ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొదరుడు ముషీర్ ఖాన్ దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్‌లో దుమ్ములేపిన ముషీర్ ఖాన్.. ఇప్పుడు మరో దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సైతం ఆకట్టుకుంటున్నాడు.
ఈ టోర్నీలో ఇండియా-బి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్.. ఇండియా-ఎ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 181 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
బీసీసీఐ బంపరాఫర్..
ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్న ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఆసీస్ పర్యటనకు భారత-ఎ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ముషీర్ ఖాన్‌పై భారత సెలక్టర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. అతడిని భారత-ఎ జట్టుకు ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు రాజస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్‌ను సైతం ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ యోచిస్తోందంట.
అదే విధంగా భారత-ఎ జట్టుతో పాటు ఇద్దరు టెస్టు స్పెషలిస్ట్‌లు, సీనియర్ జట్టుకు ఆడే పేస్ బౌలర్లను బీసీసీఐ ఆసీస్‌కు పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఏడాది నవంబర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment