Fed Cup Tournament
-
సుమధురం... ఈ విజయం!
సాక్షి, హైదరాబాద్: 7–3–2020.. భారత మహిళల టెన్నిస్ చరిత్రలో మరపురాని రోజు. ఎన్నేళ్లుగానో ఊరిస్తూ వస్తోన్న ఫలితాన్ని రాబట్టిన రోజు. దుబాయ్ వేదికగా జరిగిన ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన భారత్... తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. ఈ అద్భుతాన్ని సాకారం చేసిన భారత జట్టులోని సానియా మీర్జా, సౌజన్య భవిశెట్టి, అంకిత రైనా, రుతుజా భోసలే, రియా భాటియా తమ మనసులోని మాటను చెప్పారు. వారేమన్నారంటే... (భారత మహిళల టెన్నిస్ జట్టు కొత్త చరిత్ర) భారత మహిళల టెన్నిస్‌కు ఇదో గొప్ప రోజు. నా కెరీర్‌లోని రెండో ఇన్నింగ్స్‌లో ఈ గొప్ప క్షణాలను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేము ఇంతకు ముందెన్నడూ ఇటువంటి ఫలితాన్ని రాబట్టలేదు. జట్టుగా మేము ఆడిన తీరు అమోఘం. అందులో నా పాత్ర కూడా ఉండటం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ టోర్నీలో నా ఆటతీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నా. డబుల్స్ విభాగంలో నేను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించా. –సానియా మీర్జా ఈ విజయం వల్ల వచ్చిన అనుభూతిని ప్రస్తుతం నేను మాటల్లో వర్ణించలేను. మేము మొదటిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. దీనిని సాధించడానికి జట్టుగా మేము చాలా శ్రమించాం. –సౌజన్య భవిశెట్టి గొప్పగా ఉంది. ఇటువంటి క్షణాలను ఆస్వాదించడం ఇదే మాకు తొలిసారి. మా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కోచ్‌కు, మిగతా జట్టు సభ్యులకు, మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ఒకే సమయంలో సింగిల్స్, డబుల్స్ ఆడటం కాస్త కష్టంగా అనిపించింది. సానియాతో డబుల్స్ ఆడటం గొప్ప అనుభూతి. –అంకిత రైనా. చాలా కఠినంగా సాగిన వారం అయినప్పటికీ గొప్ప ఫలితంతో ముగించాం. ఇటువంటి ఫలితాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. జట్టులోని ప్రతి ఒక్కరూ వంద శాతం కష్టపడ్డారు. నేను కొన్ని సార్లు ఓడి జట్టుకు శుభారంభం అందించలేకపోయాను. అయినప్పటికీ మిగతా జట్టు సభ్యులు ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవడం ఆనందాన్నిచ్చింది. –రుతుజా ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు. మేము చరిత్ర సృష్టించాం. మిగతా జట్టు సభ్యులు చాలా బాగా ఆడారు. వారికి నా అభినందనలు. టోర్నీ తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో ఓడినా... తర్వాత మేము పుంజుకున్న తీరు అద్భుతం. జట్టులో సానియా లాంటి అనుభవజ్ఞురాలు ఉండటం మాకు కలిసొచ్చింది. కీలక సమయంలో ఆమె సలహాలు ఉపయోగపడ్డాయి. –రియా భాటియా -
భారత మహిళల టెన్నిస్ జట్టు కొత్త చరిత్ర
దుబాయ్: టెన్నిస్ అభిమానులకు భారత మహిళల జట్టు తీపి కబురు అందించింది. ఫెడ్ కప్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. శనివారం ముగిసిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి ఈ ఘనత సాధించింది. చైనా టాప్ ర్యాంక్‌లో నిలిచి భారత్‌తో కలిసి ప్లే ఆఫ్ దశకు బెర్త్ దక్కించుకుంది. శనివారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా 3–6, 6–0, 3–6తో ప్రిస్కా చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 6–3, 6–3తో అల్దీలా సుత్‌జియాదిపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా ద్వయం 7–6 (7/4), 6–0తో సుత్జియాది–నుగ్రోహో జంటను ఓడించి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్‌లో జరిగే ప్లే ఆఫ్‌లో లాత్వియా లేదా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడుతుంది. -
భారత్‌కు రెండో గెలుపు
దుబాయ్: ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో విజయం లభించింది. దక్షిణ కొరియాతో గురవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోసలే 7–5, 6–4తో జాంగ్ సు జియోంగ్ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 4–6, 0–6తో నా లే హాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా జంట 6–4, 6–4తో నా లే హాన్–నా రి కిమ్ జోడీపై గెలిచి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. -
ఫెడ్ కప్ విజేత ఫ్రాన్స్
పెర్త్: ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ్రస్టేలియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 3–2తో గెలిచింది. 56 ఏళ్ల చరిత్ర కలిగిన ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. ఆ జట్టు మొదటిసారి 2003లో చాంపియన్‌గా నిలిచింది. తొలి రోజు శనివారం ఇరు జట్లు చెరో సింగిల్స్‌లో గెలిచి 1–1తో సమంగా నిలిచాయి. రెండో రోజు జరిగిన మూడో సింగిల్స్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్ 2–6, 6–4, 7–6 (7/1)తో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా)పై నెగ్గి ఫ్రాన్స్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. అయితే నాలుగో సింగిల్స్‌లో అలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా) 6–4, 7–5తో పౌలీన్ పర్మాంటీర్ను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్–కరోలినా గార్సియా ద్వయం 6–4, 6–3తో యాష్లే బారీ్ట–సమంతా స్టోసుర్ (ఆ్రస్టేలియా)పై గెలిచి ఫ్రాన్స్ జట్టుకు ఫెడ్ కప్‌ను అందించింది. -
భారత్‌ను గెలిపించిన అంకిత
ఆస్తానా (కజకిస్తాన్): ప్రతిష్టాత్మక ఫెడ్‌కప్‌లో భారత్ శుభారంభం చేసింది. భారత నెం.1 టెన్నిస్ సింగిల్స్ ప్లేయర్ అంకిత రైనా కీలక సమయంలో రాణించడంతో ఈ టోర్నమెంట్లో భారత్ ముందంజ వేసింది. గురువారం జరిగిన పోరులో 2–1తో థాయిలాండ్‌పై విజయం సాధించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 211వ ర్యాంకర్ కర్మన్ కౌర్ తాండి (భారత్) 2–6, 6–3, 3–6తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 712వ స్థానంలో ఉన్న నుడిండా లాంగమ్ చేతిలో పరాజయం పాలైంది. రెండో సింగిల్స్‌లో అంకిత 6–7 (3), 6–2, 6–4తో పియాంగ్‌టాన్ ప్లిపుచ్ (థాయిలాండ్)పై పోరాడి నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకిత–కర్మన్ ద్వయం 6–4, 6–7 (6), 7–5తో పియాంగ్‌టాన్–నుడిండా జోడీపై కష్టపడి గెలిచి ఊపిరి పీల్చుకుంది. భారత్ శుక్రవారం జరిగే తదుపరి పోరులో కజకిస్తాన్‌తో తలపడుతుంది. -
సెరెనా ఆడింది... సోదరి జతగా
అషేవిల్లే (అమెరికా): అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆట మొదలైంది. అమ్మ హోదా వచ్చాక అధికారిక టోర్నమెంట్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమెకు పరాజయమే ఎదురైంది. ఫెడ్ కప్ టీమ్ టోర్నమెంట్లో సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన సెరెనా 2–6, 3–6తో లెస్లే కెర్కోవ్–డెమి షర్స్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడింది. 36 ఏళ్ల సెరెనా గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ తర్వాత మళ్లీ రాకెట్ పట్టడం ఇదే మొదటిసారి. వారాల గర్భంతోనే టైటిల్ సాధించిన ఆమె ఇప్పుడు తన గారాలపట్టి ఒలింపియా (ఐదు నెలల కుమార్తె)ను ప్రేక్షకుల గ్యాలరీలో ఉంచి కోర్టులో ఆడింది. ఈ టీమ్ చాంపియన్‌షిప్‌లో 15 ఏళ్ల తర్వాత విలియమ్స్ సిస్టర్స్ జోడీ కట్టడం మరో విశేషం. 2003 తర్వాత జతగా ఈ ఇద్దరు ఫెడ్‌కప్ ఆడలేకపోయారు. అయితే చివరి సారిగా ఇద్దరు కలిసి ఆడిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (2016)లో మాత్రం డబుల్స్ టైటిల్ నెగ్గారు. మ్యాచ్ ముగిశాక సెరెనా మాట్లాడుతూ ‘కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. తిరిగి నా ఆట నేను తేలిగ్గా ఆడేందుకు సోదరి వీనస్ జత కావడమే కారణం’ అని చెప్పింది. డబుల్స్‌లో అమెరికన్ జోడీ ఓడినప్పటికీ సింగిల్స్‌లో వీనస్... రిచెల్ హొగెన్కెంప్పై విజయం సాధించడంతో అమెరికా జట్టు 3–1తో నెదర్లాండ్స్‌పై గెలిచి సెమీఫైనల్స్ చేరింది. మ్యాచ్ వీక్షిస్తున్న సెరెనా భర్త అలెక్సిస్, కుమార్తె ఒలింపియా -
గ్రూప్–1లోనే భారత్
న్యూఢిల్లీ: ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా టెన్నిస్ టోర్నమెంట్ గ్రూప్–1లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఇప్పటికే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన భారత్ శనివారం చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో 2–0తో గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ థండి గెలుపొందడం... రెండో మ్యాచ్‌లో అంకిత జోరు కొనసాగించడంతో భారత్ విజయంతో టోర్నీని ముగించింది. తొలి మ్యాచ్‌లో కర్మన్‌కౌర్ 7–6 (7/4), 6–3తో లీ పై చీపై విజయం సాధించడం ద్వారా 1–0 ఆధిక్యం అందించింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌లో అంకిత 6–4, 5–7, 6–1తో ప్రపంచ 377వ ర్యాంకర్ చియె యూ సూపై గెలుపొందింది. 2 గంటల 54 నిమిషాల పాటు సాగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో అంకిత అద్భుత ప్రదర్శన కనబర్చింది. టోర్నీలో అంకిత నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం. -
ప్లే ఆఫ్‌కు భారత్
♦ మలేసియాపై ఘన విజయం ♦ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్ : ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో భారత జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో మలేసియాను చిత్తు చేసింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన మొదటి సింగిల్స్‌లో ప్రార్థనా తోంబరే 6-1, 6-0తో నబీలా బిన్తిని చిత్తు చేసింది. రెండో సింగిల్స్ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకితా రైనా 6-1, 3-6, 6-4తో జవైరియా నూర్దిన్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఏకంగా 2 గంటల 18 నిమిషాల పాటు సాగింది. డబుల్స్‌లో కూడా భారత్‌దే పైచేయి అయింది. ప్రార్థన-నటాషా జోడి 6-0, 6-2తో సెల్వరజూ-నబీలా బిన్తి జంటపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కూడా సానియా మీర్జా బరిలోకి దిగలేదు. భారత్ ప్రత్యర్థి తుర్క్మెనిస్తాన్ మరో వైపు ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, తుర్క్మెనిస్తాన్ జట్లు కూడా ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఇండోనేసియా 3-0తో శ్రీలంకపై, తుర్క్మెనిస్తాన్ 3-0తో కిర్గిస్తాన్‌పై గెలుపొందాయి. సింగపూర్‌పై గెలిచి గ్రూప్ ‘ఎ’ నుంచి ఫిలిప్పీన్స్ తొలి రోజే ప్లే ఆఫ్ చేరింది. శుక్రవారం జరిగే తొలి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తుర్క్‌మెనిస్తాన్‌తో భారత్... మరో మ్యాచ్‌లో ఇండోనేసియాతో ఫిలిప్పీన్స్ తలపడతాయి.