గురుగ్రామ్ (హరియాణా): ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ రష్మిక 6–2, 7–6 (7/2)తో టాప్ సీడ్ వైదేహి చౌదరీ (గుజరాత్)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచే క్రమంలో రష్మిక తన ప్రత్యర్థులకు కేవలం ఒక సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. వైదేహితో జరిగిన ఫైనల్లో రష్మిక తొలి సెట్‌లోని రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న రష్మిక తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.
రెండో సెట్‌లో రష్మికకు గట్టిపోటీ ఎదురైంది. 4–5తో సెట్ కోల్పోయే స్థితిలో తొమ్మిదో గేమ్‌లో వైదేహి సర్వీస్‌ను బ్రేక్ చేసిన రష్మిక స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో రష్మిక పూర్తి ఆధిపత్యం చలాయించి కేవలం రెండు పాయింట్లు కోల్పోయి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అర్జున్ ఖడే (మహారాష్ట్ర) 6–3, 6–4తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment