న్యూయార్క్: ఊహించని ఫలితాలతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ముందుకు సాగుతోంది. కరోనా వైరస్ కారణంగా పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఈ టోర్నీకి దూరమైనా... బరిలో దిగిన టాప్–10లోపు క్రీడాకారిణులు కూడా తడబడుతున్నారు. తాజాగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ ఎలీసె మెర్‌టెన్స్ (బెల్జియం) 75 నిమిషాల్లో 6–3, 6–3తో సోఫియా కెనిన్‌కు షాక్ ఇచ్చి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన మెర్‌టెన్స్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 26 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన సోఫియా ఏదశలోనూ మ్యాచ్‌లో కోలుకునేలా కనిపించలేదు. సోఫియా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్–20 సీడింగ్స్‌లో ముగ్గురు మాత్రమే (సెరెనా–మూడో సీడ్, ఒసాకా–నాలుగో సీడ్, మెర్‌టెన్స్–16వ సీడ్) బరిలో మిగిలారు.
సెమీస్‌లో జెన్నిఫర్ బ్రేడీ
ఒకవైపు రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరగగా... అమెరికాకే చెందిన 28వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీ తన కెరీర్‌లోనే తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ బ్రేడీ 6–3, 6–2తో 23వ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ పుతింత్‌సెవా (కజకిస్తాన్)ను ఓడించింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రేడీ ఆరు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌కు ముందు తన కెరీర్‌లో 12 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన బ్రేడీ ఏనాడూ క్వార్టర్ ఫైనల్ చేరలేదు. ఒసాకా, షెల్బీ రోజర్స్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ విజేతతో సెమీఫైనల్లో బ్రేడీ తలపడుతుంది.
అమ్మలు అదుర్స్...
మరోవైపు ‘మదర్స్’ అజరెంకా (బెలారస్), పిరన్‌కోవా (బల్గేరియా) తమ జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు సంపాదించారు. 2016 డిసెంబర్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఆరు నెలలపాటు... 2018 ఏప్రిల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన పిరన్‌కోవా రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యారు. యూఎస్ ఓపెన్‌తో పునరాగమనం చేసిన 33 ఏళ్ల పిరన్‌కోవా... అలీజి కార్నె (ఫ్రాన్స్)తో 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4, 6–7 (5/7), 6–3తో గెలిచింది. 20వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్)తో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 5–7, 6–1, 6–4తో నెగ్గింది. 2015 తర్వాత ఈ టోర్నీలో అజరెంకా క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనాతో పిరన్‌కోవా; మెర్‌టెన్స్‌తో అజరెంకా తలపడతారు.
బోపన్న జంట పరాజయం
పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 5–7తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హŸరియా టెకావ్ (రొమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 17 అనవసర తప్పిదాలు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 91 వేల డాలర్లు (రూ. 67 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
థీమ్ తడాఖా...
ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై అనర్హత వేటు పడటంతో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన రెండో సీడ్, డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ 15వ సీడ్ ఫీలిక్స్ అగుర్ అలియసిమ్ (కెనడా)పై 7–6 (7/4), 6–1, 6–1తో నెగ్గి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రెండు గంటల ఏడు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో థీమ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–1, 6–0తో టియాఫో (అమెరికా)పై, పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–3, 6–3, 6–3తో ఆరో సీడ్ బెరెటిని (ఇటలీ)పై నెగ్గారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుబ్లెవ్‌తో మెద్వెదెవ్; మినార్‌తో థీమ్ ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment