ఆస్తానా (కజకిస్తాన్): ప్రతిష్టాత్మక ఫెడ్‌కప్‌లో భారత్ శుభారంభం చేసింది. భారత నెం.1 టెన్నిస్ సింగిల్స్ ప్లేయర్ అంకిత రైనా కీలక సమయంలో రాణించడంతో ఈ టోర్నమెంట్‌లో భారత్ ముందంజ వేసింది. గురువారం జరిగిన పోరులో 2–1తో థాయిలాండ్‌పై విజయం సాధించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 211వ ర్యాంకర్ కర్మన్ కౌర్ తాండి (భారత్) 2–6, 6–3, 3–6తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 712వ స్థానంలో ఉన్న నుడిండా లాంగమ్ చేతిలో పరాజయం పాలైంది. రెండో సింగిల్స్‌లో అంకిత 6–7 (3), 6–2, 6–4తో పియాంగ్‌టాన్ ప్లిపుచ్ (థాయిలాండ్)పై పోరాడి నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకిత–కర్మన్ ద్వయం 6–4, 6–7 (6), 7–5తో పియాంగ్‌టాన్–నుడిండా జోడీపై కష్టపడి గెలిచి ఊపిరి పీల్చుకుంది. భారత్ శుక్రవారం జరిగే తదుపరి పోరులో కజకిస్తాన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment