'రిచా' ది వారియర్‌.. లేడీ ధోని! వీడియో వైరల్‌ | WPL 2024: Richa Ghosh Buries Head As RCB Lose Thriller To DC, WPL Playoffs Hopes Dented, Video Goes Viral - Sakshi
Sakshi News home page

WPL 2024 RCB W Vs DC W: 'రిచా' ది వారియర్‌.. లేడీ ధోని! వీడియో వైరల్‌

Published Mon, Mar 11 2024 9:46 AM | Last Updated on Mon, Mar 11 2024 11:10 AM

Richa Ghosh buries head as RCB lose thriller to DC, WPL playoffs hopes dented - Sakshi

డబ్ల్యూపీఎల్‌-2024లో భాగంగా ఆదివారం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగుతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ విరోచిత పోరాటం మాత్రం అందరని అకట్టుకుంది. ఆఖరివరకు రిచా అద్భుతంగా పోరాడనప్పటికి తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయింది. 

182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. రెండో  ఓవర్‌లోనే కెప్టెన్‌ స్మృతి మంధాన (5) పెవిలియన్‌కు చేరింది. సోఫీ మోలినెక్స్‌ (30), ఎలీస్‌ పెరీ (49) బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే ఇద్దరూ ఓవర్‌ వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. బౌండరీల వర్షం కురిపిస్తూ బౌలర్లపై ఒత్తడి పెంచింది. సోఫీ డివైన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఆ తర్వాత డివైన్‌ ఔటైనప్పటికీ రిచా జోరు ఏ మాత్రం తగ్గలేదు.

ఈ క్రమంలో  ఆర్సీబీ విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 40 పరుగులు అవసరమయ్యాయి. 18వ ఓవర్‌లో రిచా ఘోష్, జార్జియా (12) చెరో బౌండరీ సాధించడంతో 12 పరుగులు వచ్చాయి. అయితే 19వ ఓవర్‌లో జార్జియాను షికా పాండే ఔట్ చేయడంతో బెంగళూరు విజయ సమీకరణం 6 బంతుల్లో 17 పరుగులుగా మారింది. చివరి ఓవర్‌లో జొనాస్సెన్ వేసిన తొలి బంతిని రిచా ఘోష్ సిక్సర్‌గా మలిచింది.

రెండో బంతికి పరుగేమి లభించలేదు. మూడో బంతికి దిశా రనౌటైంది. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రిచా.. ఐదో బంతిని స్టాండ్స్‌కు తరలించింది. దీంతో ఆఖరి బంతికి ఆర్సీబీ విజయానికి కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే స్ట్రైక్‌లో రిచా ఉండడంతో ఆర్సీబీ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఆఖరి బంతికి రిచా రనౌట్‌ కావడంతో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఇది చూసిన కోట్ల మంది ఆర్సీబీ ఆభిమానుల గుండె బద్దలైంది.

కన్నీరు పెట్టుకున్న రిచా..
ఇక ఆఖరి వరకు పోరాడి జట్టును గెలిపించలేకపోయిన రిచా కన్నీరు పెట్టుకుంది. మైదానంలోనే కన్నీటి పర్యంతం అయింది. ఢిల్లీ క్రికెటర్లు షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్‌ ఆమె వద్దకు వెళ్లి  ఓదర్చారు. ఢిల్లీ సారథి మెగ్ లానింగ్ సైతం రిచాను హగ్‌ చేసుకుని ఓదార్చింది.

ఇక అద్బుతమైన పోరాట పటిమ చూపిన రిచాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. లేడి ధోని అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం రిచాకు సపోర్ట్‌గా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రిచా ఘోష్ ఫొటోతో 'యూ ఆర్ ఏ స్టార్' అంటూ సూర్య రాసుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement