sainikpuri
-
విజేత గౌతమ్ జూనియర్ కాలేజి
లాలాపేట: డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్టు తెలంగాణ రీజియన్ సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకుంది. హబ్సిగూడలోని ఐఐసీటీ మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో గౌతమ్ కాలేజి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజి (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్ఆర్ కాలేజి 11 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. గౌతమ్ కాలేజీ స్పిన్నర్ డి.మనీశ్ రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీ మొత్తంలో మనీశ్ 12 వికెట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. అనంతరం గౌతమ్ కాలేజి జట్టు కేవలం. 4.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసి గెలిచింది. అన్విత్ రెడ్డి 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన అన్విత్ రెడ్డి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. హెచ్‌సీఏ అండర్–14, అండర్–16 లీగ్‌లలో కూడా అన్విత్ రెడ్డి తన సత్తా చాటుకున్నాడు. బాలాజీకి ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సీనియర్ విభాగంలో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో భవాన్స్ జట్టు 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల) జట్టును ఓడించింది. ముందుగా భవాన్స్ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. రాహుల్ 36 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అనంతరం వాగ్దేవి కాలేజి 14.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్’ అవార్డులు దక్కాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతగా నిలిచిన జట్లకు రూ. 25 వేలు చొప్పున... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విన్నర్స్, రన్నరప్ జట్లకు ట్రోఫీలను అందజేశారు. అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా టోర్నీ లు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణి రెడ్డి కూడా పాల్గొన్నారు. -
చిన్నపాటి గొడవ..పూలు కట్ చేసే బ్లేడ్‌తో యువకుడిని..
సాక్షి, రాంగోపాల్‌పేట్: ముగ్గురు యువకుల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఓ యువకుడి హత్యకు దారితీసిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ గాస్మండికి చెందిన భూక్యా శివాజీ అలియాస్ శివ (25) కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి పక్కన ఉండే వారి పెళ్లికి వెళుతున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో సైనిక్‌పురికి చెందిన తన స్నేహితుడు మింటు అలియాస్ డేనియల్‌తో కలిసి ఇంటి సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న గుర్తు తెలియని యువకుడిని ఆపి ఎవరు, ఇక్కడేమి చేస్తున్నావంటూ ప్రశ్నించడమేగాక అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో సదరు యువకుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి తన బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని ఓల్డ్ గాస్మండికి రావాలని సూచించాడు. దీంతో మరో యువకుడు కారులో అక్కడికి వచ్చాడు. అయితే శివాజీ మరోమారు వారితో గొడవ పడ్డాడు. దీంతో అతను తన చేతిలో ఉన్న పువ్వులు కట్ చేసే బ్లేడుతో శివాజీపై దాడి చేసి కారులో పరారయ్యాడు. దీంతో శివాజీ స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న శివాజీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెంది ఉండటంతో మార్చురీకి తరలించారు. శివాజీ స్నేహితుడు డేనియల్ ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. పోలీసుల అదుపులో నిందితులు ? యువకుడిని హత్య చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడిని బన్సీలాల్‌పేట్‌కు చెందిన పూల వ్యాపారిగా గుర్తించారు. కారు ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. (చదవండి: కారుతో తొక్కించి.. దారుణంగా హతమార్చి..) -
అమ్మని ఒప్పించడానికి చాలా కష్టపడ్డా.. ఇప్పుడు అందరూ హ్యాపీ!
‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం వదులుకోకూడదని, కలల్ని విజయాలుగా మలచుకోవాలని’’ అంటోంది హైదరాబాద్ వాసి ప్రజ్ఞ అయ్యగారి... అంతర్జాతీయ పోటీల్లో టైటిల్ గెలుస్తానని అదే ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. కుష్టువ్యాధి బాధితులకు బాసటగా ససాకవా లెప్రసి ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ ఫోరమ్ ఆఫ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పేరిట నిర్వహించిన సదస్సుకు బ్రెజిల్ సుందరి లెటికా సెజర్తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... సికింద్రాబాద్‌లో మా కుటుంబం నివసిస్తోంది. హిమాయత్‌నగర్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నాను. గ్లామర్ రంగంలో రాణిస్తూనే సస్టెయినబుల్ ఫ్యాషన్‌కు సంబంధించి డిజైనర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం. నొప్పించకుండా ఒప్పించాను గ్లామర్ రంగంలోకి ప్రవేశిస్తానని చెప్పడానికి కూడా సంకోచించాల్సినంత సంప్రదాయ కుటుంబం మాది. మా బంధుమిత్రుల్లో ఎవరూ ఈ రంగంలో అడుగుపెట్టింది లేదు. అయితే నాలో ఒకసారి ఈ ఆలోచన వచ్చి, గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత... రెండేళ్లపాటు మా ఇంట్లోవాళ్లని దశలవారీగా ఒప్పిస్తూ వచ్చాను. దీనిలో భాగంగా ఎంతో మంది బ్యూటీక్వీన్ల విజయగాధలను వివరించాను. నాన్న త్వరగానే ఒప్పుకున్నా, అమ్మని ఒప్పించడానికి మరింత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం అందరూ హ్యాపీ. ఒకడుగు వెనక్కు కేవలం 17 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ అయిన మానుషి చిల్లర్ నాకు స్ఫూర్తి. గత మిస్ ఇండియాలో కాంటెస్ట్ చేసి గెలుపొందకపోయినా, ఆ తర్వాత ఆగస్టులో జరిగిన లివా మిస్ దివా సుప్రానేషనల్ గెలిచాను. తద్వారా వచ్చే జులై–ఆగస్టు మధ్య పోలండ్‌లో జరిగే మిస్ సుప్రా ఇంటర్నేషనల్‌కు పోటీపడుతున్నా (ఈ పోటీల్లో ఇప్పటికి భారత్ రెండుసార్లు మాత్రమే ఈ కిరీటం గెలుచుకుంది. ఇందులో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఒకరు) ఇటు నృత్యం అటు చెస్ హాబీల విషయానికి వస్తే.. పుస్తకాలు బాగా చదువుతాను. హాబీలకు మించింది నా భరతనాట్య అభిరుచి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చాను. అలాగే చదరంగంలో కూడా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్‌లో ఆడిన అనుభవం ఉంది. నువ్వు కలగన్నావంటే గెలుస్తావన్నట్టే అన్న ఆంగ్లోక్తిని నమ్ముతాను... అందుకే కలలు కంటున్నాను... గెలుపును నమ్ముతున్నాను’’ అని చెబుతున్న ప్రజ్ఞ కలలు నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్: ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుందన్నారు.. కానీ) -
23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: 23 నిమిషాల్లో 2005 కిక్స్ కొట్టి... గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది హైదరాబాద్‌కు చెందిన శ్రీహాస. కోవిడ్ నేపథ్యంలో మైదానానికి దూరంగా ఉన్నా.. ఆన్లైన్లో శిక్షణ పొంది ఈ ఘనత సాధించింది. నగరంలోని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన జేవీ శ్రీరామ్, పావనిల కూతురు జొన్నలగడ్డ వెంకట సాయి శ్రీహాస. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 13 ఏళ్ల వయసులోనే తైక్వాండోలో అత్యంత ప్రతిభ చూపిస్తోంది. ఏపీలోని ఈశ్వర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్, విశ్వ దగ్గర శిక్షణ పొంది, గతంలో 20 నిమిషాల్లో 1400 ఫ్రీ కిక్స్ కొట్టింది. ఆ రికార్డును బద్దలు కొట్టాలని అహర్నిశలు సాధన చేసింది. ఇంటర్నెట్లో తైక్వాండో వీడియోలు చూసి మెళకువలు నేర్చుకుంది. ఈ ఏడాది మే నెల్లో గిన్నిస్ రికార్డు బృందం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో నిమిషానికి ఒక సెట్ చొప్పన 23 సెట్లలో 2005 తైక్వాండో క్లిక్స్ కొట్టి శ్రీహాస కొత్త రికార్డు సృష్టించింది. రివ్యూ పూర్తయిన అనంతరం ఆదివారం కృష్ణాజిల్లా నాగాయలంకలోని అకాడెమీలో శ్రీహాసకు గిన్నిస్ రికార్డు సరి్టఫికెట్‌ను అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం నీలంపేట వీరి స్వస్థలం. చదవండి: ఇంజనీరింగ్ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్ షాక్..! -
Vidya Nambirajan: తండ్రి వారసురాలు.. ఉద్యోగం చేసుకోమని మీ నాన్న అయినా చెప్పలేదా?
‘‘అమ్మాయిలకు ఇక్కడేం పని?’’ నలుగురూ నడిచే దారిలో కాకుండా తనకంటూ కొత్తబాట వేసుకున్న స్త్రీలకు ఎదురయే తప్పనిసరి ప్రశ్న. ‘‘అప్పట్లో కార్పొరేట్ ఉద్యోగం చేసినట్లున్నావు!’’ ఆశ్చర్యం రూపంలో ఎదురయ్యే మరో ప్రశ్న. ‘‘నువ్వు చదివింది లైఫ్ సైన్స్ కదా!?’’ ‘‘గ్యారేజ్‌లోనే ఉంటావా! ఉద్యోగానికి వెళ్లవా!?’’ ‘‘నీకీ కష్టం ఎందుకే అమ్మాయి’’ ఆత్మీయుల ఆవేదన. ‘‘పెళ్లి చేసుకుని వెళ్లాల్సిన నువ్వు ఎంతకాలం ఇలాగ!! ఉద్యోగం చేసుకోమని మీ నాన్న అయినా చెప్పలేదా?’’ అన్నింటికీ ఆమె సమాధానం ఒక్కటే. ‘మా నాన్న కోసమే ఈ గ్యారేజ్‌లోకి వచ్చాను’. విద్యానంబిరాజన్... పేరులోనే తమిళదనాన్ని నింపుకున్న ఆమె పుట్టింది చెన్నైలో, పెరిగింది హైదరాబాద్‌లో. తంజావూరులో అయ్యంగార్ కుటుంబం, మాడభూషి వంశం. తాత హైకోర్టు న్యాయమూర్తి, తండ్రి నంబిరాజన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ముంబయిలోని శాంతాక్రజ్‌లో సివిల్ ఏవియేషన్‌లో ఉద్యోగం, ఆ తర్వాత హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగం. రిటైర్ అయిన తరవాత సికింద్రాబాద్, సైనిక్‌పురిలో ఇంటి ఆవరణలోనే ‘పారామౌంట్ ఆటో బే సర్వీసెస్’ పేరుతో తన కలల సామ్రాజ్యాన్ని స్థాపించారాయన. అలా 1988లో మొదలైన గ్యారేజ్‌ను తన ప్రయోగాలకు వేదిక చేసుకున్నారాయన. కుటుంబ కారణాల రీత్యా పరిశ్రమ బాధ్యత చేపట్టిన తర్వాత ఎదురైన సవాళ్లను విద్యానంబిరాజన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. అక్కా అన్న వాళ్లే... ‘‘మా ఇంట్లోనే గ్యారేజ్ కావడంతో నాన్న దగ్గర పని చేసే ఉద్యోగులందరూ పరిచయమే. నేను చెన్నై నుంచి వచ్చినప్పుడు అందరూ ‘అక్కా’ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. అలాంటిది నేను గ్యారేజ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మారిపోయారు. నన్ను బాస్‌గా స్వీకరించలేకపోయారు. నేనేమో అప్పటివరకు కార్పొరేట్ సెక్టార్లోనే ఉద్యోగం చేశాను. ఒక మాట చెబితే ఆ పని పూర్తయిపోవాలి. అలాంటిది ఇక్కడ ఏదో ఒక నెపం చెప్పి పనిని వాయిదా వేసేవారు. ఇక కస్టమర్లయితే ‘రాంగ్ ప్లేస్‌కి వచ్చామా’ అన్నట్లు చూసేవారు. కారు ఇవ్వవచ్చా, మరో గ్యారేజ్‌కి వెళ్లిపోదామా అనే సందిగ్ధం కనిపించేది. ఇంటర్వ్యూ చేసినట్లు మెకానికల్ రంగం గురించి అనేక ప్రశ్నలు వేసేవాళ్లు. రిపేర్, పెయింటింగ్, ఐసీ ఇంజిన్ వంటివన్నీ నాన్న నేర్పించారు. అయితే అప్పట్లో ఫియట్లు, అంబాసిడర్లే ఎక్కువ. నేను 2001లో టేకప్ చేసినప్పటి నుంచి ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా మార్పులు సంతరించుకుంది. టెక్నాలజీ అంతా సాఫ్ట్వేర్ ఆధారితంగా మారిపోయింది. ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నప్పటికీ, నా ధోరణి మాత్రం సీఈవో తన సీట్లో నుంచి కదలాల్సిన అవసరమేముంది? అన్నట్లు ఉండేది. నాన్న అందుకు ఒప్పుకునేవారు కాదు. ‘వాహనం రిపేరు చేస్తున్నది మెకానిక్ అయినా సరే పని జరుగుతున్నప్పుడు నువ్వు దగ్గర ఉండాలి’ అనేవారు. అలాగేనని నేను దగ్గర ఉంటే మెకానిక్‌లు నేను కారు దగ్గర ఉన్నంతసేపు పని పూర్తిచేసే వారు కాదు. పది నిమిషాలు మరో విభాగంలోకి వెళ్లి వచ్చేలోపు అంతా సెట్ చేసి పెట్టేసేవాళ్లు. ‘ప్రాబ్లమ్ ఏంటి’ అంటే మాట దాట వేసే వాళ్లు. మళ్లీ మళ్లీ అడుగుతుంటే వాళ్లకు నచ్చేది కాదు. నేనే స్వయంగా పని చేయడానికి టూల్స్ తీసుకుంటే అవమానంగా భావించేవాళ్లు. అలా నాన్నతో ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. మొత్తానికి నాకు పని వచ్చని తెలిసిన సందర్భం ఏదంటే... మా సీనియర్ మెకానిక్ ఉద్యోగం మానేసి వెళ్లినప్పుడు. గ్యారేజ్‌లో ఇలా ఉంటే... ఇక మెటీరియల్ కొనేటప్పుడు కూడా ఘోరంగా మోసపోతుండేదాన్ని. వాళ్ల రిసీవింగ్ గొప్పగా ఉండేది. ‘ఎంత మంచి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారో’ అని ప్రశంసిస్తూ ‘మేడమ్‌కి స్పెషల్ మెటీరియల్ ఇవ్వమని’ చెప్పేవాళ్లు. సీల్ పక్కాగా ఉండేది. ఒకసారి ప్రయత్నించి విఫలమైన వస్తువులను కూడా తిరిగి ప్యాక్ చేసి సీల్ చేస్తారని తెలిసింది. ఈ ప్రొఫెషన్ వదిలి వెళ్లిపోవాలనిపించిన ఇలాంటి సందర్భాలెన్నో. ఉద్యోగ జీవితం నాకు నల్లేరు మీద నడకలా సాగింది మరి. చూస్తూ ఊరుకోకూడదు! ‘ఒక ఉద్యోగి మన గ్యారేజ్ వదిలి వెళ్తున్నాడంటే అందుకు కారణం ఏమిటో స్వయంగా నువ్వే తెలుసుకోవాలి. ఒక ఉద్యోగి నాలుగ్గోడల మధ్య యజమాని ముందు మాత్రమే మనసు విప్పి మాట్లాడతారు’ అని చెప్పేవారు నాన్న. అలాగే ‘నాకు టైమ్ లేదు’ అని ఎవరైనా అన్నారంటే అందుకు ఒప్పుకునేవారు కాదు. తెలివైన వారయితే టైమ్ కుదుర్చుకుంటారు... అని కూడా చెప్పేవారు. నా సేవింగ్స్ మూడు లక్షలు, బ్యాంకు లోన్ మూడున్నర లక్షలు పెట్టి గ్యారేజ్‌ను విస్తరించాను. ఉద్యోగులకు జీతాలిస్తూ, బ్యాంకు వాయిదాలు కట్టడం కష్టమైపోయింది. తుంటి ఎముక విరగడంతో అమ్మ మూడేళ్లు మంచంలోనే ఉంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది– పది వరకు ఇల్లు, గ్యారేజ్ పని. నా పరిస్థితి చూసి నాన్న ఓసారి చాలా బాధగా ‘నీ కెరియర్ స్పాయిల్ చేశానా విద్యా?’ అన్నారు. ఉద్యోగంలో కొనసాగి ఉంటే ఇప్పటికి ఏదో ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యేదానివి... అన్నారు. నా శ్రమను మరో కంపెనీ అభివృద్ధి కోసం వినియోగించడం ఎందుకు నాన్నా? నీ పరిశ్రమను విస్తరించడానికే ఉపయోగపెడతానని చెప్పాను. అదే సమయంలోనే ఈ రంగంలో స్కానర్ వచ్చింది. నా చదువు ఆ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరించింది. అప్పటినుంచి మెకానిక్‌లు నన్ను తేలికగా చూడడానికి సాహసించలేకపోయారు. గ్యారేజ్ మొత్తం నా నియంత్రణలోకి వచ్చేసింది. అప్పటికి 2012 వచ్చింది. అప్పుడు నాన్న సంతోషంగా ‘నువ్వు పదిమందికి జీవితాన్ని ఇవ్వగలవు’ అన్నారు. అది నాకు అసలైన సర్టిఫికేట్. మూడు నెలల శిక్షణ తరగతులు మా గ్యారేజ్‌ను పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. నాన్న పేరుతో ఫౌండేషన్ స్థాపించి శిక్షణనిస్తున్నాం. మన గవర్నమెంట్లో ఏఎస్‌డీసీ సహకారంతో ట్రైనింగ్ క్లాసుల ద్వారా ఎనిమిది వందల మందికి శిక్షణనిచ్చాం. జర్మనీ కంపెనీతో నేరుగా అంగీకారం కుదుర్చుకున్నాం. అనేక కాలేజ్‌లు మాతో అనుసంధానం అయి ఉన్నాయిప్పుడు’’ అని మెండైన ఆత్మవిశ్వాసంతో చెప్పారు విద్యానంబిరాజన్. ప్రయాణం ఆపలేదు! గ్యారేజ్ నిర్వహణలో ఓ దశలో నా బంగారం కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అన్న, తమ్ముడు యూఎస్‌లో మంచి స్థితిలోనే ఉన్నారు కానీ వారి నుంచి సహాయం తీసుకోవడం నాన్నకు ఇష్టం లేదు. కష్టమైనా నష్టమైనా మనిద్దరమే భరించాలనేవారు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన చెప్పినట్లే నడిపిస్తున్నాను. కరోనా సమయంలో మాత్రం మా తమ్ముడు ‘గ్యారేజ్ నడవకపోతే నీ ఉద్యోగుల జీతాలకు డబ్బు ఎలాగ’ అని కొంత డబ్బు పంపించాడు. ఎన్నో సంతోషాలు, సవాళ్లు... ఎన్ని సవాళ్లు ఎదురైనా నా జర్నీని ఆపలేదు. ఎన్నిసార్లు కిందపడ్డామని కాదు, ఎన్నిసార్లు లేచామనేది ముఖ్యం. మొదటిసారి పడినప్పుడు లేవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆ తర్వాత పడిన మరుక్షణం లేచి పొరపాటును సరిదిద్దుకోగలుగుతారు ఎవరైనా. నాన్న కోసం ఎంచుకున్న రంగానికి వన్నె తెచ్చానని చెప్పగలను. మా కంపెనీ లోగోలో ఉన్నట్లు నా ప్రయాణం శిఖరానికి చేరువవుతోంది. – విద్యానంబిరాజన్, సీఈవో, పారామౌంట్ ఆటో బే సర్వీసెస్, సికింద్రాబాద్. నాన్నా! నేనున్నాను! నంబిరాజన్ గ్యారేజ్ స్థాపించి పదేళ్లు గడిచిపోయాయి. ఇద్దరు కొడుకులు యూఎస్‌లో స్థిరపడ్డారు. కూతురు విద్య హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అన్నపూర్ణ ఫాయిల్స్కి రీజియనల్ మేనేజర్. తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడితే ఉన్నఫళాన ఫ్లయిట్ ఎక్కి హైదరాబాద్‌కు రాగలిగింది ఇండియాలో ఉన్న కూతురు మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో విద్యానంబిరాజన్కు ఎయిర్టెల్, హైదరాబాద్ విభాగంలో పెద్ద ప్యాకేజ్‌తో ఉద్యోగం వచ్చింది. అప్పటికే పాలిన్ ఎలర్జీ, అల్ట్రా వయొలెట్ కిరణాలను భరించలేకపోవడం వంటి సమస్యలు తండ్రిని తీవ్రమైన చర్మసమస్యకు గురి చేశాయి. కూతురు దగ్గరే ఉంది. కానీ ఆయనలో తీవ్రమైన బెంగ. కొడుకులు దగ్గర లేరు. తాను నిర్మించుకున్న ఈ చిన్న సామ్రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? ఇది ఆడపిల్లలు చేయగలిగిన పని కాదు కదా అని మథనపడుతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో విద్యానంబిరాజన్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇంటికి వచ్చి ‘మీ ఇండస్ట్రీని నేను నడిపిస్తాను’ అని చెప్పారు. -వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
పెళ్లింట భారీ చోరీ
కుషాయిగూడ: ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ 4– ఎవెన్యూ బీ ,–171లో పారిశ్రామికవేత్త ఐలేని నర్సింహారెడ్డి కుటుంబం నివాసముంటోంది. నర్సింహారెడ్డి చిన్నకుమారుడు సూర్య వివాహం గత నెల 29న జరగ్గా, రిసెప్షన్‌ను పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించారు. విందులో పాల్గొనేందుకు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోగా, నేపాల్‌కు చెందిన వాచ్‌మన్ భీం ఒక్కరే ఇంట్లో ఉండిపోయారు. ముందస్తు పథకం ప్రకారం భీం మరో సహచరుడిని పిలిపించుకుని ఇంట్లోని లాకర్ తాళాలు పగులగొట్టాడు. వజ్రాలు పొదిగిన హారంతోపాటు బంగారం తదితర 25 రకాల ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను రెండు పెద్ద సంచుల్లో నింపుకుని ఇంటి యజమాని స్కూటీపైనే పరారయ్యాడు. సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లిన తర్వాత స్కూటీని ఓ చెత్తకుప్ప సమీపంలో వదిలేసి ఆ సంచులను భుజాన వేసుకుని తాపీగా వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో సాయంత్రం ఏడున్నర గంటలకు రికార్డు అయ్యాయి. విందు నుంచి వచ్చేసరికి చిందరవందర పెళ్లి, రిసెప్షన్ ప్రశాంతంగా జరిగాయన్న ఆనందంలో ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అక్కడి పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు. రిసెప్షన్ పూర్తికాగానే కొంతమంది బంధువులు, కుటుంబసభ్యులు రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. గేటు మూసి ఉండటంతో కాలింగ్ బెల్ కొడుతూ వాచ్‌మన్‌ను పిలిచారు. ఉలుకూపలుకు లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నర్సింహారెడ్డి వచ్చి ఆభరణాలు, ఇతర పరికరాలు చోరీకి గురయ్యాయని గుర్తించి మరునాడు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్తోపాటు డాగ్‌స్క్వాడ్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. చోరీ జరిగిన తీరును పరిశీలించి అక్కడ పలు ఆధారాలను సేకరించారు. సైనిక్‌పురి చౌరస్తా సమీపంలో స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 7 దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ పేర్కొన్నారు. -
మానవతా దృక్పథంతో వ్యవహరించారు
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎలా పోతే మాకేంటని పట్టించుకోని కాలమిది. సాటి మనుషులకు ప్రమాదం జరిగినా చూసీచూడనట్టు వెళ్లిపోయే సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. మనుషులకే దిక్కులేని ఈ సమాజంలో ఇక పసుపక్షాదుల సంగతి చెప్పనక్కరలేదు. అందులోనూ కాకి లాంటి పక్షులకు దిక్కుండదు. కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఒక కాకిని కాపాడటానికి కొందరు యువకులు చేసిన ప్రయత్నాలు అభినందనీయం. హైదరాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతంలో ఒక కాకి విద్యుత్ తీగలపై పెనవేసుకుపోయిన పతంగి మాంజాలో చిక్కుకుపోయింది. కాకి కాళ్లకు పెనవేసుకున్న మాంజా నుంచి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుంది. ఒకటికాదు రెండు కాదు. మూడు రోజులుగా అలా కొట్టుకుని నీరసించి ఇంక చేతకాక విద్యుత్ వైర్ల నుంచి కిందకు వేలాడింది. అప్పుడప్పుడు బలం తెచ్చుకుని అరవడం మాత్రం ఆపలేదు. మూడురోజులుగా ఈ తతంగం గమనిస్తున్న స్థానికుల్లో ఒకరు విషయాన్ని నగరంలోని వన్యప్రాణులను సంరక్షించే ఎనిమిల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీకి చేరవేశారు. అంతే, ఆ వారియర్స్ వెంటనే వాలిపోయారక్కడ. ఆ సొసైటీకి చెందిన యువకులు వచ్చి స్థానికంగా అగ్నిమాపక కేంద్రానికి వెళ్లి సహాయాన్ని అర్థించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సానుకూలంగా స్పందించి ఫైరింజన్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకొని కాకిని పరిశీలించి చూడగా అది ప్రాణాలతోనే ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది కాకికి చిక్కుకున్న మంజాను తొలగించి కాకిని పట్టుకుని ఎనిమల్ వారియర్స్ సంస్థకు అందించారు. వారు దానిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని ఒక వస్త్రాన్ని చుట్టి దానిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాకి ప్రాణాలను కాపడానికి అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తున్న స్థానికి ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులను అభినందించారు. ‘పక్కవారికి కష్టం వచ్చినా పట్టించుకోని ఈ కాలంలో ఒక కాకి ప్రాణాల కోసం ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులు పడిన తాపత్రయం అభినందనీయం’ అంటూ స్థానిక సీనియర్ న్యాయవాది కే. రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సంస్థ పెంపుడు జంతువులు, ఇంకా ఇతరత్రా జంతువులు ఆపదలో ఉన్నప్పుడు సాయం అందించడానికి ముందుంటుంది. -
అట్టహాసంగా ‘ఎస్పీఎల్’ ముగింపు వేడుక
సాక్షి, హైదరాబాద్(నేరేడ్మెట్) : ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్’ (ఎస్పీఎల్) రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల బహుమతుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. గురువారం నేరేడ్మెట్ సైనిక్‌పురిలోని భవన్స్ క్రికెట్ మైదానంలో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. సాక్షి డైరెక్టర్లు ఏఎల్ఎన్ రెడ్డి, రాణిరెడ్డి, భవన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ జేఎల్ఎన్ శాస్త్రి, శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏజీఎం డీ.వెంకటేశ్వర్లు, డీన్ జి.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత కట్టుడు పళ్ల చికిత్స
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సరిత దంత ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు ట్రెఫాయిల్ ఇంప్లాంట్ పద్ధతిలో శాశ్వత స్థిరమైన కట్టుడు పళ్లను విజయవంతంగా అమర్చారు. శనివారం హోటల్ ఎన్‌కేఎం గ్రాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరిత ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆకాష్ చక్రవర్తి, డాక్టర్ దేవ్‌జ్యోతి ముఖర్జీ ఈ చికిత్స వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగరాజకుమారి (54) గత మూడేళ్ల నుంచి దంతాల సమస్యతో బాధపడుతుంది. చికిత్స కోసం సైనిక్‌పురిలోని సరిత డెంటల్ క్లినిక్ వైద్యులను సంప్రదించింది. పరీక్షించిన వైద్యులు దంత వైద్య రంగంలో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రెఫాయిల్ ఇంప్లాంట్ టెక్నాలజీ సహాయంతో శాశ్వత, స్థిరమైన పళ్లను అమర్చాలని నిర్ణయించారు. ఈ చికిత్సలో అప్పటికే శిక్షణ పొందిన డాక్టర్ ఆకాష్ చక్రవర్తి, డాక్టర్ దేవ్‌జ్యోతి, డాక్టర్ పావని, డాక్టర్ సాయిప్రియల బృందం ఇటీవల ఆమెకు విజయవంతంగా చికిత్స చేశారు. భారతదేశంలో ఈ తరహా చికిత్సలు రెండు జరిగినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిదని డాక్టర్ ఆకాష్ చక్రవర్తి ప్రకటించారు. -
సేమ్ జెండర్ అడ్డా
కొన్నాళ్ల కిందట. బెంగళూరులోని ఓ కేఫ్. చేతిలో చేయి వేసుకుని నిలబడ్డ సేమ్ జెండర్ జంటొకటి కేఫ్‌లో కాస్త మూలగా ఉన్న చోట టేబుల్ కోసం చూస్తోంది. టేబుల్ దొరికింది. వెళ్లి కూర్చోబోతుంటే ‘‘మీరిలా కూర్చోడానికి మిగిలిన కస్టమర్స్ ఇష్టపడరు’’ అంటూ వాళ్లను కూర్చోనివ్వలేదు ఆ కేఫ్ సిబ్బంది. అంతేకాదు, వాళ్ల పట్ల చాలా అభ్యంతరకరంగా కూడా ప్రవర్తించారు. అప్పుడు అక్కడే ఉన్న హెప్సీబా స్మిత్ అనే అమ్మాయి వాళ్లను గమనించింది. ఆ కేఫ్ సిబ్బంది తీరు ఆమెకు నచ్చలేదు. బాధేసింది కూడా. ఒకే జెండర్ వాళ్లిద్దరూ చేతిలో చేయి వేసుకుని వచ్చినంత మాత్రాన వాళ్లు స్వలింగ సంపర్కులన్నట్టేనా? ఒకవేళ అయితే రెస్టారెంట్ సిబ్బందికొచ్చిన ఇబ్బంది ఏంటీ? అనుకుంది. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వాళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ చోటు కల్పిస్తే బాగుంటుంది కదా అని కూడా ఆలోచించింది బైసెక్సువల్ అయిన హెప్సీబా. ఆ నిశ్చయంతోనే అప్పటిదాకా ‘తాజ్ వెస్టెండ్’ లో బార్టెండర్గా చేస్తున్న పనిని వదిలేసి సొంతూరైన హైదరాబాద్‌కు వచ్చేసింది. పీపుల్స్ చాయిస్ తన క్లాస్మేట్, స్నేహితుడూ అయిన మహ్మద్ ఆదాంతో కలిసి తొమ్మిది నెలల కిందట ఎల్జీబీటీక్యూ కోసం సైనిక్‌పురిలో ‘పీపుల్స్ చాయిస్’ పేరుతో కేఫ్‌ను స్థాపించింది. ఇది పెట్టడానికి రెండేళ్లు పట్టిందట! తన ఆలోచన గురించి మహ్మద్‌కు చెప్పినప్పుడు.. ‘‘ముందు ఖ్వీర్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి, వాళ్లతో స్నేహం చేసి వాళ్లలో కలిసిపోయి వాళ్ల అభిరుచులు, ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే దానికి తగ్గట్టే కేఫ్ ప్లాన్ చేసుకోవాలి’’ అని సలహా ఇచ్చాడట ఆదాం.. హెప్సీబాకు. అతను చెప్పినట్టే చేసింది. ‘ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్’లో కూడా పాలుపంచుకున్నారిద్దరూ. ఇంత పరిశీలన, అధ్యయనం తర్వాతే ‘పీపుల్స్ చాయిస్’ కేఫ్‌కు రూపమిచ్చారు. వీళ్లిద్దరూ మంచి పాకశాస్త్ర ప్రవీణులు కూడా. కేఫ్‌లో వంటపనీ చేస్తుంటారు. పీపుల్స్ చాయిస్లో లైవ్ పెర్ఫార్మెన్స్తో పాటు ఈవెంట్స్‌నూ నిర్వహిస్తుంటారు. దేశంలో ఎల్జీబీటీక్యూ కోసం నడుస్తున్న అతి కొద్ది కేఫ్‌లలో ‘పీపుల్స్ చాయిస్’ ఒకటిగా.. వాళ్లకోసం ఉన్న అద్భుతమైన స్పేస్‌గా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల వాళ్లతో..! అయితే ఈ ప్రయాణమంతా ఇక్కడ చెప్పుకున్నంత సాఫీగా సాగలేదు. కేఫ్ చుట్టుపక్కల వాళ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ‘‘ఒకసారైతే ఈవెంట్ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్లొచ్చి కేఫ్ ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మల్ని విరిచేశారు. సామాన్లను పడేసి.. చిందర వందర చేశారు. ‘‘పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం. అదృష్టం ఏమంటే పోలీసులు మా వైపు నిలబడ్డారు. వెంటనే వాళ్లను పంపించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఆ సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతూంటుంది’’ అంటుంది హెప్సీబా. చదువే పరిష్కారం కొంతమంది స్నేహితులతో కలిసి పేదరికంలో ఉన్న ఎల్జీబీటీ వాళ్లకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హెప్సీబా, మహ్మద్. ‘‘మారుమూలన ఉన్న వాళ్లు హైదరాబాద్‌కు రాలేరు. అందుకే మేమే తరచుగా అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి చదువు చెప్తున్నాం. ‘‘ఈ రెండేళ్లలో నేనూ చాలా నేర్చుకున్నాను. ఈ భూమ్మీద గౌరవం అందుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మనుషులందరూ సమానమే. ఆ సమానత్వాన్ని తెచ్చే, ఇచ్చే సాధనం చదువొక్కటే. దానికోసమే మా ఈ ప్రయత్నం’’అంటుంది హెప్సీబా. -
విషపు ఇంజక్షన్ ఎక్కించుకొని...
సాక్షి, హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో ఓ వైద్యురాలు మృతిచెందిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు. సివిల్ సర్జన్ డాక్టర్ ఎంవీఏ లక్ష్మీ (43) సైనిక్‌పురి, హస్తినాపురి, జేపీ టవర్‌లో నివాసం ఉంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఓడిగా విధులు నిర్వహిస్తుంది. అవివాహిత అయిన ఆమె ఒంటరిగానే ఉంటుంది. గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన వాచ్మెన్ అపార్టుమెంట్ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ఇరుగు పొరుగు సాయంతో పలుమార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను బద్దలుకొట్టి చూడగా ఇంట్లో చాపపై ఆమె మృతి చెంది ఉంది. సంఘటన స్థలంలో రెండు ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి ఆమె స్వయంగా విషాన్ని ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
వైన్‌షాప్ రేకులు పగలకొట్టి..
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో దొంగలు రెచ్చిపోయారు. అడ్డు అదుపు లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. "కన్నం వేయడానికి కాదేది అనర్హం" అనుకున్నారో ఏమో ఈసారీ ఏకంగా మద్యం దుకాణానికే కన్నం వేశారు. షాప్‌లో ఉన్నదంతా స్వాహా చేశారు. తాళం వేసి ఉన్న దుకాణం రేకులు బద్దలు కొట్టి ఉన్నకాడికి ఊడ్చెకెళ్లిన సంఘటన నగరంలోని నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక సైనిక్‌పురిలోని గోకుల్ వైన్స్‌లో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 6 లక్షల నగదుతో పాటు మద్యాన్ని ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.