తెవాటియా, పరాగ్‌ దనాధన్‌‌.. రాజస్తాన్‌ గెలిచెన్‌ | Rajasthan Beat SRH By 5 Wickets | Sakshi
Sakshi News home page

తెవాటియా, పరాగ్‌ దనాధన్‌‌.. రాజస్తాన్‌ గెలిచెన్‌

Published Sun, Oct 11 2020 7:21 PM | Last Updated on Sun, Oct 11 2020 8:32 PM

Rajasthan Beat SRH By 5 Wickets - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ అద్భుతమైన విజయాన్ని సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 159 పరుగుల టార్గెట్‌లో ఆదిలో తడబడిన రాజస్తాన్‌ను తెవాటియా, రియాన్‌ పరాగ్‌లు తమ ధనాదన్‌ బ్యాటింగ్‌తో గెలిపించారు. టాపార్డర్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో తెవాటియా ధనాదన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతనికి జతగా రియాన్‌ పరాగ్‌ సహకరించడంతో ఇంకా బంతి ఉండగా రాజస్తాన్‌ విజయాన్ని అందుకుంది. తెవాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో  45 పరుగులతో అజేయంగా నిలవగా, పరాగ్‌ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా రాజస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 159 టార్గెట్‌లో బెన్‌ స్టోక్స్‌- జోస్‌ బట్లర్‌లు ఓపెనర్లుగా వచ్చారు. స్టోక్స్‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్‌((5) రనౌట్‌ అయ్యాడు. అనవసరపు పరుగు కోసం యత్నించి పెవిలియన్‌ చేరాడు. ఇక బట్లర్‌(16), సంజూ శాంసన్‌(26), రాబిన్‌ ఊతప్ప(18)లు ఏదో రెండంకెల స్కోరు చేశారు కానీ అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. ఆ తరుణంలో తెవాటియా-పరాగ్‌లు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంలో కీలక పాత్ర వహించారు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా తెవాటియా, పరాగ్‌లు రెచ్చిపోయి ఆడారు. ఓ దశలో తెవాటియా సహనం కోల్పోయి సన్‌రైజర్స్‌ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించడం మినహా ఆటలో ఇరగదీశాడు. ఇది రాజస్తాన్‌ కు మూడో విజయం.  వరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం కావడంతో ఆ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. సన్‌రైజర్స్‌ కు ఇది నాల్గో ఓటమి.(రాహుల్‌ ఎవరి మాట వినడా.. అంతేనా?)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 158 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(48; 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్‌ పాండే(54; 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో ఆరెంజ్‌ ఆర్మీ 150 పరుగుల మార్కును దాటింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌, బెయిర్‌ స్టోలు ఆరంభించారు. కాగా, బెయిర్‌ స్టో(16) నిరాశపరచగా, వార్నర్‌ మాత్రం మరొకసారి ఆకట్టుకున్నాడు.  అతనికి మనీష్‌ పాండే నుంచి మంచి సహకారం లభించింది. ఈ జోడి 73 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక కేన్‌ విలియమ్సన్‌ 12 బంతుల్లో 22 పరుగులు చేయగా అందులో 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రియాం గార్గ్‌ 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ సాయంతో 15 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు సాధించడం విశేషం. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగి, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement