
సాక్షి, హైదరాబాద్: మరో 127 పరుగులు సాధిస్తే హైదరాబాద్ క్రికెట్ జట్టు 2023–2024 రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్‌గా అవతరిస్తుంది. ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ప్లేట్ డివిజన్ టైటిల్ పోరులో మేఘాలయ జట్టు హైదరాబాద్‌కు 198 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు సాధించింది.
తన్మయ్ అగర్వాల్ (0) ఖాతా తెరవకుండా అవుటవ్వగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (29 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తనయ్ త్యాగరాజన్ (35 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 0/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మేఘాలయ జట్టు 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆర్‌ఆర్ బిస్వా (100; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు)
సెంచరీ సాధించగా... జస్కీరత్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మేఘాలయను కట్టడి చేశాడు. ఈ రంజీ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన తనయ్ మొత్తం 56 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. తనయ్ ఏడుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం.