సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు భువన కాల్వ, షేక్ హుమేరా నిలకడగా రాణిస్తున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భువన కాల్వ (తెలంగాణ) 6–2, 6–4తో మూడో సీడ్ శ్వేత రాణా (ఢిల్లీ)ను కంగుతినిపించింది. మరో మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌలిక రామ్ 0–6, 0–6తో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయింది. అండర్–18 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ షేక్ హుమేరా (తెలంగాణ) 6–1, 6–2తో ప్రింకెల్ సింగ్ (జమ్ము, కశ్మీర్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హుమేరాతో పాటు రాష్ట్రానికి చెందిన శ్రావ్య శివాని, సామ సాత్విక క్వార్టర్స్‌కు చేరుకోగా సాయిదేదీప్యకు చుక్కెదురైంది. శ్రావ్య శివాని 6–0, 6–1తో భక్తి పర్వాని (గుజరాత్)పై, పదమూడో సీడ్ సామ సాత్విక 6–2, 6–3తో నాలుగో సీడ్ సల్సా అహెర్ (మహారాష్ట్ర)పై గెలుపొందారు. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య 2–6, 2–6తో ప్రేర ణ (మహారాష్ట్ర) చేతిలో పరాజయం పాలైంది.
సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ
హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య సింగిల్స్‌లో పరాజయం పాలైనప్పటికీ డబుల్స్‌లో దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారా యాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్–18 బాలికల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 7–5, 4–6, 10–6తో అక్షర ఇస్కా– మౌలిక రామ్ (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య జోడీ సృష్టి దాస్ (మహారాష్ట్ర)–సోహా (కర్ణాటక) జంటతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment