చెలరేగిన టీమిండియా స్టార్‌.. ద్రవిడ్‌ చేతుల మీదుగా ట్రోఫీ | R Ashwin Captain Knock Dindigul Dragons Win Maiden TNPL Title, Dravid Presents Trophy | Sakshi
Sakshi News home page

అశూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. డ్రాగన్స్‌కు తొలి టైటిల్‌!.. ట్రోఫీ అందించిన ద్రవిడ్‌

Published Mon, Aug 5 2024 12:56 PM | Last Updated on Mon, Aug 5 2024 1:19 PM

R Ashwin Captain Knock Dindigul Dragons Win Maiden TNPL Title, Dravid Presents Trophy

PC: StarSportsTamil on X

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌-2024 సీజన్‌ విజేతగా దిండిగల్‌ డ్రాగన్స్‌ అవతరించింది. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెప్టెన్సీలో తమ తొలి టైటిల్‌ సాధించింది. నాయకుడిగా జట్టును ముందుకు నడిపిస్తూనే.. ఆద్యంతం ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్న అశ్విన్‌ ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో డ్రాగన్స్‌కు ట్రోఫీ అందించాడు.

జూలై 5న మొదలైన తమిళనాడు లీగ్‌ తాజా ఎడిషన్‌ ఆదివారం(ఆగష్టు 4)తో ముగిసింది. లైకా కోవై కింగ్స్‌, ట్రిచీ గ్రాండ్‌ చోళాస్‌, చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, నెల్లై రాయల్‌ కింగ్స్‌, ఐడ్రీమ్‌ తిరుపూర్‌ తమిళన్స్‌, దిండిగల్‌ డ్రాగన్స్‌, సేలం స్పార్టన్స్‌, సీచం మధురై పాంథర్స్‌ తదితర జట్లు టైటిల్‌ కోసం పోటీపడ్డాయి.

 

రాణించిన బౌలర్లు 
ఈ క్రమంలో లైకా కోవై కింగ్స్‌- దిండిగల్‌ డ్రాగన్స్‌ ఫైనల్‌ చేరగా.. ఇరు జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. చెపాక్‌ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన దిండిగల్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. లైకా జట్టును 129 పరుగులకు పరిమితం చేసింది. దిండిగల్‌ బౌలర్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌, పి.విఘ్నేశ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సబోత్‌ భాటీ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

లైకా ఇన్నింగ్స్‌లో రామ్‌ అర్‌వింద్‌ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిండిగల్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు విమల్‌ కుమార్‌ 9, శివం సింగ్‌ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.

అశూ హాఫ్‌ సెంచరీ
మరో ఎండ్‌ నుంచి వికెట్‌ కీపర్‌ బాబా అపరాజిత్‌(32) సహకారం అందించగా.. అశూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. 46 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో సి. శరత్‌ కుమార్‌ 27, భూపతి కుమార్‌ 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.

అర్ధ శతకంతో రాణించి జట్టును గెలిపించిన అశ్విన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన షారుఖ్‌ ఖాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు నిర్వాహకులు.

ఇదే తొలి టైటిల్‌.. ద్రవిడ్‌ చేతుల మీదుగా ట్రోఫీ
కాగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో దిండిగల్‌ డ్రాగన్స్‌కు ఇదే తొలి టైటిల్‌ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తూ యాభై పరుగుల మార్కు అందుకోగానే.. అతడి భార్య ప్రీతి నారాయనణ్‌ చప్పట్లతో అభినందిస్తూ సందడి చేశారు. ప్రీతికి సంబంధించిన విజువల్స్‌ హైలైట్‌గా నిలిచాయి.

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌లో 37 ఏళ్ల అశ్విన్‌.. పది మ్యాచ్‌లలో కలిపి 252 పరుగులు సాధించడంతో పాటు తొమ్మిది వికెట్లు తీశాడు. కాగా ఈ టీ20 లీగ్‌ తర్వాత అశ్విన్‌ టీమిండియా సిరీస్‌లతో బిజీ కానున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

దిండిగల్‌ డ్రాగన్స్‌ వర్సెస్‌ లైకా కోవై కింగ్స్‌ స్కోర్లు
👉లైకా కోవై కింగ్స్‌- 129/7 (20)
👉దిండిగల్‌ డ్రాగన్స్‌ - 131/4 (18.2)
👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో కోవై కింగ్స్‌పై గెలిచిన దిండిగల్‌ డ్రాగన్స్‌.

చదవండి: IND vs SL: 6 వికెట్ల‌తో భారత్‌కు చుక్క‌లు చూపించాడు.. ఎవ‌రీ జెఫ్రీ వాండర్సే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement