విశాఖ స్పోర్ట్స్: ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర క్రికెట్ జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బెంగాల్ జట్టుతో ఇక్కడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’ చేసుకుంది. 36 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినందుకు ఆంధ్ర జట్టు ఖాతాలో మూడు పాయింట్లు చేరగా... బెంగాల్ జట్టుకు ఒక్క పాయింట్ లభించింది.
మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 339/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 165.4 ఓవర్లలో 445 పరుగులకు ఆలౌటైంది. రికీ భుయ్ (347 బంతుల్లో 175; 23 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కేలా చేశాడు. షోయబ్ మొహమ్మద్ ఖాన్ (149 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఏడో వికెట్‌కు 133 పరుగులు జోడించిన రికీ భుయ్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
బెంగాల్ బౌలర్లలో కైఫ్ మూడు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్, ఇషాన్ పోరెల్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 36 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 82 పరుగులు సాధించింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో టీ విరామం తర్వాత ఇరు జట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించి ఆటను ముగించారు. ఆంధ్ర జట్టు తదుపరి మ్యాచ్‌ను ఈనెల 12 నుంచి వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుతో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment