌...
జట్టు కెప్టెన్‌ రాహుల్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో పంజాబ్‌ ఈ స్కోరు సాధించగలిగింది. గేల్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు జాగ్రత్తగా ఆడిన రాహుల్‌ ఆ తర్వాత తాను బాధ్యత తీసుకున్నాడు. ఒకదశలో 28 బంతుల్లో 25 పరుగులే చేసిన అతను ఆ తర్వాత జోరు పెంచాడు. చహల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన రాహుల్‌ జేమీసన్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా కొట్టిన సిక్స్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఈ క్రమంలో 35  బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. చివర్లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ (17 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) కెప్టెన్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 32 బంతుల్లో అభేద్యంగా 61 పరుగులు జోడించారు.  ముఖ్యంగా 18వ ఓవర్లో జట్టు 18 పరుగులు రాబట్టగా... హర్షల్‌ వేసిన చివరి ఓవర్లో రాహుల్‌ 2 ఫోర్లు, 1 సిక్స్‌...హర్‌ప్రీత్‌ మరో సిక్స్‌ కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి.  

సమష్టి వైఫల్యం...
ఛేదనలో ఆర్‌సీబీకి సరైన ఆరంభం లభించలేదు. ఫాస్ట్‌ బౌలర్‌ మెరిడిత్‌ వేసిన మెరుపు బంతి స్టంప్స్‌ను ఎగరగొట్టడంతో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (7) వెనుదిరిగాడు. పటిదార్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేసినా... అతని బ్యాటింగ్‌ మరీ నెమ్మదిగా సాగింది. క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించిన కెప్టెన్‌ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించలేకపోయాడు. సగం ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 62 పరుగులు మాత్రమే. బెంగళూరు విజయం కోసం 60 బంతుల్లో 118 పరుగులు చేయాల్సిన స్థితి!  ఈ దశలో హర్‌ప్రీత్‌ ప్రత్యర్థిని బలంగా దెబ్బ కొట్టాడు.

11వ ఓవర్‌ తొలి బంతికి కోహ్లిని బౌల్డ్‌ చేసిన అతను తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్‌ (0) వికెట్లను కూడా గిరాటేశాడు. దాంతో బెంగళూరు విజయపు ఆశలన్నీ డివిలియర్స్‌ (3)పైనే నిలిచాయి. హర్‌ప్రీత్‌ తన తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతితో డివిలియర్స్‌ను కూడా వెనక్కి పంపాడు. దాంతో జట్టు గెలుపు దారులు దాదాపుగా మూసుకుపోయాయి. ధాటిగా ఆడే ప్రయత్నంలో పటిదార్‌ కూడా అవుట్‌ కాగా... చివర్లో హర్షల్‌ పటేల్,  కైల్‌ జేమీసన్‌ (16 నాటౌట్‌)  పోరాడినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 23 బంతుల్లోనే 48 పరుగులు జోడించారు.  

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (నాటౌట్‌) 91; ప్రభ్‌సిమ్రన్‌ (సి) కోహ్లి (బి) జేమీసన్‌ 7; గేల్‌ (సి) డివిలియర్స్‌ (బి) స్యామ్స్‌ 46; పూరన్‌ (సి) షహబాజ్‌ (బి) జేమీసన్‌ 0; హుడా (సి) పటిదార్‌ (బి) షహబాజ్‌ 5; షారుఖ్‌ (బి) చహల్‌ 0; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1–19, 2–99, 3–107, 4–117, 5–118. బౌలింగ్‌: స్యామ్స్‌ 4–0–24–1, సిరాజ్‌ 3–0–24–0, జేమీసన్‌ 3–0–32–2, చహల్‌ 4–0–34–1, హర్షల్‌ 4–0–53–0, షహబాజ్‌ 2–0–11–1.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) హర్‌ప్రీత్‌ 35; పడిక్కల్‌ (బి) మెరిడిత్‌ 7; పటిదార్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 31; మ్యాక్స్‌వెల్‌ (బి) హర్‌ప్రీత్‌ 0; డివిలియర్స్‌ (సి) రాహుల్‌ (బి) హర్‌ప్రీత్‌ 3; షహబాజ్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) రవి బిష్ణోయ్‌ 8; స్యామ్స్‌ (బి) రవి బిష్ణోయ్‌ 3; జేమీసన్‌ (నాటౌట్‌) 16; హర్షల్‌ (సి) బిష్ణోయ్‌ (బి) షమీ 31; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 145. 
వికెట్ల పతనం: 1–19, 2–62, 3–62, 4–69, 5–91, 6–96, 7–96, 8–144.
బౌలింగ్‌: రిలీ మెరిడిత్‌ 3.2–0–29–1, షమీ 3.4–0–28–1, రవి బిష్ణోయ్‌ 4–0–17–2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–1–19–3, జోర్డాన్‌ 4–0–31–1, హుడా 1–0–13–0.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement