సుమధురం... ఈ విజయం!  | Sania Mirza Comments After Qualifying For Fed Cup Playoffs | Sakshi
Sakshi News home page

సుమధురం... ఈ విజయం! 

Published Mon, Mar 9 2020 9:58 AM | Last Updated on Mon, Mar 9 2020 9:59 AM

Sania Mirza Comments After Qualifying For Fed Cup Playoffs - Sakshi

కోచ్‌ విశాల్‌ ఉప్పల్‌, అంకిత్‌ రైనా, రియా భాటియా, సానియా, రుతుజా భోనలే, సౌజన్య భవిశెట్టి(ఎడమ నుంచి)

సాక్షి, హైదరాబాద్‌: 7–3–2020.. భారత మహిళల టెన్నిస్‌ చరిత్రలో మరపురాని రోజు. ఎన్నేళ్లుగానో ఊరిస్తూ వస్తోన్న ఫలితాన్ని రాబట్టిన రోజు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫెడ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన భారత్‌... తొలిసారి వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. ఈ అద్భుతాన్ని సాకారం చేసిన భారత జట్టులోని సానియా మీర్జా, సౌజన్య భవిశెట్టి, అంకిత రైనా, రుతుజా భోసలే, రియా భాటియా తమ మనసులోని మాటను చెప్పారు. వారేమన్నారంటే... (భారత మహిళల టెన్నిస్‌ జట్టు కొత్త చరిత్ర)

భారత మహిళల టెన్నిస్‌కు ఇదో గొప్ప రోజు. నా కెరీర్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో ఈ గొప్ప క్షణాలను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేము ఇంతకు ముందెన్నడూ ఇటువంటి ఫలితాన్ని రాబట్టలేదు. జట్టుగా మేము ఆడిన తీరు అమోఘం. అందులో నా పాత్ర కూడా ఉండటం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ టోర్నీలో నా ఆటతీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నా. డబుల్స్‌ విభాగంలో నేను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించా. 
–సానియా మీర్జా  

ఈ విజయం వల్ల వచ్చిన అనుభూతిని ప్రస్తుతం నేను మాటల్లో వర్ణించలేను. మేము మొదటిసారి వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. దీనిని సాధించడానికి జట్టుగా మేము చాలా శ్రమించాం.   
 –సౌజన్య భవిశెట్టి 

గొప్పగా ఉంది. ఇటువంటి క్షణాలను ఆస్వాదించడం ఇదే మాకు తొలిసారి. మా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కోచ్‌కు, మిగతా జట్టు సభ్యులకు, మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ఒకే సమయంలో సింగిల్స్, డబుల్స్‌ ఆడటం కాస్త కష్టంగా అనిపించింది. సానియాతో డబుల్స్‌ ఆడటం గొప్ప అనుభూతి.
 –అంకిత రైనా. 

చాలా కఠినంగా సాగిన వారం అయినప్పటికీ గొప్ప ఫలితంతో ముగించాం. ఇటువంటి ఫలితాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. జట్టులోని ప్రతి ఒక్కరూ వంద శాతం కష్టపడ్డారు. నేను కొన్ని సార్లు ఓడి జట్టుకు శుభారంభం అందించలేకపోయాను. అయినప్పటికీ మిగతా జట్టు సభ్యులు ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవడం ఆనందాన్నిచ్చింది. 
–రుతుజా 

ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు. మేము చరిత్ర సృష్టించాం. మిగతా జట్టు సభ్యులు చాలా బాగా ఆడారు. వారికి 
నా అభినందనలు. టోర్నీ తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో ఓడినా... తర్వాత మేము పుంజుకున్న తీరు అద్భుతం. జట్టులో సానియా లాంటి అనుభవజ్ఞురాలు ఉండటం మాకు కలిసొచ్చింది. కీలక సమయంలో ఆమె సలహాలు ఉపయోగపడ్డాయి. 
–రియా భాటియా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement