టీమిండియా వైస్‌ కెప్టెన్‌ ఖాతాలో మరో రికార్డు | Smriti Mandhana Becomes Youngest To Surpass 8000 International Runs | Sakshi
Sakshi News home page

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ ఖాతాలో మరో రికార్డు

Published Thu, Dec 12 2024 5:59 PM | Last Updated on Thu, Dec 12 2024 6:12 PM

Smriti Mandhana Becomes Youngest To Surpass 8000 International Runs

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సూపర్‌ సెంచరీతో మెరిసిన మంధన, ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. 

ఈ ఘనత సాధించే క్రమంలో మంధన మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న అతి  పిన్న వయస్కురాలుగా (28 ఏళ్ల 146 రోజుల్లో) రికార్డు నెలకొల్పింది. మంధన వన్డేల్లో 3812 పరుగులు.. టీ20ల్లో 3568, టీ20ల్లో 629 పరుగులు చేసింది.

ఆసీస్‌తో మూడో వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో మంధన సెంచరీతో (109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 105 పరుగులు) కదంతొక్కినప్పటికీ టీమిండియా 83 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 

అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (110) మెరుపు సెంచరీతో సత్తా చాటగా.. ఆష్లే గార్డ్‌నర్‌ (50), తహిళ మెక్‌గ్రాత్‌ (56 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా. దీప్తి శర్మ ఓ వికెట్‌ పడగొట్టింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన సూపర్‌ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్‌ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధనతో పాటు హర్లీన్‌ డియోల్‌ (39) కాసేపు క్రీజ్‌లో గడిపింది. భారత ఇన్నింగ్స్‌లో మంధన, హర్లీన్‌తో పాటు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12), జెమీమా రోడ్రిగెజ్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ (10-1-30-5) టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టింది. అలానా కింగ్‌, మెగాన్‌ షట్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ ఓ వికెట్‌ దక్కించుకుంది. ఈ ఓటమితో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement