![Schumacher documentary release Shortley - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/30/SCHUMACHER-BIKE-CAR.jpg.webp?itok=KuN2A2XL)
జెనీవా: ఫార్ములావన్ (ఎఫ్1)కు చిరునామాగా నిలిచిన దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) జీవితానికి సంబంధించి అరుదైన అంశాలతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందుతోంది. ఏడుసార్లు ఎఫ్1 విశ్వవిజేతగా నిలిచిన ఈ జర్మన్ స్టార్ 2013లో ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ తీవ్ర ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను బయటి ప్రపంచానికి కనపడలేదు. ఒకవైపు అతనికి చికిత్స కొనసాగిస్తూనే... మరోవైపు 52 ఏళ్ల షుమాకర్ తాజా ఆరోగ్య స్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతని కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రానున్న కొత్త డాక్యుమెంటరీలో పలు ఆసక్తికర అంశాలు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు అతని ఆరోగ్యం గురించి కూడా స్పష్టత రావచ్చు. ముఖ్యంగా 2013 ప్రమాదం తర్వాత అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇందులో ఉండవచ్చని, షుమాకర్ భార్య ఈ ప్రైవేట్ రికార్డింగ్‌లను స్వయంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే రానున్న డాక్యుమెంటరీలోని అరుదైన వీడియోలు అభిమానులను అలరిస్తాయని రూపకర్తలు మైకేల్ వెక్–బ్రూనో కమర్టన్స్ భావిస్తున్నారు. డాక్యుమెంటరీ నిర్మాణం పూర్తయిందని, గత డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా... కరోనా కారణంగా ఆలస్యమైందని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment