
న్యూఢిల్లీ: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, సహచర ఆటగాడు యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి చిందేశాడు. 'రోజస్' అంటూ సాగే ఓ పాటకు వీరిద్దరూ ప్రొఫెషనల్ డ్యాన్సర్లలా ఇరగదీశారు. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మా పాదాల వైపు చూస్తున్నారా అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైక్‌లు సాధించిన ఈ వీడియోను టీమిండియా ఆటగాళ్లు చాహల్, లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, అక్షర్ పటేల్, అశ్విన్‌లు తెగ మెచ్చుకున్నారు. వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా వీడియోలో ధనశ్రీ హావభావలకు నెటిజన్లు మంత్రముగ్దులయ్యారు. ఆమెను ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్‌తో పోలుస్తూ ఆకాశానికెత్తారు.
ఇదివరకే యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ధనశ్రీ.. తాజా వీడియోతో మరింత పాపులారిటిని సొంతం చేసుకుంది. కాగా, ధనశ్రీ వర్మను చాహల్ గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఓ పక్క ధనశ్రీ యూట్యూబ్ వేదికగా డ్యాన్స్‌లతో అదరగొడుతుంటే, మరో పక్క చాహల్ తన మణికట్టు మాయాజాలంతో టీమిండియాకు మరపురాని విజయాలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. చాహల్ కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్‌ను నడిపిస్తున్నప్పటికీ.. దాన్ని కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment