Tennis championship
-
చాంపియన్స్ రితిన్ ప్రణవ్, వైదేహి
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్, గుజరాత్ క్రీడాకారిణి వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన వైదేహి 6–3, 6–3తో మాయా రేవతి (తమిళనాడు)పై విజయం సాధించింది. గంటన్నర పాటు సాగిన తుది పోరులో తొలి గేమ్ కోల్పోయిన వైదేహి ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి ముందంజ వేసింది. అదే జోరులో తొలి సెట్ కైవసం చేసుకున్న వైదేహి.. రెండో సెట్ కూడా నెగ్గి రెండోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడ్ ప్లేయర్ రెథిన్ ప్రణవ్ (తమిళనాడు) 6–4, 2–6, 6–2తో నితిన్ కుమార్ సిన్హా (రైల్వేస్)పై గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన 17 ఏళ్ల రెథిన్ ప్రణవ్ వరుస విజయాలతో సత్తా చాటి విజేతగా నిలిచాడు. -
బోపన్న చివరిపోరు...
లక్నో: ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్‌లో తన ప్రస్థానాన్ని ముగించడానికి భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న సిద్ధమయ్యాడు. మొరాకోతో నేడు మొదలయ్యే వరల్డ్ గ్రూప్–2 డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2002లో తొలిసారి డేవిస్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 43 ఏళ్ల బోపన్న 32 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో విజయం అందుకున్నాడు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్ జరుగుతాయి. యాసిన్ దిల్మీతో శశికుమార్ ముకుంద్, ఆడమ్ మౌన్డిర్తో సుమిత్ నగాల్ ఆడతారు. ఆదివారం ఒక డబుల్స్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్‌ను నిర్వహిస్తారు. డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ ఇలియట్ బెన్‌చిట్రి–యూనస్ లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్ సింగిల్స్‌లో యాసిన్ దిల్మీతో సుమిత్ నగాల్, ఆడమ్ మౌన్డిర్తో శశికుమార్ ముకుంద్ తలపడతారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మ్యాచ్‌కు సంబంధించి ‘డ్రా’ వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డేవిస్‌కప్ కెరీర్‌ను ముగిస్తున్న రోహన్ బోపన్నను సన్మానించారు. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక..
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రష్మిక 6–2, 6–2తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములపై అలవోకగా గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని పోరాటం రెండో రౌండ్లో ముగిసింది. షర్మదా బాలు (కర్ణాటక)తో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 7–5తో గెలిచి, రెండో సెట్‌ను 1–6తో కోల్పోయింది. మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా శ్రావ్య శివాని వైదొలిగింది. మరో మ్యాచ్‌లో తటవర్తి శ్రేయ (ఆంధ్రప్రదేశ్) 6–2, 3–6, 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో... స్మృతి భాసిన్ (తెలంగాణ) 4–6, 1–6తో ఆకాంక్ష (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయారు. విష్ణు పరాజయం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. రెండో రౌండ్లో నిక్కీ 6–4, 6–3తో ఫైజల్ కమర్ (రాజస్తాన్)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ‘లండన్ ఒలింపియన్’ విష్ణువర్ధన్ (తెలంగాణ) 4–6, 1–6తో నితిన్ కుమార్ సిన్హా (పశి్చమ బెంగాల్) చేతిలో... కాజా వినాయక్ శర్మ (ఆంధ్రప్రదేశ్) 4–6, 6–7 (2/7)తో సిద్ధార్థ్ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయారు చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
రెండో రౌండ్లో శ్రావ్య శివాని
న్యూఢిల్లీ: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి చిలకలపూడి శ్రావ్య శివాని రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో మూడో సీడ్ శ్రావ్య శివాని 6–3, 7–5తో శ్రీనిధిపై గెలిచింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా రెండో రౌండ్‌కు చేరింది. స్మృతి 7–6 (7/1), 5–7, 6–4తో మిహికా యాదవ్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో గంటా సాయికార్తీక్ రెడ్డి 4–6, 3–6తో టాప్ సీడ్ నిక్కీ పునాచా చేతిలో ఓడిపోయాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కాజా వినాయక్ శర్మ 6–4, 6–1తో భూపతి శక్తివేల్‌పై, విష్ణువర్ధన్ 6–4, 6–3తో ఆదిల్ కల్యాణ్‌పూర్‌పై నెగ్గారు. -
విజేత భమిడిపాటి శ్రీవల్లి రష్మిక
గురుగ్రామ్ (హరియాణా): ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ రష్మిక 6–2, 7–6 (7/2)తో టాప్ సీడ్ వైదేహి చౌదరీ (గుజరాత్)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచే క్రమంలో రష్మిక తన ప్రత్యర్థులకు కేవలం ఒక సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. వైదేహితో జరిగిన ఫైనల్లో రష్మిక తొలి సెట్లోని రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న రష్మిక తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో రష్మికకు గట్టిపోటీ ఎదురైంది. 4–5తో సెట్ కోల్పోయే స్థితిలో తొమ్మిదో గేమ్‌లో వైదేహి సర్వీస్‌ను బ్రేక్ చేసిన రష్మిక స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో రష్మిక పూర్తి ఆధిపత్యం చలాయించి కేవలం రెండు పాయింట్లు కోల్పోయి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అర్జున్ ఖడే (మహారాష్ట్ర) 6–3, 6–4తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. -
సుమధురం... ఈ విజయం!
సాక్షి, హైదరాబాద్: 7–3–2020.. భారత మహిళల టెన్నిస్ చరిత్రలో మరపురాని రోజు. ఎన్నేళ్లుగానో ఊరిస్తూ వస్తోన్న ఫలితాన్ని రాబట్టిన రోజు. దుబాయ్ వేదికగా జరిగిన ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన భారత్... తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. ఈ అద్భుతాన్ని సాకారం చేసిన భారత జట్టులోని సానియా మీర్జా, సౌజన్య భవిశెట్టి, అంకిత రైనా, రుతుజా భోసలే, రియా భాటియా తమ మనసులోని మాటను చెప్పారు. వారేమన్నారంటే... (భారత మహిళల టెన్నిస్ జట్టు కొత్త చరిత్ర) భారత మహిళల టెన్నిస్‌కు ఇదో గొప్ప రోజు. నా కెరీర్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో ఈ గొప్ప క్షణాలను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేము ఇంతకు ముందెన్నడూ ఇటువంటి ఫలితాన్ని రాబట్టలేదు. జట్టుగా మేము ఆడిన తీరు అమోఘం. అందులో నా పాత్ర కూడా ఉండటం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ టోర్నీలో నా ఆటతీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నా. డబుల్స్ విభాగంలో నేను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించా. –సానియా మీర్జా ఈ విజయం వల్ల వచ్చిన అనుభూతిని ప్రస్తుతం నేను మాటల్లో వర్ణించలేను. మేము మొదటిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. దీనిని సాధించడానికి జట్టుగా మేము చాలా శ్రమించాం. –సౌజన్య భవిశెట్టి గొప్పగా ఉంది. ఇటువంటి క్షణాలను ఆస్వాదించడం ఇదే మాకు తొలిసారి. మా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కోచ్‌కు, మిగతా జట్టు సభ్యులకు, మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ఒకే సమయంలో సింగిల్స్, డబుల్స్ ఆడటం కాస్త కష్టంగా అనిపించింది. సానియాతో డబుల్స్ ఆడటం గొప్ప అనుభూతి. –అంకిత రైనా. చాలా కఠినంగా సాగిన వారం అయినప్పటికీ గొప్ప ఫలితంతో ముగించాం. ఇటువంటి ఫలితాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. జట్టులోని ప్రతి ఒక్కరూ వంద శాతం కష్టపడ్డారు. నేను కొన్ని సార్లు ఓడి జట్టుకు శుభారంభం అందించలేకపోయాను. అయినప్పటికీ మిగతా జట్టు సభ్యులు ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవడం ఆనందాన్నిచ్చింది. –రుతుజా ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు. మేము చరిత్ర సృష్టించాం. మిగతా జట్టు సభ్యులు చాలా బాగా ఆడారు. వారికి నా అభినందనలు. టోర్నీ తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో ఓడినా... తర్వాత మేము పుంజుకున్న తీరు అద్భుతం. జట్టులో సానియా లాంటి అనుభవజ్ఞురాలు ఉండటం మాకు కలిసొచ్చింది. కీలక సమయంలో ఆమె సలహాలు ఉపయోగపడ్డాయి. –రియా భాటియా -
రెండు సింగిల్స్‌లోనూ భారత్‌కు నిరాశ
జాగ్రెబ్: డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా క్రొయేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు ఓటమి చవిచూశారు. తొలి సింగిల్స్‌లో 132వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–3, 4–6, 2–6తో ప్రపంచ 277వ ర్యాంకర్ బోర్నా గోజో చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో 182వ ర్యాంకర్ రామ్ కుమార్ 6–7 (8/10), 6–7 (8/10)తో 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్ చేతిలో పోరాడి ఓడాడు. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన క్రొయేషియా... నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లేదా రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక దాంట్లో విజయం సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్‌కప్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. -
విజేత సీవీ ఆనంద్
సాక్షి, విశాఖ స్పోర్ట్స్: రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ప్లేయర్‌కు పురుషుల సింగిల్స్ టైటిల్ లభించింది. వైజాగ్‌లో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) సీవీ ఆనంద్ చాంపియన్‌గా అవతరించారు. సీఐఎస్ఎఫ్ తరఫున బరిలోకి దిగిన ఆనంద్ ఫైనల్లో 8–4తో సత్యనారాయణ (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆనంద్ సెమీఫైనల్లో శైలేశ్ కుమార్ (బీఎస్ఎఫ్)ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత 20 ఏళ్లలో ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సీఐఎస్ఎఫ్కు ఓ విభాగంలో టైటిల్ లభించడం ఇదే ప్రథమం. టీమ్ చాంపియన్íÙప్ విభాగంలో సీఆర్పీఎఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఐటీబీపీపై సీఆర్పీఎఫ్ గెలిచింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 19 జట్ల నుంచి 103 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావంగ్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ అలోక్ ప్రభాకర్, విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు. -
సెమీ ఫైనల్లో నిక్కీ, సౌజన్య, రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల విభాగంలో సౌజన్య భవిశెట్టి సెమీస్‌కు చేరగా... శ్రేయ తటవర్తి, శ్రావ్య శివాని, భువన కాల్వ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు నిక్కీ పునాచ ముందంజ వేశాడు. అండర్–18 బాలికల విభాగంలో రషి్మక భమిడిపాటి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–4, 6–3తో ప్రజ్వల్ దేవ్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరోసీడ్ దల్వీందర్ సింగ్ 7–6 (7/4), 7–5తో ఇక్బాల్‌పై, నాలుగో సీడ్ కునా ల్ ఆనంద్ 6–3, 7–6 (7/5)తో ఏడో సీడ్ నితిన్ కుమార్ సిన్హాపై, ఆర్యన్ 6–3, 6–7 (5/7), 6–3తో సూరజ్ ప్రబోద్పై నెగ్గారు. మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సౌజన్య భవిశెట్టి 6–2, 6–2తో సాల్సా అహర్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, శ్రేయ తటవర్తి (ఆంధ్రప్రదేశ్) 2–6, 5–7తో నాలుగో సీడ్ ప్రేరణ బాంబ్రీ చేతిలో, శ్రావ్య శివాని (తెలంగాణ) 1–6, 1–6తో వైదేహి చౌదరీ చేతిలో, రెండో సీడ్ భువన (తెలంగాణ) 4–6, 2–6తో జగ్మీగ్ కౌర్ చేతిలో పరాజయం పాలయ్యారు. అండ ర్–18 బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రష్మిక 6–4, 6–4తో టాప్ సీడ్ కశిష్ భాటియాను కంగుతినిపించింది. ఇతర మ్యాచ్‌ల్లో సందీప్తి 6–2, 6–4తో బేలా తంహాంకర్పై, పూజ 7–6 (7/4), 6–2 తో ప్రేరణ విచారేపై, రేష్మ 7–5, 6–2తో ఆకాంక్ష నిట్టూరేపై గెలుపొందారు. అండర్–18 బాలు ర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ మన్ మాలిక్ షా 6–2, 6–2తో ఉద్వీర్ సింగ్‌పై, కామత్ 6–3, 6–4తో కబీర్‌పై, రోహన్ 6–1, 7–5తో చిరాగ్‌పై, ఉదిత్ గొగోయ్ 4–6, 6–1, 6–4తో కృషన్ హుడాపై విజయం సాధించారు. టైటిల్ పోరుకు సాయిదేదీప్య జోడీ... డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వై. సాయిదేదీప్య టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఈ టోరీ్నలో సారా యాదవ్ (మధ్యప్రదేశ్)తో జతకట్టిన దేదీప్య డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 6–3, 3–6, 10–6తో అనూష (ఆంధ్రప్రదేశ్)–దక్షత పటేల్ (మహారాష్ట్ర) జోడీపై పోరాడి గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో సౌజన్య భవిశెట్టి (తెలంగాణ)–రిషిక సుంకర (ఢిల్లీ) జోడీతో సాయిదేదీప్య జంట తలపడుతుంది. -
చాంపియన్ శ్రీవల్లి రష్మిక
చెన్నై: తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక జాతీయ జూనియర్ క్లే కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌గా నిలిచింది. చెన్నైలో శనివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో శ్రీవల్లి 7–6(7/3), 2–6, 6–1తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. టైటిల్ కోసం ఇరువురు క్రీడాకారిణులు తీవ్రంగా శ్రమించారు. పోటాపోటీగా సాగిన మొదటిసెట్‌ను శ్రీవల్లి టై బ్రేక్‌లో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో పుంజుకున్న రేష్మా మరూరి 6–2తో సెట్‌ను కైవసం చేసుకుంది. విజేతను తేల్చే మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీవల్లి సెట్‌ను 6–1తో గెలిచి మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
ఫైనల్లో శ్రీవల్లి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో జరుగుతున్న జాతీయ జూనియర్ క్లే కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ఫైనల్‌కు చేరి అదరగొట్టింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీవల్లి 6–3, 7–5తో టోర్నీ ఎనిమిదో సీడ్ క్రీడాకారిణి సారా దేవ్ (పంజాబ్)ను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఆట ఆద్యంతం అద్భుతంగా ఆడిన శ్రీవల్లి వరుస సెట్లల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. -
రన్నరప్ సౌజన్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు సౌజన్య భవిశెట్టి, శ్రావ్యశివాని చిలకలపూడి రాణించారు. ట్యునీషియాలోని టబర్కా వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జంటగా మహిళల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. ఫైనల్లో నాలుగో సీడ్ సౌజన్య–శ్రావ్య శివాని జంట 2–6, 2–6తో మూడో సీడ్ ఎవా వెడెర్–స్టీఫెన్ జుడిత్ విసెర్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో సౌజన్య–శ్రావ్య శివాని ద్వయం 7–5, 3–6, 10–6తో రెండోసీడ్ అడెలినా బరవి–విక్టోరియా మిఖైలోవా (రష్యా) జంటను కంగుతినిపించింది. క్వార్టర్స్‌లో 6–3, 6–3తో అండ్రియానా పినో–గియా స్వార్‌సియాలుప్ (ఇటలీ) జోడీపై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–1తో ఒలింపి లాన్స్‌లాట్ (ఫ్రాన్స్)–డెనిజ్ పాకోవ్ (టర్కీ) జంటపై విజయం సాధించారు. సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ తొలిరౌండ్లోనే ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రావ్య శివాని 3–6, 1–6తో ఎనా కజెవిక్ (క్రొయే షియా) చేతిలో, రెండోసీడ్ సౌజన్య 1–6, 2–6తో స్టీఫెన్ జుడిత్ విసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లోనూ భారత క్రీడా కారులకు కలిసి రాలేదు. ప్రిక్వార్టర్స్‌లో తరుణ్ అనిరుధ్ చిలకలపూడి (భారత్)–మాజెద్ కిలాని (ట్యునీషియా) జంట 6–7 (7/9), 3–6తో నాలుగోసీడ్ ఇగ్నాసియో కారో–ఫెమిన్ టెంటి (అర్జెంటీనా) జంట చేతిలో... అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ (భారత్) ద్వయం 4–6, 5–7తో మూడోసీడ్ మాట్స్ హెర్మన్స్–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాయి. -
భారత రైల్వేస్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: యూఎస్‌ఐసీ ప్రపంచ రైల్వేస్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. బల్గేరియాలోని అల్బీనా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంది. 10 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో.... తెలంగాణ క్రీడాకారుడు పీసీ విఘ్నేశ్, నితిన్ కుమార్ సిన్హా (కోల్‌కతా), మొహమ్మద్ ఫహాద్, పృథ్వీ శేఖర్ (చెన్నై) సభ్యులుగా ఉన్న భారత బృందం విజేతగా నిలిచింది. 2015 జర్మనీలో జరిగిన టోర్నీలోనూ విఘ్నేశ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సూపర్ లీగ్ ఫైనల్లో భారత్ 4–0తో చెక్ రిపబ్లిక్‌పై గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో నితిన్ 6–4, 6–4తో సెరాఫిమ్ గ్రోజెవ్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్ మ్యాచ్‌లో ఫహాద్ 6–0, 6–1తో క్రాసిమిర్ స్టోయ్‌కోవ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో విఘ్నేశ్ 1–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో హ్రిస్టో బోయనోవ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. చివరి మ్యాచ్‌లో పృథ్వీ శేఖర్ 6–2, 6–2తో రాడోమిర్ టొనెవ్‌ను ఓడించి భారత్ విజయాన్ని పరిపూర్ణం చేశాడు. అంతకుముందు లీగ్ దశలో స్లోవేకియా, చెక్ రిపబ్లిక్‌లపై గెలుపొంది భారత్ ఎలిమినేషన్ రౌండ్‌కు అర్హత పొందింది. ఎలిమినేషన్ రౌండ్లో బెల్జియంపై నెగ్గి భారత్ సూపర్ లీగ్ దశకు చేరుకుంది. మూడు జట్లు తలపడిన ఈ సూపర్ లీగ్ పోరులో టీమిండియా ముందుగా బల్గేరియాపై, అనంతరం చెక్ రిపబ్లిక్‌పై విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
హుమేరా శుభారంభం
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో హుమేరా 7–6 (8/6), 0–6, 6–3తో ప్రతిభ నారాయణ్ (కర్ణాటక)పై గెలిచింది. అండర్–18 బాలికల సింగిల్స్‌లో హుమేరా మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్లో హుమేరా 6–1, 6–0తో చావి రాఠి (హరియాణా)ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన సామ సాత్విక, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కొండవీటి అనూష రెండో రౌండ్‌కు చేరారు. తొలి రౌండ్లో సాత్విక 6–1, 6–1తో వన్షిత (కర్ణాటక)పై, అనూష 2–6, 7–5, 6–0తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)పై గెలిచారు. అండర్–18 బాలికల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 6–2, 6–2తో సుదీప్త (మహారాష్ట్ర)పై, లక్ష్మి సాహితి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6–2, 6–2తో పూజ ఇంగ్లే (మహారాష్ట్ర)పై నెగ్గారు. స్మృతి భాసిన్ (తెలంగాణ) 1–6, 4–6తో త్రిషా వినోద్ (కేరళ) చేతిలో... సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 2–6, 5–7తో ఫర్హత్ కమర్ (రాజస్తాన్) చేతిలో... భక్తి షా (తెలంగాణ) 1–6, 5–7తో కశిష్ భాటియా (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు అండర్–18 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–2తో అథర్వ శర్మ (మహారాష్ట్ర)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. -
సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరుగుతున్న కెంటకీ బ్యాంక్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడైన సాకేత్ 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్ నార్బర్ట్ గొమ్బాస్ (స్లొవేకియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్స్ చేరాడు. గంటా 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 16 ఏస్‌లు సంధించడం విశేషం. మరోవైపు డబుల్స్‌లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ టాప్ సీడ్‌కు షాకిచ్చి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సాకేత్–ప్రశాంత్ 7–6 (7/5), 2–6, 10–6తో రువాన్ రోలొఫ్సే (దక్షిణాఫ్రికా)–ల్యూక్ సవిల్లె (ఆస్ట్రేలియా) జంటను ఓడించింది. -
రన్నరప్ సాయి కార్తీక్
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్–5 బాలుర టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయి కార్తీక్ రెడ్డి రాణించాడు. జోర్డాన్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 614వ స్థానంలో ఉన్న కార్తీక్ శనివారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో 2–6, 5–7తో అబెదల్లా షెల్‌బా (జోర్డాన్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో కార్తీక్ 6–3, 6–3తో మొహమ్మద్ బర్హామ్ (ట్యునీషియా)పై, క్వార్టర్స్‌లో 6–0, 7–5తో అర్జున్ మరియప్ప (అమెరికా)పై విజయాలు సాధించాడు. -
తెలంగాణ జట్టుకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అంతర్రాష్ట్ర టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఛత్తీస్‌గఢ్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో భిలాయ్‌లో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ సెమీస్‌లో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ 2–1తో తెలంగాణపై గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో శ్రావ్య శివాని (తెలంగాణ) 6–2, 4–6, 7–5తో శ్వేత రాణా (ఢిల్లీ)పై గెలుపొందడంతో తెలంగాణ 1–0తో ఆధిక్యాన్ని సాధించింది. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) 6–1, 6–1తో మౌళిక రామ్ (తెలంగాణ)పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో రిషిక సుంకర– ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) ద్వయం 6–0, 6–1తో సింధు జనగామ– శ్రావ్య శివాని (తెలంగాణ) జోడీపై నెగ్గడంతో తెలంగాణకు ఓటమి తప్పలేదు. -
సెమీస్‌లో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ అంతర్రాష్ట్ర టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు సెమీస్‌కు చేరింది. బుధవారం జరిగిన మహిళల టీమ్ ఈవెంట్ క్వార్టర్స్‌లో తెలంగాణ 2–1తో మధ్యప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో శ్రావ్య శివాని (తెలంగాణ) 6–1, 6–2తో అనీషా గణేశ్‌పై గెలుపొంది జట్టుకు 1–0తో ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో మౌళిక రామ్ (తెలంగాణ) 6–0తో ఆధిక్యంలో ఉన్న దశలో మ్యాచ్ నుంచి వైదొలగడంతో సారా యాదవ్ (మధ్యప్రదేశ్) ముందంజ వేసింది. దీంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో శ్రావ్య శివాని– జనగాం సింధు (తెలంగాణ) జంట 6–2, 1–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’ల సారాయాదవ్–అనీషా (మధ్యప్రదేశ్)పై నెగ్గడంతో తెలంగాణ సెమీస్‌కు చేరింది. -
సెమీస్‌లో శరణ్య, రిషిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ అండర్–12 టోర్నమెంట్లో శరణ్య, రిషిత్ సెమీస్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని డీఆర్సీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ శరణ్య 8–4తో తానియాపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో రిషిక 8–0తో గీతాంజలిపై, వి. వర్ష 8–6తో యశస్విపై, రహీన్ 8–3తో సం స్కృతిపై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో లలిత్ మోహన్ 8–7 (4)తో కోట శ్రీనాథ్‌పై, అర్మన్ సింగ్ 8–3తో హనోక్‌పై, శ్రీహరి 8–7 (7)తో రాజుపై, రిషిత్ 8–7 (5)తో ప్రణీత్ రాజుపై గెలుపొందారు. -
ఆసియా టెన్నిస్ చాంప్ సంజన
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ అండర్–14 చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జరిగిన ఈ టోర్నీలో 13 ఏళ్ల సంజన చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల తుది పోరులో సంజన 6–2, 6–2తో కుంకుమ్ నీల (తెలంగాణ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో సంజన 6–1, 4–6, 6–0తో హిత్వీ చౌదరి (గుజరాత్)పై గెలుపొందింది. -
సెమీస్‌లో భువన, సాత్విక
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు భువన కాల్వ, సామ సాత్విక సెమీఫైనల్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ ముందంజ వేయగా, నగరానికే చెందిన షేక్ హుమేరా, శ్రావ్య శివానిలు పరాజయం పాలయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో భువన (తెలంగాణ) 0–6, 6–4, 6–3తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)ను బోల్తా కొట్టించగా... షేక్ హుమేరా (తెలంగాణ) 2–6, 4–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు అండర్–18 బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో సామ సాత్విక (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో ప్రేరణ విచారే (మహారాష్ట్ర)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరుకోగా, శ్రావ్య శివాని (తెలంగాణ) 2–6, 1–6తో తనీషా కశ్యప్ (అస్సాం) చేతిలో, షేక్ హుమేరా (తెలంగాణ) 1–6, 3–6తో వైదేహి చౌదరి (గుజరాత్) చేతిలో పరాజయం పాలయ్యారు. టైటిల్ పోరుకు సాయిదేదీప్య జోడి ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారాయాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్–18 బాలికల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో దేదీప్య–సారాయాదవ్ ద్వయం 6–4, 6–1తో సోహా–సృష్టి జంటపై విజయం సాధించింది. ఫైనల్లో సాయిదేదీప్య జోడి స్నేహా రెడ్డి (తమిళనాడు)–శ్వేతా రాణా (ఢిల్లీ) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో షేక్ హుమేరా, భువన
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు భువన కాల్వ, షేక్ హుమేరా నిలకడగా రాణిస్తున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భువన కాల్వ (తెలంగాణ) 6–2, 6–4తో మూడో సీడ్ శ్వేత రాణా (ఢిల్లీ)ను కంగుతినిపించింది. మరో మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌలిక రామ్ 0–6, 0–6తో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయింది. అండర్–18 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ షేక్ హుమేరా (తెలంగాణ) 6–1, 6–2తో ప్రింకెల్ సింగ్ (జమ్ము, కశ్మీర్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హుమేరాతో పాటు రాష్ట్రానికి చెందిన శ్రావ్య శివాని, సామ సాత్విక క్వార్టర్స్‌కు చేరుకోగా సాయిదేదీప్యకు చుక్కెదురైంది. శ్రావ్య శివాని 6–0, 6–1తో భక్తి పర్వాని (గుజరాత్)పై, పదమూడో సీడ్ సామ సాత్విక 6–2, 6–3తో నాలుగో సీడ్ సల్సా అహెర్ (మహారాష్ట్ర)పై గెలుపొందారు. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య 2–6, 2–6తో ప్రేర ణ (మహారాష్ట్ర) చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య సింగిల్స్‌లో పరాజయం పాలైనప్పటికీ డబుల్స్‌లో దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారా యాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్–18 బాలికల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 7–5, 4–6, 10–6తో అక్షర ఇస్కా– మౌలిక రామ్ (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య జోడీ సృష్టి దాస్ (మహారాష్ట్ర)–సోహా (కర్ణాటక) జంటతో తలపడుతుంది. -
టీమ్ టెన్నిస్ చాంప్ ఎస్‌బీఓఏ
సౌత్‌జోన్ సీబీఎస్ఈ ఇంటర్ స్కూల్ టోర్నీ హైదరాబాద్: సౌత్‌జోన్ సీబీఎస్ఈ ఇంటర్ స్కూల్ టెన్నిస్ టోర్నమెంట్లో తమిళనాడుకు చెందిన ఎస్‌బీఓఏ అమ్మాయిల జట్టు అండర్-14 విభాగంలో విజేతగా నిలిచింది. ఇండస్ యూనివర్సల్ స్కూల్లో సోమవారం జరిగిన బాలికల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఎస్‌బీఓఏ జట్టు 2-1తో డీపీఎస్ (బెంగళూరు)పై గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో దీపాలక్ష్మి (ఎస్‌బీఓఏ) 1-8తో సంస్కృతి చేతిలో పరాజయం చవిచూడగా... రెండో సింగిల్స్‌లో అనన్య (ఎస్‌బీఓఏ) 8-6తో రష్మీపై గెలిచింది. నిర్ణాయక డబుల్స్‌లో అనన్య-దీపాలక్ష్మి (ఎస్‌బీఓఏ) జోడి 8-3తో సంస్కృతి-రష్మి జంటపై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో పేస్ జంట
లండన్ : ఎగాన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో లియాండర్ పేస్ (భారత్)-మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ పేస్-గ్రానోలెర్స్ ద్వయం 3-6, 6-2, 11-9తో ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)-స్కాట్ లిప్స్కీ (అమెరికా) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో పేస్ తన కెరీర్లో 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగాడు. తొలి సెట్‌ను కోల్పోయిన పేస్ జంట రెండో సెట్లో తేరుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత్‌కు కాంస్య పతకాలు
థాయ్‌లాండ్ ఓపెన్ టీటీ బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ క్యాడెట్, జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత బాలికల జట్లకు కాంస్య పతకాలు లభించాయి. క్యాడెట్‌తోపాటు జూనియర్ విభాగంలోనూ భారత జట్ల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో క్యాడెట్ జట్టు 2-3 తేడాతో హాంకాంగ్ చేతిలో... జూనియర్ జట్టు 0-3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డాయి. ఈ టోర్నీలో భారత్ తరఫున తెలంగాణ క్రీడాకారిణులు వరుణీ జైస్వాల్, ఆకుల శ్రీజ జూనియర్ విభాగంలోపాల్గొన్నారు.