షమీ డబుల్‌ సెంచరీ | SMAT 2024: Mohammed Shami Completes 200 T20 Wickets | Sakshi
Sakshi News home page

షమీ డబుల్‌ సెంచరీ

Published Thu, Dec 12 2024 3:18 PM | Last Updated on Thu, Dec 12 2024 4:32 PM

SMAT 2024: Mohammed Shami Completes 200 T20 Wickets

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ పొట్టి ఫార్మాట్‌లో 200 వికెట్ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో భాగంగా బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షమీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. టీ20ల్లో షమీ వికెట్ల సంఖ్య ప్రస్తుతం 201గా ఉంది. షమీ 165 టీ20 మ్యాచ్‌ల్లో వికెట్ల డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు.  

టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్‌ పేరిట ఉంది. చహల్‌ పొట్టి ఫార్మాట్‌లో 364 వికెట్లు తీశాడు. చహల్‌ తర్వాత కింద పేర్కొన్న బౌలర్ల 200 అంతకంటే ఎక్కువ టీ20 వికెట్లు తీశారు.

పియూశ్‌ చావ్లా- 319
భువనేశ్వర్‌ కుమార్‌-310
రవిచంద్రన్‌ అశ్విన్‌-310
అమిత్‌ మిశ్రా-285
హర్షల్‌ పటేల్‌-244
హర్భజన్‌ సింగ్‌-235
జయదేవ్‌ ఉనద్కత్‌-234
అక్షర్‌ పటేల్‌-233
రవీంద్ర జడేజా-225
సందీప్‌ శర్మ-214
అర్షదీప్‌ సింగ్‌-203
ఉమేశ్‌ యాదవ్‌-202
మహ్మద్‌ షమీ-201
కుల్దీప్‌ యాదవ్‌-200

ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత డ్వేన్‌ బ్రావోకు దక్కుతుంది. ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌ పొట్టి ఫార్మాట్‌లో 631 వికెట్లు తీశాడు. బ్రావో తర్వాత రషీద్‌ ఖాన్‌ (615), సునీల్‌ నరైన్‌ (569) అత్యధిక టీ20 వికెట్లు తీసిన వారిలో ఉన్నారు.

బరోడా, బెంగాల్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్‌ 11) జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌-1లో బెంగాల్‌పై బరోడా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బెంగాల్‌ 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. 

బరోడా బౌలర్లు హార్దిక్‌ పాండ్యా (4-0-27-3), లుక్మన్‌ మేరీవాలా (3-0-17-3), అతీత్‌ సేథ్‌ (4-0-41-3) తలో చేయి వేసి బెంగాల్‌ పతనాన్ని శాశించారు. బెంగాల్‌కు గెలిపించేందుకు షాబాజ్‌ అహ్మద్‌ (55) విఫలయత్నం చేశాడు.

కాగా, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో నిన్నటితో సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సెమీస్‌కు చేరాయి. డిసెంబర్‌ 13న జరిగే తొలి సెమీఫైనల్లో బరోడా, ముంబై.. అదే రోజు జరిగే రెండో సెమీఫైనల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జట్లు డిసెంబర్‌ 15న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement