జో రూట్‌ విధ్వంసం​.. శివాలెత్తిపోయిన రికెల్టన్‌ | SA20 2025: Ryan Rickelton Smashes MICT To Win Over JSK, PR Beat PC By 8 Wickets | Sakshi
Sakshi News home page

జో రూట్‌ విధ్వంసం​.. శివాలెత్తిపోయిన రికెల్టన్‌

Published Sun, Jan 19 2025 11:25 AM | Last Updated on Sun, Jan 19 2025 12:19 PM

SA20 2025: Ryan Rickelton Smashes MICT To Win Over JSK, PR Beat PC By 8 Wickets

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 18) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ​్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌, పార్ల్‌ రాయల్స్‌ తలపడగా.. రెండో మ్యాచ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ అమీతుమీ తేల్చుకున్నాయి.

రూట్‌ విధ్వంసం
ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. విల్‌ స్మీడ్‌ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్‌ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్‌ వెర్రిన్‌ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్‌ నీషమ్‌ (13 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

క్యాపిటల్స్‌ ఆటగాళ్లలో విల్‌ జాక్స్‌ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో ముజీబ్‌ రెహ్మాన్‌, దయ్యన్‌ గేలిమ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఎహసాన్‌ మలింగ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్‌ డకౌట్‌ కాగా.. జో రూట్‌ (60 బంతుల్లో 92 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్‌ హెర్మన్‌ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (24 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. 

క్యాపిటల్స్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌, జేమ్స్‌ నీషమ్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఈ గెలుపుతో పార్ల్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో క్యాపిటల్స్‌ నాలుగో స్థానంలో ఉంది.

శివాలెత్తిపోయిన రికెల్టన్‌
రెండో మ్యాచ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. 

ఎంఐ కేప్‌టౌన్‌ బౌలర్లలో రీజా హెండ్రిక్స్‌ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ ఖాన్‌, కార్బిన్‌ బాష్‌, జార్జ్‌ లిండే తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌తో డుప్లెసిస్‌ టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఛేదనలో ర్యాన్‌ రికెల్టన్‌ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌), రీజా హెండ్రిక్స్‌ (28 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. 

ఈ మ్యాచ్‌లో రికెల్టన్‌ కోవిడ్‌తో బాధపడుతూ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో డేవిడ్‌ వీస్‌, మతీశ పతిరణలకు తలో వికెట్‌ దక్కింది. ఈ గెలుపుతో ఎంఐ కేప్‌టౌన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. సూపర్‌ కింగ్స్‌ మూడో స్థానంలో నిలిచింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement