
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దారుణ ఓటమి చవిచూసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో ప్రోటీస్ పరాజయం పాలైంది. అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా సఫారీలకు ఇదే అతి పెద్ద ఓటమి.
327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. షమీ, కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా టెంబా బావుమా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి చెందామని బావుమా తెలిపాడు.
"టీమిండియాతో పోటీ మాకు ఒక పెద్ద సవాలు అని తెలుసు. బ్యాటింగ్‌లో మేము దారుణంగా విఫలమయ్యాం. మరోసారి ఛేజింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. ఛేజింగ్ ప్రారంభించే ముందు మా బ్యాటర్లతో కొన్ని విషయాలను చర్చించాను.
కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. తొలుత పవర్ ప్లేలో భారత్ దూకుడుగా ఆడింది. మొదటి 10 ఓవర్లలో 90 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మా బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. టీమిండియా రన్‌రేట్‌ను తగ్గించారు. రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.
ఆతర్వాత కోహ్లీ, అయ్యర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వికెట్ బ్యాటింగ్‌కు బాగానే అనుకూలించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము బ్యాటింగ్ మెరుగ్గా చేయలేకపోయాం. సెమీస్‌లో కూడా ఇదే వేదికపై మేము ఆడే అవకాశముంది. అందుకు తగ్గ ప్రణాళికలను మేము సిద్దం చేసుకుంటామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బావుమా పేర్కొన్నాడు.
చదవండి: మాకు ఎటువంటి స్పెషల్ ప్లాన్స్ లేవు.. అతడొక ఛాంపియన్! జడ్డూ కూడా: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment