సెరెనా విలియమ్స్
అషేవిల్లే (అమెరికా): అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆట మొదలైంది. అమ్మ హోదా వచ్చాక అధికారిక టోర్నమెంట్‌లో తొలిసారి బరిలోకి దిగిన ఆమెకు పరాజయమే ఎదురైంది. ఫెడ్ కప్ టీమ్ టోర్నమెంట్‌లో సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన సెరెనా 2–6, 3–6తో లెస్లే కెర్కోవ్–డెమి షర్స్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడింది. 36 ఏళ్ల సెరెనా గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ తర్వాత మళ్లీ రాకెట్ పట్టడం ఇదే మొదటిసారి. వారాల గర్భంతోనే టైటిల్ సాధించిన ఆమె ఇప్పుడు తన గారాలపట్టి ఒలింపియా (ఐదు నెలల కుమార్తె)ను ప్రేక్షకుల గ్యాలరీలో ఉంచి కోర్టులో ఆడింది.
ఈ టీమ్ చాంపియన్‌షిప్‌లో 15 ఏళ్ల తర్వాత విలియమ్స్ సిస్టర్స్ జోడీ కట్టడం మరో విశేషం. 2003 తర్వాత జతగా ఈ ఇద్దరు ఫెడ్‌కప్ ఆడలేకపోయారు. అయితే చివరి సారిగా ఇద్దరు కలిసి ఆడిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (2016)లో మాత్రం డబుల్స్ టైటిల్ నెగ్గారు. మ్యాచ్ ముగిశాక సెరెనా మాట్లాడుతూ ‘కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. తిరిగి నా ఆట నేను తేలిగ్గా ఆడేందుకు సోదరి వీనస్ జత కావడమే కారణం’ అని చెప్పింది. డబుల్స్‌లో అమెరికన్ జోడీ ఓడినప్పటికీ సింగిల్స్‌లో వీనస్... రిచెల్ హొగెన్‌కెంప్‌పై విజయం సాధించడంతో అమెరికా జట్టు 3–1తో నెదర్లాండ్స్‌పై గెలిచి సెమీఫైనల్స్ చేరింది.
మ్యాచ్ వీక్షిస్తున్న సెరెనా భర్త అలెక్సిస్, కుమార్తె ఒలింపియా
Comments
Please login to add a commentAdd a comment