సిరాజ్ గెలిపించిన మ్యాచ్ ఇది! నిప్పులు చెరిగే బౌలింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో పంజాబ్ కింగ్స్‌పై స్పీడ్‌స్టర్ పంజా విసిరాడు. పంజాబ్ కుదురుకోకుండా దెబ్బ మీద దెబ్బ వేయడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఈ సీజన్‌లో మూడో విజయాన్ని సాధించింది.
మొహాలీ: మెరుపులతో డుప్లెసిస్, కోహ్లి బెంగళూరును నడిపిస్తే... బౌలింగ్‌తో గెలిపించిన ఘనత మాత్రం సిరాజ్‌దే! దీంతో ఐపీఎల్‌లో గురువారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దిగిన రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ (56 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఈ మ్యాచ్‌లో సారథ్యం వహించిన విరాట్ కోహ్లి (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. హర్‌ప్రీత్ బ్రార్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జితేశ్ శర్మ (27 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సిరాజ్ (4/21) కీలకమైన వికెట్లు తీశాడు.
డుప్లెసిస్ ధనాధన్ ‘ఇంపాక్ట్’
కోహ్లి, డుప్లెసిస్‌ల ఓపెనింగ్ మైదానంలోని ప్రేక్షకుల్ని మెరుపులతో మురిపించింది. దూసుకొచ్చే బంతిని కాచుకొని, గతి తప్పిన బంతిని బౌండరీలవైపు శిక్షిస్తూ బెంగళూరు ఇన్నింగ్స్‌ను ఏకంగా 16 ఓవర్ల పాటు నడిపించారు. 137 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ముందుగా డుప్లెసిస్ 31 బంతుల్లో, తర్వాత కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి పరుగుల పంజా ‘కింగ్స్’ను ఉక్కిరిబిక్కిరి చేయగా, స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరితో పాటు హిట్టర్ మ్యాక్స్‌వెల్ (0) అవుటవడంతో 200 మార్క్‌ను దాటకుండా పంజాబ్ అడ్డుకుంది.
అనంతరం కష్టపడితే ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను సిరాజ్ తన తొలి ఓవర్ నుంచే కష్టాలపాలు చేశాడు. అథర్వ (4)ను ఎల్బీగా అవుట్ చేశాడు. సిక్స్, ఫోర్ కొట్టి జోరు మీదున్న హర్‌ప్రీత్ సింగ్ (13)ను డైరెక్ట్ హిట్‌తో రనౌట్ చేశాడు. ప్రభ్‌సిమ్రన్ రాణింపు తర్వాత జితేశ్ శర్మ మెరుపులతో లక్ష్యం దిశగా సాగుతుంటే మళ్లీ సిరాజ్ నిప్పులు చెరిగాడు. హర్‌ప్రీత్ బ్రార్ (13), ఎలిస్ (1)లను క్లీన్‌బౌల్డ్ చేసి పరాజయాన్ని ఖాయం చేశాడు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) జితేశ్ శర్మ (బి) హర్‌ప్రీత్ 59; డుప్లెసిస్ (సి) స్యామ్ కరన్ (బి) ఎలిస్ 84; మ్యాక్స్‌వెల్ (సి) అథర్వ (బి) హర్‌ప్రీత్ 0; దినేశ్ కార్తీక్ (సి) అథర్వ (బి) అర్షదీప్ 7; మహిపాల్ (నాటౌట్) 7; షహబాజ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–137, 2–137, 3–151, 4–163. బౌలింగ్: అర్షదీప్ సింగ్ 4–0–34–1, హర్‌ప్రీత్ 3–0–31–2, ఎలిస్ 4–0–41–1, స్యామ్ కరన్ 4–0–27–0, రాహుల్ చహర్ 4–0–24–0, లివింగ్‌స్టోన్ 1–0–9–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 4; ప్రభ్‌సిమ్రన్ (బి) పార్నెల్ 46; షార్ట్ (బి) హసరంగ 8; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; హర్‌ప్రీత్ సింగ్ (రనౌట్) 13; స్యామ్ కరన్ (రనౌట్) 10; జితేశ్ శర్మ (సి) షహబాజ్ (బి) హర్షల్ పటేల్ 41; షారుఖ్ (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) హసరంగ 7; హర్‌ప్రీత్ బ్రార్ (బి) సిరాజ్ 13; ఎలిస్ (బి) సిరాజ్ 0; అర్షదీప్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–4, 2–20, 3–27, 4–43, 5–76, 6–97, 7–106, 8–147, 9–149, 10–150. బౌలింగ్: సిరాజ్ 4–0–21–4, పార్నెల్ 3–0–32–1, హసరంగ 4–0–39–2, వైశాక్ 3–0–29–0, మ్యాక్స్‌వెల్ 1–0–5–0, హర్షల్ పటేల్ 3.2–0–22–1.
Comments
Please login to add a commentAdd a comment