చ‌రిత్ర సృష్టించిన హెట్‌మైర్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా | Shimron Hetmyer breaks world record, becomes first batter in T20 cricket history | Sakshi
Sakshi News home page

CPL 2024: చ‌రిత్ర సృష్టించిన హెట్‌మైర్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published Thu, Sep 5 2024 1:23 PM | Last Updated on Thu, Sep 5 2024 1:39 PM

Shimron Hetmyer breaks world record, becomes first batter in T20 cricket history

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ మరో అద్బుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో అమెజాన్‌ వారియర్స్‌ విజయభేరి మోగిచింది.

267 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ 18 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. సెయింట్‌ కిట్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఆండ్రీ ఫ్లెచర్‌(33 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 81 పరుగులు) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 

మిగితా బ్యాటర్ల నుంచి ఆశించినంత మేర సహకారం అందకపోవడంతో సెయింట్‌ కిట్స్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గయానా బౌలర్లలో స్పిన్నర్లు ఇమ్రాన్‌ తహీర్‌, మోటీ తలా మూడు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిటోరియస్‌ రెండు, కిమో పాల్‌, రిఫర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

హెట్‌మైర్‌ విధ్వంసం..
ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. గయానా బ్యాటర్లలో షిమ్రాన్‌ హెట్‌మైర్‌ విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన హెట్‌మైర్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

 ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 39 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్‌ ఆటగాడు 11 సిక్స్‌లు సాయంతో 91 పరుగులు చేశాడు.అతడితో పాటు గుర్బాజ్‌ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

హెట్‌మైర్‌ వరల్డ్‌ రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హెట్‌మైర్‌ ఓ వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా పదికి పైగా సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా హెట్‌మైర్ రికార్డులకెక్కాడు. 

ఈ మ్యాచ్‌లో 11 సిక్స్‌లు బాదిన హెట్‌మైర్ కనీసం ఒక్క ఫోరు కూడా కొట్టకపోవడం విశేషం. అంతకుముందు ఫోరు కూడా లేకుండా అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇంగ్లండ్‌ ఇంగ్లండ్ ఆటగాడు రికీ వెసెల్స్ పేరిట ఉండేది. 2019లో టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌పై రికీ వెసెల్స్ బౌండరీ లేకుండా 9 సిక్స‌ర్లు బాదాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement