ఇబ్రహీంపట్నం/హైదరాబాద్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) పోటీల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. శేరిగూడలోని శ్రీ ఇందు కాలేజీ వేదికగా పోటీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో కాచిగూడ భద్రుకా డిగ్రీ కళాశాల, దోమలగూడ ఏవీ డిగ్రీ కళాశాల జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భద్రుక డిగ్రీ జట్టు 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 72 పరుగులు సాధించింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏవీ డిగ్రీ కళాశాల జట్టు 9.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించి విజయాన్ని కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్‌లో మొయినాబాద్ కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ జట్టు, శేరిగూడ శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీ జట్టు తలబడ్డాయి. టాస్ గెలిచి శ్రీదత్త కాలేజీ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కేజీ రెడ్డి జట్టు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.
79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీదత్త జట్టు 42 పరుగులకే అలౌట్ అయింది. 36 పరుగుల తేడాతో కేజీ రెడ్డి జట్టు విజేతగా నిలిచింది. మూడో మ్యాచ్ శేరిగూడ శ్రీ ఇందు ఫార్మాసీ కాలేజీ, కోఠి ప్రగతి డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీ ఇందు ఫార్మసీ కళాశాల జట్టు 34 పరుగులకే అలౌట్ అయింది. ప్రగతి కాలేజీ జట్టు 3 ఓవర్లకే 38 పరుగులు చేసి విజయాన్ని సునాయసంగా చేజిక్కించుకుంది.
నాలుగో మ్యాచ్‌లో మెహిదీపట్నం పుల్లారెడ్డి కాలేజీ, కోఠి వివేకవర్ధిని కాలేజీ జట్లు పోటీ పడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వివేకవర్ధిని జట్టు 10 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 54 పరుగులు సాధించింది. 55 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పుల్లారెడ్డి డిగ్రీ కాలేజీ జట్టు 9 వికెట్ల నష్టానికి 46 పరుగులు సాధించి 8 పరుగుల తేడా ఓటమి పాలైంది. సాక్షి ప్రీమియర్ లీగ్‌కు రీఫ్రెష్‌మెంట్ డ్యూక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుధాకర్ పీవీసీ సంస్థలు తెలంగాణ రీజియన్ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ ఇందూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుణ్, ఏఓ బాలకృష్ణారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ నరసింహ పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండలం, కొర్రెముల్ సెంట్రల్ క్రికెట్ మైదానంలో ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల–ఏ జట్టుతో శేర్‌గూడ శ్రీదత్తా డిప్లమా కళాశాల–బీ జట్టు తలడింది. మొదట బ్యాటింగ్ చేసిన లిటిల్ ఫ్లవర్ 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 95 పరుగులు చేయగా, శ్రీ దత్తా డిప్లమా–బీ జట్టు 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసి పరాజయం పాలైంది.
రెండో మ్యాచ్‌లో ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల–బీ జట్టుతో సైనిక్‌పురి భవాన్స్ అరబిందో జూనియర్ కళాశాల–బీ జట్టు తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన భవాన్స్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జట్టు క్రీడాకారుడు రామ్‌రుత్విక్ రెడ్డి 52 పరుగులు సాధించడమే కాక రెండు స్టంప్ ఔట్‌లు, రెండు రన్ ఔట్‌లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఉప్పల్ లిటిల్ ఫ్లవర్–బీ జట్టు 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసి ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో సైనిక్‌పురి భవాన్స్ వివేకానంద డిగ్రీ కళాశాల–బీ జట్టుతో ఇబ్రహీంపట్నం విజ్ఞాన భా రతి ఇంజనీరింగ్ కళాశాల జట్టు తలపడింది. మొదట బ్యా టింగ్ చేసిన విజ్ఞాన భారతి జట్టు 10 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేయగా భవాన్స్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసి గెలుపొందింది.
ఉత్కంఠంగా నాల్గో మ్యాచ్...
నాల్గో మ్యాచ్‌లో సికింద్రాబాద్ జాహ్నవి డిగ్రీ కళాశాల జట్టుతో గండిపేట్ మహాత్మ గాంధీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన జాహ్నవి జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన మహాత్మాగాంధీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా మహాత్మా గాంధీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేయగా జాహ్నవి జట్టు వికెట్ నష్టపోయి 2 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment