‘బాక్సింగ్ డే’ టెస్టు క్లైమాక్స్‌కు చేరింది. భారత్, దక్షిణాఫ్రికా జట్లను విజయం ఊరిస్తోంది. సొంతగడ్డపై మరో 211 పరుగులు చేస్తే సఫారీలకు విజయం దక్కుతుంది. మామూలుగానైతే రోజంతా ఆడితే ఇదేమంత కష్టమైన పని కాదు! అయితే చేతిలో 6 వికెట్లే ఉన్నాయి. భారత పేసర్లు దూకుడు మీదున్నారు. నాలుగో రోజే మన బౌలర్లను అతి కష్టమ్మీద ఎదుర్కొంటూ పోరాడిన ఆతిథ్య జట్టు గురువారం ఎంత వరకు నిలబడగలదనేది ఆసక్తికరం. అయితే అన్నింటికి మించి వాతావరణ శాఖ అంచనా ప్రకారం చివరి రోజు భారీ వర్ష సూచన ఉంది. వాన రాకపోతే భారత్ గెలిచే అవకాశాలు మెండుగా ఉండగా...వరుణుడు కరుణించకపోతే ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సిందే!
సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికాల తొలి టెస్టు ఆట ఫలితం దగ్గరకొచ్చింది. కీలకమైన బ్యాటర్స్ ఇంకా అందుబాటులో ఉండటం ఇటు సఫారీకి, బౌలర్లు నిప్పులు చెరుగుతుండటం ఇరు జట్లకు విజయంపై ఆశలు రేపుతోంది. 305 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బుధవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 94 పరుగులు చేసింది. విజయానికి 211 పరుగుల దూరంలో ఉంది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (122 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 16/1తో ఆట కొనసాగించిన భారత్ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసి ఆలౌటైంది. రిషభ్ పంత్ (34 బంతుల్లో 34; 6 ఫోర్లు) టాప్ స్కోరర్.
వేగంగా ఆడి ఆలౌట్!
లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో భారత్ వేగంగా ఆడే ప్రయత్నం చేసి వెంటవెంటనే వికెట్లు సమర్పించుకుంది. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన శార్దుల్ ఠాకూర్ (10; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువ సేపు నిలువలేదు. రాహుల్ (74 బంతుల్లో 23; 4 ఫోర్లు), పుజారా (16) స్కోరును 50 పరుగులు దాటించారు. ఆ తర్వాత వచ్చిన వారిలో కోహ్లి (32 బంతుల్లో 18; 4 ఫోర్లు), రహానే (23 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నది కాసేపే అయినా చకచకా పరుగులు జత చేశారు. జాన్సెన్ వేసిన 37వ ఓవర్లో రహానే వరుసగా 4, 6, 4 బాదేశాడు. వీళ్లిదర్ని జాన్సెన్ అవుట్ చేశాడు. 111 పరుగులకే 6 వికెట్లు పడిపోగా, రిషభ్ పంత్ (34 బంతుల్లో 34; 6 ఫోర్లు) చివర్లో దూకుడు ప్రదర్శించాడు.
ఎల్గర్ పట్టుదలగా...
షమీ తన తొలి ఓవర్లోనే మార్క్‌రమ్ (1)ను బౌల్డ్ చేసి దక్షిణాఫ్రికాను దెబ్బ తీయగా, కీగన్ పీటర్సన్ (17)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ ఎల్గర్... వాన్ డెర్ డసెన్ (11) కొద్దిసేపు ప్రతిఘటించారు. ఎట్టకేలకు 22 ఓవర్ల తర్వాత బుమ్రా అద్భుతమైన డెలివరీతో డసెన్ బోల్తా కొట్టించాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన కేశవ్ మహరాజ్ (8)ను కూడా చివరి ఓవర్ ఐదో బంతికి బుమ్రా బౌల్డ్ చేయడంతో ఆట ముగిసింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 327, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 197 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) ఎల్గర్ (బి) ఎన్‌గిడి 23; మయాంక్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 4; శార్దుల్ (సి) ముల్డర్ (బి) రబడ 10; పుజారా (సి) డికాక్ (బి) ఎన్‌గిడి 16; కోహ్లి (సి) డికాక్ (బి) జాన్సెన్ 18; రహానే (సి) డసెన్ (బి) జాన్సెన్ 20; పంత్ (సి) ఎన్‌గిడి (బి) రబడ 34; అశ్విన్ (సి) పీటర్సన్ (బి) రబడ 14; షమీ (సి) ముల్డర్ (బి) రబడ 1; బుమ్రా నాటౌట్ 7; సిరాజ్ (బి) జాన్సెన్ 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (50.3 ఓవర్లలో ఆలౌట్) 174. వికెట్ల పతనం: 1–12, 2–34, 3–54, 4–79, 5–109, 6–111, 7–146, 8–166, 9–169, 10–174.
బౌలింగ్: రబడ 17–4–42–4, ఎన్‌గిడి 10–2–31–2, జాన్సెన్ 13.3–4–55–4, ముల్డర్ 10–4–25–0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (బి) షమీ 1; ఎల్గర్ (బ్యాటింగ్) 52; పీటర్సన్ (సి) పంత్ (బి) సిరాజ్ 17; వాన్ డెర్ డసెన్ (బి) బుమ్రా 11; కేశవ్ మహరాజ్ (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (40.5 ఓవర్లలో 4 వికెట్లకు) 94.
వికెట్ల పతనం: 1–1, 2–34, 3–74, 4–94.
బౌలింగ్: బుమ్రా 11.5–2–22–2, షమీ 9–2–29–1, సిరాజ్ 11–4–25–1, శార్దుల్ 5–0–11–0, అశ్విన్ 4–1–6–0.
ఎల్గర్
SA Vs IND: విజయానికి 6 వికెట్ల దూరంలో టీమిండియా!
Published Thu, Dec 30 2021 5:02 AM | Last Updated on Thu, Dec 30 2021 9:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment