లాలాపేట: డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్టు తెలంగాణ రీజియన్ సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకుంది. హబ్సిగూడలోని ఐఐసీటీ మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో గౌతమ్ కాలేజి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కాలేజి (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌ఆర్ కాలేజి 11 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్ కాలేజీ స్పిన్నర్ డి.మనీశ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీ మొత్తంలో మనీశ్ 12 వికెట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. అనంతరం గౌతమ్ కాలేజి జట్టు కేవలం. 4.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసి గెలిచింది.
అన్విత్ రెడ్డి 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన అన్విత్ రెడ్డి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. హెచ్‌సీఏ అండర్–14, అండర్–16 లీగ్‌లలో కూడా అన్విత్ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. బాలాజీకి ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది.
సీనియర్ విభాగంలో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో భవాన్స్ జట్టు 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల) జట్టును ఓడించింది. ముందుగా భవాన్స్ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. రాహుల్ 36 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అనంతరం వాగ్దేవి కాలేజి 14.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్’ అవార్డులు దక్కాయి.
జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు చొప్పున... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్స్, రన్నరప్ జట్లకు ట్రోఫీలను అందజేశారు. అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా టోర్నీ లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణి రెడ్డి కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment