చేబ్రోలు: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో జూనియర్ విభాగంలో ఎన్‌ఆర్‌ఐ కాలేజి (విజయవాడ), సీనియర్ విభాగంలో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి (ఏలూరు) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ఎస్‌పీఎల్ టోర్నీ ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరై విన్నర్స్, రన్నరప్ జట్లకు నగదు పురస్కారాలు, ట్రోఫీలను అందజేశారు. చాంపియన్ జట్లకు రూ. 25 వేలు... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది.
జూనియర్ విభాగం ఫైనల్లో ఎన్‌ఆర్‌ఐ కాలేజి 35 పరుగులతో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి (విశాఖపట్నం)పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్‌ఆర్‌ఐ జట్టు నిర్ణేత 20 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. రూపేష్ (60 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రేవంత్ (45 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిశారు. అనంతరం సాయి గణపతి కాలేజి 16.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఎన్‌ఆర్‌ఐ జట్టు బౌలర్లలో తరుణ్ 4 వికెట్లు, రేవంత్ 2 వికెట్లు పడగొట్టారు. రేవంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది.
సీనియర్ విభాగం ఫైనల్లో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ (సీకామ్) డిగ్రీ కాలేజి (తిరుపతి) జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. మొదట సీకామ్ కాలేజి 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. శివ కార్తీక్ (51 బంతుల్లో 42 పరుగులు; 3 ఫోర్లు) రాణించాడు. సీఆర్ రెడ్డి కాలేజి బౌలర్ మనోజ్ నాలుగు, వికెట్లు పడగొట్టాడు.
అనంతరం సర్ సీఆర్ రెడ్డి కాలేజి 15.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ గగన్ కుమార్ (47 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజయ్ (27 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించారు. జూనియర్ విభాగంలో ఎన్‌ఆర్‌ఐ కాలేజి ఆటగాడు రేవంత్... సీనియర్ విభాగంలో సీఆర్ రెడ్డి కాలేజి ఆటగాడు మనోజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment