నవీ ముంబై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ50 టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో రష్మిక 6–4, 6–2తో థాయ్‌లాండ్‌కు చెందిన బున్‌యావి థామ్‌చైవాట్‌పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రియా భాటియా (భారత్) 6–3, 6–4తో భారత్‌కే చెందిన తనీషా కశ్యప్‌పై, టాప్ సీడ్ అంకితా రైనా (భారత్) 1–6, 6–4, 6–4తో వాలెంటిని (గ్రీస్)పై నెగ్గగా... ఆకాంక్ష నిట్టూరె (భారత్) 6–7 (8/10), 4–6తో నహో సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది.
డబుల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో సహజ (భారత్)–హిరోకొ కువాటా (జపాన్) ద్వయం 6–3, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో వైష్ణవి–పూజా (భారత్) జంటపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment